డెంగ్యూ భయం

ABN , First Publish Date - 2022-07-05T05:39:08+05:30 IST

వర్షాకాలం ప్రారంభంలోనే దోమలు పంజా విసురుతున్నాయి. ఇప్పటికే ఐదు డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లా ప్రజలకు డెంగ్యూ భయం పట్టుకుంది. మరోవైపు గ్రామాల్లో, పట్టణాల్లో జనం సీజనల్‌ వ్యాధులు, జ్వరాల బారిన పడుతున్నారు. జిల్లా ప్రధాన ఆస్పత్రితోపాటు ప్రైవేటు ఆస్పత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి.

డెంగ్యూ భయం

- జిల్లాలో ఐదు కేసులు 

-  గతేడాది 127 నమోదు 

-  సీజనల్‌ జ్వరాలతో ఆందోళన 

- జిల్లాలో పెరుగుతున్న జ్వర పీడితులు 

- కిటకిటలాడుతున్న ఆస్పత్రులు  

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

వర్షాకాలం ప్రారంభంలోనే దోమలు పంజా విసురుతున్నాయి. ఇప్పటికే ఐదు డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లా ప్రజలకు డెంగ్యూ భయం పట్టుకుంది. మరోవైపు గ్రామాల్లో, పట్టణాల్లో జనం సీజనల్‌ వ్యాధులు, జ్వరాల బారిన పడుతున్నారు. జిల్లా ప్రధాన ఆస్పత్రితోపాటు ప్రైవేటు ఆస్పత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లాలో గతేడాది 127 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి.  ఆ ఏడాది ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబరులో వరుస వర్షాలతో  కేసులు పెరిగాయి. ఆగస్టులో ఏడు, సెప్టెంబరు 45, అక్టోబరు 49, నవంబరు 18, డిసెంబరులో 21 కేసులు నమోదయ్యాయి. ఈ సంవత్సరం జనవరిలో మూడు, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌, మేలో ఒక్కో కేసు నమోదు కాగా వర్షాల ప్రారంభంతోనే జూన్‌లో ఐదు నమోదయ్యాయి. డెంగ్యూ జ్వరాలు, మలేరియా, వైరల్‌ జ్వరాలు పెరుగుతుండడంతో జిల్లాలో మంగళ, శుక్రవారాల్లో డ్రైడే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. డెంగ్యూ ప్రబలే అవకాశాలు ఉన్న 13 గ్రామాలు, మున్సిపాలిటీలోని ఆరు వార్డుల్లో చర్యలు చేపట్టారు. 


టైగర్‌ దోమలతో డెంగ్యూ 

పగలు కుట్టే టైగర్‌ దోమలు ప్రమాదకరమైనవి. ఎడిస్‌ ఈజిప్ట్‌ అనే దోమలు కుట్టడంతో శరీరంలోకి నాలుగు రకాల వైరస్‌లు చేరుతాయి. దీంతో డెంగ్యూజ్వరం, డెంగ్యూ హెమరైజ్‌డ్‌, డెంగ్యూ షాక్‌సిండ్రోమ్‌ వంటి మూడు రకాల వ్యాధులు వస్తాయి. ఈ జ్వరం ఉంటే శరీరం ఎర్రగా కందిపోతుంది. కీళ్లు, కండరాలు ఒళ్లునొప్పులు ఉంటాయి. కళ్లు కదిలించలేనంతా మూతలు పడుతాయి. వాంతులు అవుతాయి. ఈ లక్షణాలు కనిపిస్తే పూర్తిగా వైద్యుడి సంరక్షణలో వైద్యం చేయించాలి. 


హడలెత్తిస్తున్న దోమలు 

జిల్లా  ప్రజలు దోమలతో హడలెత్తి పోతున్నారు.    జిల్లాలో ఆయా మండలాల్లో దోమలు పెరిగిపోయాయి. దోమలతో రాత్రి వేళల్లో కాకుండా పొద్దంతా కిటికీలు వేసుకొని ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు దోమల నివారణకు అధికార యంత్రాంగం పారిశుధ్యంపై  ప్రచారం చేపట్టింది. 


 దోమకాటుతో మెదడువాపు

క్యులెక్స్‌ దోమతో ఐదేళ్లలోపు వారికి వైరస్‌ సోకి ఆరు రోజుల్లోనే లక్షణాలు బయటపడుతాయి. కళ్లు తిరగడం, జ్వరం రావడం, అపస్మారక స్థితిలోకి చేరడం, రోగి వంకరలు తిరగడం వంటివి మెదడువాపు లక్షణాలుగా భావించాలి. పూర్తిగా ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేయాలి. పందులను నివాస గృహాల వద్ద తిరగనివ్వక పోవడం ఎంతో మంచిది. 


చలి జ్వరాలు 

దోమ కాటుతో చలి జ్వరాలు ఎక్కువ సంఖ్యలో బాధ పెడుతాయి. మాస్టర్‌ ఫీవర్‌, రోమన్‌ ఫీవర్‌, ఇంటర్‌ మిటెంట్‌ ఫీవర్‌, ట్రాఫికల్‌ ఫీవర్‌, కోస్టల్‌ ఫీవర్‌ ఇలా రకరకాల పేర్లతో వచ్చే చలిజ్వరాన్ని తెచ్చే దోమలను చూస్తే వామ్మో అనాల్సిందే. ప్రధానంగా మలేరియా జ్వరం అందరినీ బాధిస్తున్న సమస్య. ముఖ్యంగా మూడు రకాల దోమలు వ్యాధులకు కారణమవుతున్నాయి. అవి  కుల్సిడే కుటుంబానికి చెందిన క్యూలెక్స్‌, అనాఫిలస్‌, ఈడిస్‌ దోమలు. అనాఫిలస్‌  జాతికి చెందిన ఆడ దోమ కుట్టడంతో మలేరియా వస్తుంది. దోమ కుట్టినప్పుడు రక్తంలో ఉన్న మలేరియా వ్యాధిని కలిగించే ప్లాస్మాడియం సూక్ష్మ జీవులు దోమ జీర్ణకోశంలో చేరి అక్కడ అనేక మార్పులు చెంది స్పోరో జూయిట్లుగా మారి తిరిగి దోమ లాల జలంలోకి చేరుతాయి. ఆ దోమ ఆరోగ్య వంతుడైన మనిషిని కుట్టినప్పుడు శరీరంలోకి ప్రవేశిస్తాయి.  దోమ కుట్టిన 31వ రోజు లోపు మలేరియా జ్వరం లక్షణాలు బయట పడుతాయి. ప్రారంభంలో ఒల్లు వేడి, చలి వణికిస్తుంది. రెండో దశలో జ్వరం తీవ్రంగా ఒకటి నుంచి 4గంటల పాటు ఉంటుంది. మూడో దశలో విపరీతంగా చెమటలతో జ్వరం దిగి పోతుంది. కొన్ని సందర్భాల్లో ఈ మూడు దశలు కూడా కనిపించక పోవచ్చు. చలి జ్వరం వచ్చినప్పుడే రక్త పరీక్ష చేసి మలేరియాను నిర్ధారించి చికిత్స చేసుకోవడం మంచిది.  


నియంత్రణే మార్గం

దోమల నియంత్రణతోనే జ్వరాల తీవ్రత తగ్గే  అవకాశముంది. ప్రస్తుతం దోమల నియంత్రణకు అనేక రకాల స్ర్పేలు, లిక్విడ్‌లు, కాయిల్స్‌ అందుబాటులోకి వచ్చాయి. వాటికి కూడా దోమలు లొంగడం లేదు. ఎలకా్ట్రనిక్‌ బ్యాట్‌ల ద్వారా కూడా చంపే పరిస్థితి ఇళ్లలో కనిపిస్తోంది.  మరోవైపు దోమ తెరలు ఉపయోగించు కుంటున్నారు. చివరకు ఆరుబయట కూర్చునే కుర్చీల వద్ద కూడా నెట్‌లు ఏర్పాటు చేసుకోవడం పరిపాటిగా మారింది. దోమల నివారణ కోసం ప్రతీ ఇంట  నెలకు రూ.200 వరకు ఖర్చు చేస్తున్నారు. దోమకాటుతో వచ్చే జ్వరాలకు వేలల్లోనే ఖర్చు చేయాల్సిన పరిస్థితి.  రెండు వారాల జీవిత కాలం లేని దోమను నియంత్రించడం కోసం అనేక పాట్లు పడుతున్నారు. 


దోమల నివారణతోనే వ్యాధులు దూరం 

- డాక్టర్‌ సుమన్‌మోహన్‌రావు, జిల్లా వైద్యాధికారి

దోమల నివారణతోనే వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.  వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలి.  దోమల నివారణకు ఫాగింగ్‌ చర్యలు చేపట్టాం.  నీరు, చెత్తాచెదారం నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ప్రధానంగా పూల కుండీల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. సెఫ్టిక్‌ ట్యాంక్‌ల  గొట్టాలకు మాస్క్‌ బిగించాలి. పాత టైర్లు, తాగిన కొబ్బరి బొండాలు, ప్లాస్టిక్‌ టీ కప్పులు దూరంగా పడవేయాలి. పరిసరాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.  మంగళ, శుక్రవారాల్లో డ్రైడే పాటించాలి. జ్వరం వస్తే రక్త పరీక్షలు చేయించుకోవాలి


Updated Date - 2022-07-05T05:39:08+05:30 IST