కబ్జాదారుల్లో గుబులు

ABN , First Publish Date - 2020-12-03T06:05:53+05:30 IST

జిల్లాలో దుమారం రేపుతున్న గొలుసుకట్టు చెరువుభూముల కబ్జా వ్యవహారం రేపు తేటతేల్లం కాబోతోంది.

కబ్జాదారుల్లో గుబులు
నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని కంచరోణి చెరువు

హైకోర్టు మెట్లెక్కిన చెరువు భూములు 

నివేదికలు అందజేసిన జిల్లా అధికారి 

రేపు వాదనలు 

తీర్పుపై ఉత్కంఠ 

బయటపడనున్న వాస్తవాలు 

నిర్మల్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో దుమారం రేపుతున్న గొలుసుకట్టు చెరువుభూముల కబ్జా వ్యవహారం రేపు తేటతేల్లం కాబోతోంది. నిర్మల్‌లోని పలుచెరువు భూములను కొంతమంది ఆక్రమించుకున్నారంటూ స్ధానిక న్యాయవాది రాష్ట్ర  హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ అండదండలతోనే విలువైన చెరువుభూముల కబ్జా జరుగుతోందంటూ సదరు న్యాయవాది హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర హైకోర్టు సీరియస్‌గా స్పందించి జిల్లా కోర్టు న్యాయవాదిని చెరువుభూములను తనిఖీ చేయాల్సిందిగా ఆదేశించడమే కాకుండా జిల్లా కలెక్టర్‌పై కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం చెరువుభూములను సర్వేచేసి ఎంత మేరకు ఆక్ర మణలు జరిగాయో అలాగే ఇందులో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై తనకు నివేదికలు అందించాలంటూ ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్‌ రంగంలోకి దిగి గత 15 రోజుల నుంచి జిల్లాలోని చెరువుల భూములను సర్వే నిర్వహింపజేశారు. ఈ సర్వేలో రెవెన్యూ, ఇరిగేషన్‌, సర్వే ఆండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అధికారులు పాల్గొన్నారు. మొత్తం 11 గొలుసుకట్టు చెరువులకు సర్వే నిర్వహించిన అధికారులు నివేదికలను రూపొందించారు. ఈ నివేదికలను హైకోర్టులో ఇప్పటికే అధికారులు సమర్పించారు. శుక్రవారం హైకోర్టులో అధికారులు సమర్పించిన వివరాలపై వాదనలు జరగనున్నాయి. ఈ వాదనలపై హైకోర్టు తన తీర్పును కూడా వెల్లడించే అవకాశాలున్నాయంటున్నారు. దీంతో హైకోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంటోంది. కాగా అధికారులు శిఖం, ఎఫ్‌టిఎల్‌, బఫర్‌జోన్‌లుగా చెరువుభూములను విభజించి ఈ భూముల్లో ఆక్రమణలను నిర్ధారించారు. ఇప్పటికే ఈ భూములను ఆక్రమించుకున్న వారికే కాకుండా నిర్మాణాలు చేపట్టిన వారికి సైతం నోటీసులు కూడా అందజేశారు. కాగా అధికారులు అందజేసిన నివేదికలపై జరిగే వాదోపవాదాలు, వెలువడే తీర్పు ఎలా ఉంటుందోనని కబ్జాదారుల్లో ఆందోళన నెలకొంటోందంటున్నారు. 

నిర్ధారణ అయిన గొలుసుకట్టు చెరువుల విస్తీర్ణం

కాగా అధికారులు గత కొద్దిరోజుల నుంచి ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకొని చేపట్టిన సర్వే ద్వారా చెరువు భూముల విస్తీర్ణం నిర్ధారణ అయ్యింది. బంగల్‌పేట్‌ చెరువు విస్తీర్ణం 210.32 ఎకరాలు, ఖజానా చెరువు విస్తీర్ణం 98.22 ఎకరాలు, కొత్త చెరువు విస్తీర్ణం 33.11 ఎకరాలు, జాపూర్‌ కురాన్నపేట్‌ చెరువు విస్తీర్ణం 76.18 ఎకరాలు, రాంనగర్‌ చెరువు విస్తీర్ణం 37.22 ఎకరాలు, సీతాసాగర్‌ - గొల్లపేట్‌ చెరువు విస్తీర్ణం 48.11 ఎకరాలు, ఇబ్రహీం చెరువు విస్తీర్ణం 76.18 ఎకరాలు, కంచరోణి చెరువు విస్తీర్ణం 74.19 ఎకరాలు, ధర్మసాగర్‌ చెరువు విస్తీర్ణం 65.10 ఎకరాలు, మోతితలాబ్‌ చెరువు విస్తీర్ణం 132.06 ఎకరాలు, చిన్నచెరువు ( మంజులాపూర్‌ ) విస్తీర్ణం 81.34 ఎకరాల విస్తీర్ణం ఉన్నట్లు అధికారులు తమ సర్వే ద్వారా నిర్ధారించారు. ఈ విస్తీర్ణాలను హైకోర్టుకు సైతం సమర్పించారు. అలాగే ఏ చెరువులో ఎంత మేరకు ఆక్రమణకు గురయ్యాయోనన్న వివరాలను సైతం కోర్టుకు అందించినట్లు తెలుస్తోంది. 

మూడు రకాలుగా విభజన

అధికారులు చెరువు భూములను మూడురకాలుగా విభజించారు. చెరువు విస్తీర్ణాన్ని శిఖంగా పరిగణించి పూర్తి విస్తీర్ణాన్ని ఎఫ్‌టీఎల్‌గా అలాగే శిఖం నుంచి 90 అడుగుల వరకు ఉన్న భూమిని బఫర్‌జోన్‌గా ఖరారు చేశారు. అయితే చెరువుశిఖంతో పాటు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడం నిషేదం. బఫర్‌జోన్‌ పరిధిలో జరిపే నిర్మాణాలకు మున్సిపల్‌ అధికారులు అనుమతులు జారీ చేయరాదన్న నిబంధన ఉంది. ఒకవేళ నిర్మాణాలు జరిపితే నిర్మాణదారులపైనా, అనుమతులు జారీ చేసిన మున్సిపల్‌ అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. దీనికి తోడు ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం ఇరిగేషన్‌ అధికారులు బఫర్‌జోన్‌ పరిధిలోని భూములకు ఎన్‌ఓసి కూడా జారీ చేయరాదు. శిఖంభూమి నుంచి 90 అడుగుల వరకు బఫర్‌జోన్‌ ఉంటుందన్న విషయం చాలా మందికీ ఇప్పటికీ తెలియదంటున్నారు. దీనిపై సరియైున అవగాహన లేకపోవడంతో బఫర్‌జోన్‌ పరిధిలో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు వెంచర్‌లను ఏర్పాటు చేయడం అలాగే నిర్మాణాలు చేపట్టడం లాంటివి జరుగుతున్నాయి. ఇక నుంచి శిఖం, ఎఫ్‌టిఎల్‌, బఫర్‌జోన్‌ అంశాలపై విస్తృత అవగాహన కల్పించేందుకు ఇటు ఇరిగేషన్‌ అధికారులు ఇటు రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులతో పాటు రిజిస్ర్టేషన్‌ అధికారులు సైతం చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటున్నారు. 

తీర్పుపై ఉత్కంఠ

కాగా చెరువు భూముల ఆక్రమణలు అధికారుల నిర్లక్ష్యధోరణిపై రాష్ట్ర హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నాయి. దీంతో చెరువుభూముల్లో నిర్మాణాలు చేసుకున్న వారు అలాగే ప్లాట్లను కొనుగోలు చేసిన వారు ఈ తీర్పుపై తీవ్ర ఉత్కంఠకు గురవుతున్నారు. తీర్పు ఏ విధంగా ఉంటుందోనన్న ఆందోళన సైతం వారిలో నెలకొంటోంది. చెరువుభూముల్లో ఆక్రమణలు జరిగాయంటూ దానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని సదరు నిర్మల్‌కు చెందిన న్యాయవాది హైకోర్టులో దాఖ లు చేసిన ఫిల్‌పై ఇప్పటికే రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సీరియస్‌గా స్పందించింది. జిల్లా కోర్టు న్యాయమూర్తి, కలెక్టర్‌లు ఈ చెరువు భూముల ఆక్రమణలపై సీరియస్‌గానే క్షేత్రస్థాయిలో తనిఖీలు జరిపి నివేదికలు రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే శుక్రవారం వాదనలు, తీర్పు వెలువడబోతున్నందున అందరి దృష్టి అటువైపే కేంద్రీకృతమవుతోందంటున్నారు. 

బఫర్‌జోన్‌లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదు

ఈ విషయమై నిర్మల్‌ అర్బన్‌ తహసీల్దార్‌ సుభాష్‌చందర్‌ను సంప్రదించగా హైకోర్టు ఆదేశాల మేరకు నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని 11 చెరువులకు సంబంధించిన శిఖం, ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లపై సర్వే జరిపి నివేదికలను సమర్పించామని తెలిపారు. బఫర్‌జోన్‌లో ఇండ్లనిర్మాణాలకు సంబందించి మున్సిపల్‌ అధికారులు అనుమతులు ఇవ్వరాదని , అలాగే ఇరిగేషన్‌ అధికారులు కూడా ఎన్‌ఓసీలు ఇవ్వరాదన్నారు. బఫర్‌జోన్‌లో ఇండ్ల నిర్మాణాలు చేపడితే కఠినచర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. 

Updated Date - 2020-12-03T06:05:53+05:30 IST