కెప్టెన్‌‌ను వెనకేసుకురావడం తప్పే.. సీడబ్ల్యూసీ మీట్‌లో సోనియా ఒప్పుకోలు

ABN , First Publish Date - 2022-03-14T23:34:23+05:30 IST

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయంపై ఆదివారంనాడు సమావేశమైన..

కెప్టెన్‌‌ను వెనకేసుకురావడం తప్పే.. సీడబ్ల్యూసీ మీట్‌లో సోనియా ఒప్పుకోలు

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయంపై ఆదివారంనాడు సమావేశమైన సిడబ్ల్యూసీ అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకునేందుకు, సోనియాగాంధీ నాయకత్వంలో కొనసాగేందుకు నిర్ణయం తీసుకుంది. ఇదే సమావేశంలో పంజాబ్ ఓటమిపై చర్చిస్తూ, కెప్టె్న్ అమరీందర్‌ సింగ్‌ను ప్రతిసారి తాను వెనకేసు వచ్చి తప్పు చేసినట్టు సోనియాగాంధీ అంగీకరించినట్టు సమాచారం.


పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత పోరాటాన్ని ఆ రాష్ట్ర ఇన్‌చార్జి హరీష్ చౌదరి ఈ సమావేశంలో ప్రస్తావిస్తూ, కెప్టెన్ అమరీందర్‌ సింగ్‌ను ఆలస్యంగా సీఎం పదవి నుంచి తొలగించడం కూడా రాష్ట్రంలో పార్టీ తిరిగి అధికారంలోకి రాకపోవడానికి ఒక ప్రధాన కారణమని పేర్కొన్నారు. అమరీందర్‌ను తొలగించాలని పార్టీ అధిష్ఠానం కోరుకుని ఉంటే ఆ పని ముందే చేసి ఉండాల్సిందని, అలా చేసి ఉంటే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత ఎన్నికల సమయానికి సద్దుమణిగేదని మరో కాంగ్రెస్ నేత   అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై సోనియాగాంధీ స్పందిస్తూ, ఈ విషయంలో తన తప్పిదం కూడా ఉందన్నారు. ఆయనపై (కెప్టె్న్) ఫిర్యాదులు వచ్చిన ప్రతిసారి ఆయనను తాను సమర్ధిస్తూ వచ్చానని, ఆ రకంగా తాను తప్పడగుగు వేశానని అంగీకరించారు.


అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు గత సెప్టెంబర్‌లో కెప్టెన్ చేత కాంగ్రెస్ అధిష్ఠానం రాజీనామా చేయించింది. ఆయన స్థానంలో చరణ్ జిత్ సింగ్ చన్నీకి సీఎం పగ్గాలు అప్పగించింది. దీంతో అలిగిన కెప్టెన్ గత నవంబర్‌లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సొంతగా పార్టీ పెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగారు. 'ఆప్' హవాలో కాంగ్రెస్‌ పార్టీ అధికారం కోల్పోవడంతో పాటు, కెప్టెన్ సైతం ఓటమి చవిచూశారు. 



Updated Date - 2022-03-14T23:34:23+05:30 IST