భయం భయం

ABN , First Publish Date - 2020-06-26T08:42:17+05:30 IST

మార్చిమొదటి వారం భారతీయ సమాజంలోకి ప్రవేశించిన కరోనాభయం, ఒకరకంగా ఊహాత్మకమైంది, ముందుజాగ్రత్తతో కూడినది. అప్పటికి, కొవిడ్- 19 వైరస్ ప్రజాజీవితంలో అతిసమీపానికి రాలేదు...

భయం భయం

మార్చిమొదటి వారం భారతీయ సమాజంలోకి ప్రవేశించిన కరోనాభయం, ఒకరకంగా ఊహాత్మకమైంది, ముందుజాగ్రత్తతో కూడినది. అప్పటికి, కొవిడ్- 19 వైరస్ ప్రజాజీవితంలో అతిసమీపానికి రాలేదు. ఎక్కడో ఎవరో ఒకరిద్దరికి, అదీ విమానం నుంచి దిగినవారికి సోకిందని, జాగ్రత్తగా ఉంటే దాన్ని మొగ్గలోనే తుంచవచ్చునని అనుకున్నాము. ఆ తరువాత, ఢిల్లీలో ఏదో మతసమావేశానికి వెళ్లి వచ్చినవారికి, వారి నుంచి వారి కుటుంబీకులకు, సన్నిహితులకు సోకిందని విన్నాము. అప్పటికి అంకెలు కొద్దికొద్దిగా పెరుగుతున్నాయి కానీ, ఆ వ్యాప్తి కూడా స్థానికంగానే కట్టడి అయిపోయింది. ఇక ఆ తరువాత, బహుముఖాల నుంచి వ్యాధి దేశంలో ప్రవేశించడం మొదలైంది. ఐరోపా దేశాలు, గల్ఫ్, అమెరికా.. ఇలా ఎన్నో చోట్ల నుంచి దిగుమతి అయిన వైరస్, కోయంబేడు మార్కెట్, ధారవి పేదల వాడ.. ఇట్లా విస్తరిస్తూ పోయింది, పోతున్నది. చాలా తక్కువ మొత్తంలో మాత్రమే కేసులు ఉన్నాయని, అతి మందకొడిగా పెరుగుతున్నాయని, మరణాలైతే నామమాత్రమేనని అనుకున్న తెలుగు రాష్ట్రాల్లో క్రమంగా ప్రమాదం పెరుగుతూ వచ్చింది. వంద దాటిన మరణాలు, పదివేలకు చేరుకున్న కేసులు, రోజుకు వందల సంఖ్యలో కొత్త కేసులు.. పరిస్థితి ఏమంత బాగులేదు. మొదట్లో భయమే తప్ప వ్యాప్తి అధికంగా లేని కాలంలో, ఎంతో స్పృహ, ఎంతో కట్టడి అన్నీ ఉండేవి. ఇప్పుడు, వ్యాధి వ్యాపించడానికి యథేచ్ఛగా అవకాశాలు, ఏమవుతుంది లే అని లేదా తమ దాకా రాదనీ పెరిగిపోయిన నిర్లక్ష్యం- కనిపిస్తున్నాయి. కేసులు ఇలాగే పెరిగిపోతే, ఆస్పత్రులు చాలతాయా? వ్యాధి సోకినవారికి సేవలు చేయడానికి వైద్యసిబ్బంది సరిపోతారా? మంచి ఊహ కాదు కానీ, మరణాలు పెరిగిపోతే అమెరికాలో, ఐరోపాలో వచ్చినటువంటి పరిస్థితి ఎదురవుతుందా? ఏ పరిస్థితినైనా ఎదుర్కొనగలమన్న ధీమాను ప్రభుత్వాలు ప్రదర్శిస్తున్నాయా?- ఈ ప్రశ్నలు అందరినీ మథనపెడుతున్నాయి. 


భారతదేశంలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాలలో ఆరోస్థానంలోకి తెలంగాణ ఎగబాకింది. గత వారం రోజులుగా తెలంగాణలో వ్యాధి వ్యాప్తి తీవ్రంగా ఉన్నది. రానున్న రోజులలో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నది. ఒక ఆంగ్ల దినపత్రిక చేసిన విశ్లేషణ ప్రకారం, జూన్ 15 నుంచి 23 దాకా తెలంగాణలో 18,818 పరీక్షలు జరపగా, అందులో 4,579 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. అదే మహారాష్ట్రలో లక్షా 45 వేల పరీక్షలు జరగగా, 31 వేల 52 కేసులు నిర్ధారణ అయ్యాయి. గుజరాత్‌లో 45,761 పరీక్షలు జరపగా, 439 కేసులు నిర్ధారణ అయ్యాయి. గుజరాత్‌లోనూ, తెలంగాణలోనూ కొత్తగా నిర్ధారణ అయిన కేసులు సుమారుగా ఒకే మొత్తంలో ఉండగా, పరీక్షలలో మాత్రం విపరీతమైన వ్యత్యాసం ఉన్నది. వ్యాప్తి తీవ్రత విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో మెరుగుగా ఉన్నదని ఈ పరిశీలన సూచిస్తున్నది. కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా రోజువారీ కేసుల సంఖ్య విషయంలో నిలకడ సాధించినట్టు తెలుస్తున్నది. కేసుల తీవ్రత అత్యధికంగా ఉన్న రాష్ట్రాలలో కూడా వ్యాప్తి తీవ్రత రేటు తెలంగాణలో ఉన్నంతగా లేదు. ఇందుకు కారణమేమిటో ప్రభుత్వం, కరోనా సంబంధిత అధికార యంత్రాంగం సమీక్షించుకోవలసి ఉన్నది. తక్కువ పరీక్షలు చేయడం అనే విమర్శను మొదటినుంచి ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడు గణాంకాల రూపంలో ఆ విమర్శ నిర్ధారణ జరుగుతున్నదని గ్రహించాలి. 


ప్రత్యేకంగా, అదనంగా 50 వేల పరీక్షలు జరపాలని నిర్ణయించి, అమలుచేయడం వల్లనే కొత్త కేసులని ప్రభుత్వం వివరిస్తున్నప్పటికీ, కొత్తగా చేస్తున్న పరీక్షలలో 30 శాతం దాకా పాజిటివ్ నిర్ధారణలు జరగడం ఆందోళనకరం. అంతా సజావుగా ఉన్నదని, ఆర్థిక పరిస్థితి కొత్త చిగుళ్లేస్తున్నదని ప్రభుత్వం నమ్మవచ్చు, నమ్మించవచ్చు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉన్నది. జనగామ, పరకాల, ములుగు పట్టణాలలో కొత్తగా లాక్‌డౌన్‌ నిబంధనలను కఠినం చేయవలసివచ్చింది. హైదరాబాద్‌లోని బేగం బజార్, సిద్ధి అంబర్ బజార్లలో హోల్ సేల్ వ్యాపారులు స్వచ్ఛందంగా వ్యాపారవేళలను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. సికింద్రాబాద్‌ జనరల్ బజార్ పరిసర వ్యాపార ప్రాంతాలన్నిటిలోనూ పూర్తి స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటించాలని వ్యాపారులే నిర్ణయించారు. కొద్దిపాటి ఉద్యోగులతో కార్యాలయాలను ప్రారంభించిన సాఫ్ట్‌వేర్ కంపెనీలు తిరిగి పూర్తిగా మూసివేయడం మొదలుపెట్టాయి. ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని పట్టణాలలో ప్రకటిత, అప్రకటిత లాక్‌డౌన్‌ అమలు జరుగుతున్నది. ప్రభుత్వం లాక్‌డౌన్‌ను అమలుచేయడం మొదలుపెట్టడానికి ముందు ప్రధానమంత్రి విజ్ఞప్తి మేరకు జనతాకర్ఫ్యూ పాటించిన సంగతి తెలిసిందే. అందులో ఉన్న స్వచ్ఛందతను తిరిగి ఎక్కడివారి అక్కడ వారి వారి కమ్యూనిటీలలో పాటించవలసిన పరిస్థితి వస్తున్నది. 


ప్రభుత్వ ఆస్పత్రులలో స్పష్టమైన లక్షణాలున్నవారినే చేర్చుకుంటున్నారు. ప్రైవేటు ఆస్పత్రులలో అందరినీ చేర్చుకుంటున్నారు కానీ, అక్కడ పడకల కొరత ఉన్నది, ఫీజులు సాధారణ ప్రజలకు ప్రతిబంధకంగా ఉన్నాయి. ప్రభుత్వం చేతులు దులుపుకోవడానికి ఇళ్లలోనే చికిత్స అన్న విధానానికి తెరతీస్తుండగా, ఇళ్లలో ఉన్న రోగులకు కొన్ని వైద్య సాధనాలను అందించి, సుదూర చికిత్స చేయడానికి ప్రైవేటు ఆస్పత్రులు ప్రయత్నిస్తున్నాయి. కరోనా విషయంలో కేవలం ప్రాణభయం మాత్రమే కాదు, ఆర్థిక భయం కూడా మధ్యతరగతి వారిని వేధిస్తున్నది. 


తెలంగాణకైనా, ఆంధ్రకైనా ఇప్పుడు కావలసినది పారదర్శకత. ప్రతి ఇంట్లోనూ కరోనా పరీక్షలు జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆహ్వానించదగ్గదే అయినా, ఆ రాష్ట్రంలో పరీక్షల తీరుతెన్నులపై వెలువడుతున్న సందేహాలను నివృత్తి చేయడం కూడా అవసరం. ఎందుకంటే, ఆరోగ్యం, క్షేమం విషయంలో అనుమానాలు ఉండడం మంచిది కాదు. మారుతున్న, తీవ్రదశలోకి వెడుతున్న కరోనా పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలుచేయాలి. ముఖ్యంగా, హైదరాబాద్ మహానగరానికి ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలి. లేకపోతే, కేవలం భయంతో, అపనమ్మకంతో ప్రజలలో కలవరం పెరిగే అవకాశం ఉన్నది. ప్రజల ప్రాణాలకు ప్రమాదం పెరుగుతున్న దశలో ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నదన్న అపవాదు తెచ్చుకోవడం మంచిది కాదు. 

Updated Date - 2020-06-26T08:42:17+05:30 IST