జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకాకు.. ఎఫ్‌డీఏ పచ్చజెండా

ABN , First Publish Date - 2021-03-01T13:02:49+05:30 IST

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ అభివృద్ధిచేసిన సింగిల్‌ డోసు కరోనా టీకాకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసింది. దీంతో ఫైజర్‌, మోడెర్నా వ్యాక్సిన్ల తర్వాత మూడో టీకా అమెరికా మా

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకాకు.. ఎఫ్‌డీఏ పచ్చజెండా

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 28 : జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ అభివృద్ధిచేసిన సింగిల్‌ డోసు కరోనా టీకాకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు చేసింది. దీంతో ఫైజర్‌, మోడెర్నా వ్యాక్సిన్ల తర్వాత మూడో టీకా అమెరికా మార్కెట్లో అందుబాటులోకి వచ్చేందుకు మార్గం సుగమమైంది. తీవ్ర కొవిడ్‌ ఇన్ఫెక్షన్‌ కలిగిన రోగులపై 85 శాతం ప్రభావవంతంగా పనిచేసే సామర్థ్యం ఈ వ్యాక్సిన్‌ సొంతమని ఎఫ్‌డీఏ వెల్లడించింది. మూడు ఖండాల్లోని పలు దేశాల్లో భారీ ఎత్తున నిర్వహించిన ప్రయోగ పరీక్షల్లో ఈవిషయాన్ని గుర్తించినట్లు తెలిపింది. వేగంగా వ్యాపిస్తున్న దక్షిణాఫ్రికా కరోనా స్ట్రెయిన్‌కు వ్యతిరేకంగా బలమైన రోగ నిరోధక ప్రతిస్పందనను కలిగించడంలోనూ జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకా సఫలమైందని పేర్కొంది. అమెరికా ప్రభుత్వంతో కుదిరిన ముందస్తు ఒప్పందంప్రకారం.. మార్చి 1 నుంచే పలు రాష్ట్రాలకు డోసుల పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానుంది. మార్చి నెలాఖరుకల్లా 2 కోట్ల డోసులు, ఆగస్టు నాటికి మొత్తం 10 కోట్ల డోసులను పంపిణీ చేయనున్నారు.43,783 మందిపై నిర్వహించిన మూడోదశ ట్రయల్స్‌లో.. ఈ టీకా వేసుకున్న 28 రోజుల తర్వాత సగటున 66 శాతం ప్రభావశీలతను గుర్తించారు. రెండు డోసుల టీకాలైన మోడెర్నా, ఫైజర్‌ల ప్రభావశీలత 94 శాతం, 95 శాతంగా ఉంది. ఈనేపథ్యంలో తమ టీకా ప్రభావశీలతను పోటీసంస్థల వ్యాక్సిన్లకు దీటుగా పెంచేందుకుగానూ రెండు డోసుల అభివృద్ధిపైనా జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ దృష్టి సారించింది. కాగా, భారత్‌లో ఈ టీకా ఉత్పత్తిని హైదరాబాద్‌లోని బయొలాజికల్‌-ఈ కంపెనీ చేపట్టనుంది. దీని అత్యవసర వినియోగానికి బహ్రెయిన్‌ దేశం ఫిబ్రవరి 25నే ఆమోదం తెలిపింది. 


Updated Date - 2021-03-01T13:02:49+05:30 IST