భయం...చంపేస్తోంది!

ABN , First Publish Date - 2021-05-15T04:38:51+05:30 IST

కంటికి కనిపించని కరోనా వైరస్‌ ఎందరినో కబళిస్తోంది. ఎన్నో కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తోంది. అంతులేని విషాదం మిగుల్చుతోంది. కళ్లేదుటే మరణాలు, మృత్యు ఘంటికలు చూసి చాలామంది గుండెలు ఆగిపోతున్నాయి. మరికొందరు భయంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కొద్దిరోజుల కిందట పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో ఎస్‌.కోటలో ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అది మరువక ముందే శుక్రవారం వేపాడ మండలం నల్లబిల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు.

భయం...చంపేస్తోంది!


కుటుంబాల్లో కల్లోలం!

భయంతో బలవన్మరణాలు

కళ్లెదుటే తమ వారిని కోల్పోతుండడంతో ఆత్మహత్యలు

జిల్లాలో వరుసగా ఘటనలు

 (శృంగవరపుకోట)

కంటికి కనిపించని కరోనా వైరస్‌ ఎందరినో కబళిస్తోంది. ఎన్నో కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తోంది. అంతులేని విషాదం మిగుల్చుతోంది. కళ్లేదుటే మరణాలు, మృత్యు ఘంటికలు చూసి చాలామంది గుండెలు ఆగిపోతున్నాయి. మరికొందరు భయంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కొద్దిరోజుల కిందట పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో ఎస్‌.కోటలో ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అది మరువక ముందే శుక్రవారం వేపాడ మండలం నల్లబిల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. వైరస్‌ సోకిందన్న భయం ఒకవైపు...వైద్యం కోసం లక్షలాది రూపాయలు ఖర్చు అవుతోందన్న దిగులుతో ఎక్కువ మంది ఆందోళనకు గురవుతున్నారు. ఒత్తిడితో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. సెకెండ్‌ వేవ్‌ ప్రారంభమైన నాటి నుంచి జిల్లాలో ఆత్మహత్య ఘటనలు జరుగుతునే ఉన్నాయి.


భరోసా ఇచ్చేవారు లేక...

 కరోనాతో  కుటుంబాల్లో ఒకరు తరువాత ఒకరు మృతి చెందుతున్న ఘటనలకు కొదవలేదు. కొద్దిరోజుల కిందట ఎస్‌.కోట పట్టణంలో గంటల వ్యవధిలో తల్లీ కుమారుడు మృత్యువాత పడ్డారు. పార్వతీపురం మండలంలో రోజుల వ్యవధిలో తల్లిదండ్రులతో పాటు కుమారుడు మృతిచెందారు. అన్నదమ్ములు, భార్యాభర్తలు, తోబుట్టువులు ఒకేసారి మృత్యువాత పడిన ఘటనలున్నాయి. అటువంటి కుటుంబాల్లో కల్లోలం రేగుతోంది. పిల్లలు అనాథలవుతుండగా.. పెద్దదిక్కును కోల్పోతున్న వారూ ఉన్నారు. ఆ కుటుంబాలు వీధిన పడుతున్నాయి. కళ్లెదుటే తమవారిని కోల్పోతున్న చాలామందిలో భయం అలుముకుంటోంది. అప్పటికే వైద్యం కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్న వారు నిస్పృహకు గురవుతున్నారు. గ్రామాల్లో సైతం కరోనా బాధిత కుటుంబ సభ్యులను ఆదరించే వారు కరువవుతున్నారు. కనీసం పలకరించేవారు లేకపోతున్నారు. తొలిదశలో నిత్యావసరాలు అందించే వలంటీర్లు సైతం ముఖం చాటేస్తున్నారు. కరోనా భయంతో నా అనేవారి స్వాంతన లేక కొంతమంది క్షణికావేశంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. 


అనవసర భయంతోనే..

వాస్తవానికి చాలామంది వృద్ధులు సైతం కరోనాను జయిస్తున్నారు. వైద్యుల సలహాలు, సూచనలు పాటించడం, పౌష్టికాహారం తీసుకోవడం వంటివి చేయడం ద్వారా కోలుకుంటున్నారు.    రికవరీ రేటు కూడా గణనీయంగా ఉంది. కానీ ఎక్కువ మంది కరోనా మృతులనే పరిగణనలోకి తీసుకుంటున్నారు. సోషల్‌ మీడియాలో వచ్చే వార్తలను నమ్మి మరింత భయపడిపోతున్నారు. వైరస్‌ సోకితే మరణిస్తామన్న భావనకు వచ్చేస్తున్నారు. పాజిటివ్‌ అని తేలితే కొంతమంది అవమానంగా ఫీలవుతున్నారు. మరింత ఒత్తిడికి గురవుతున్నారు. ఇటువంటి వారికి అధికారులు అవగాహన కల్పిస్తున్నా ఫలితం లేకపోతోంది. పాజిటివ్‌ దృక్పథం అలవరచుకుంటేనే కరోనాను దీటుగా ఎదుర్కొనవచ్చు. దీనిపై అధికారులు మరింతగా అవగాహన పెంచాల్సిన అవసరముంది. 


మనో ధైర్యం కోల్పోవద్దు

కరోనా బాధితులు ధైర్యంగా ఉండాలని కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ అన్నారు. మనోధైర్యం కోల్పోవద్దన్నారు. శుక్రవారం జిల్లా కేంద్ర ఆసుపత్రి, మిమ్స్‌లో చికిత్సపొందుతున్న బాధితులతో జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌, జేసీ మహేష్‌కుమార్‌లు మాట్లాడారు. వైద్యసేవలు, వసతి, భోజనం, పారిశుధ్యం వంటి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. మిమ్స్‌లో చికిత్సపొందుతున్న వారు అక్కడ సేవలు బాగున్నాయని చెప్పారు. మిమ్స్‌ డైరెక్టర్‌ భాస్కర్‌రాజు మాట్లాడుతూ అదనంగా వైద్యులు, నర్సులు, శానిటేషన్‌ సిబ్బందిని నియమించాలని కోరారు. రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు అందించాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ సిబ్బంది నియామకంతో పాటు అవసరమైన మందులు అందిస్తామన్నారు. మెరుగైన వైద్యసేవలు అందించి బాధితుల అభిమానాన్ని చూరగొనాలని అక్కడి సిబ్బందికి కలెక్టర్‌ సూచించారు.  



Updated Date - 2021-05-15T04:38:51+05:30 IST