అంగన్‌వాడీల్లో భయం!

ABN , First Publish Date - 2021-04-23T10:58:59+05:30 IST

సెకండ్‌ వేవ్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి వణుకు పుట్టిస్తోంది. ముఖ్యంగా చిన్నపిల్లలపై వైరస్‌ పంజా విసురుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఒకటి నుంచి 9వ తరగతి వరకు సెలవులు ఇచ్చేసింది.

అంగన్‌వాడీల్లో భయం!

స్కూళ్లకు సెలవులిచ్చినా అవి కొనసాగింపు

కరోనా భయాందోళనలో సిబ్బంది


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

సెకండ్‌ వేవ్‌లో కరోనా వైరస్‌ వ్యాప్తి వణుకు పుట్టిస్తోంది. ముఖ్యంగా చిన్నపిల్లలపై వైరస్‌ పంజా విసురుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఒకటి నుంచి 9వ తరగతి వరకు సెలవులు ఇచ్చేసింది. కానీ.. 3-4 ఏళ్ల చిన్నపిల్లలకు సంబంధించిన అంగన్‌వాడీలను మాత్రం మరిచిపోయింది. కరోనా రెండో దశ వ్యాప్తిలో చిన్నారులపై వైరస్‌ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అంగన్‌వాడీలను కొనసాగించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 55 వేల అంగన్‌వాడీ కేంద్రాల్లో లక్షకుపైగా సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ కేంద్రాలకు ఇంతవరకు సెలవులు ప్రకటించలేదు. సాధారణంగా వేసవిలో అంగన్‌వాడీ కార్యకర్తలకు, హెల్పర్లకు 15 రోజులు సెలవులిస్తారు. కరోనా సమయంలో ఆ సెలవులు కూడా వాడుకోనీయకుండా అంగన్‌వాడీలు నిర్వహించాలని ఆదేశాలు జారీచేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


కరోనా జాగ్రత్తలు అంతంత మాత్రమే...

కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న సమయంలో అంగన్‌వాడీలకు సెలవులివ్వకపోవడాన్ని పిల్లల తల్లిదండ్రులు కూడా తప్పుబడుతున్నారు. పిల్లలను పంపకపోతే వారికందించే పోషకాహారానికి కోతపెడతారన్న ఆందోళన కొంతమంది తల్లిదండ్రుల్లో ఏర్పడింది. కొందరేమో కరోనా భయంతో పిల్లలను పంపించడానికి సాహసించడం లేదు. కొవిడ్‌-19 తొలి దశలో పిల్లలపై కరోనా ప్రభావం లేదు. అయినప్పటికీ అప్పుడు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలతో అంగన్‌వాడీలకు సెలవులిచ్చారు. ఇప్పుడు పిల్లల ద్వారానే ఆయా కుటుంబాల్లో కొవిడ్‌ విస్తరిస్తుందన్న ప్రచారం జరుగుతోంది. పైగా అంగన్‌వాడీలో కొవిడ్‌ జాగ్రత్తలు పాటించడం లేదు. భౌతిక దూరం, మాస్క్‌లు, శానిటైజర్లు వాడకం గురించి తెలియని పిల్లలకు సెలవులు ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. 


కాంట్రాక్టర్లు, అధికారుల కోసమేనా?

అంగన్‌వాడీ కేంద్రాలు మూతపడితే సరుకులు సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు ఆగిపోతాయని, టీహెచ్‌ఆర్‌ (టేక్‌ హోం రేషన్‌) ఇచ్చినప్పటికీ ప్రతి వారం వేసే సరుకుల బిల్లులు ఆగిపోతాయని కాంట్రాక్టర్లు ఒత్తిడి చేయడం వల్లనే సెలవులివ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్లకు అండగా ఉంటూ అధికారులు కూడా తమపై ఒత్తిడి చేస్తున్నారని కొందరు సిబ్బంది వాపోతున్నారు.


అధికారులు పిల్లల రక్షణపై దృష్టి సారించడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. మరో పక్క రెండు నెలల నుంచి అంగన్‌వాడీ సిబ్బంది తమకు జీతాలు అందలేదని వాపోతున్నారు. కరోనా కల్లోలంలో వైరస్‌ సోకితే తమ పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతంత మాత్రం జీతాలతో నెట్టుకొస్తున్న కుటుంబాలు రోడ్డున పడుతాయని భయపడుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అంగన్‌వాడీలకు సెలవులివ్వాలని కోరుతున్నారు.

Updated Date - 2021-04-23T10:58:59+05:30 IST