గుంతలతో భయం..భయంగా

ABN , First Publish Date - 2022-08-18T05:57:04+05:30 IST

దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదన్న చందంగా తయారైంది అనంతగిరి మండలం వాయిలసింగారం ప్రాథమిక పాఠశాల లో అదనపు తరగతి గదుల నిర్మాణ పరిస్థితి.

గుంతలతో భయం..భయంగా
పాఠశాల ఆవరణలో నీటితో నిండిన పునాది గుంతలు

 ప్రారంభం కాని అదనపు తరగతి గదుల నిర్మాణం

వర్షం నీటితో  నిండిన పునాది గుంతలు 

 వాయిలసింగారం ప్రాథమిక పాఠశాలలో దుస్థితి

అనంతగిరి, ఆగస్టు 17: దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదన్న చందంగా తయారైంది  అనంతగిరి మండలం వాయిలసింగారం ప్రాథమిక పాఠశాల లో అదనపు తరగతి గదుల నిర్మాణ పరిస్థితి. రాష్ట్రంలో ఉన్న 26,065  ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య, హాజరు నమోదుకు సీఎం కేసీఆర్‌ మార్చి ఎనిమి దో తేదీన మన ఊరు - మనబడి’ పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  ప్రజలను కూడా భాగస్వాములు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొన్ని పాఠశాలలకు  నిధులు మంజూరైనా కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతో పనులు ఇంకా ప్రారంభించలేదు. ‘మన ఊరు - మన బడి’ పథకంలో భాగంగా  మండలంలోని వాయిలసింగారం ప్రాథమిక పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి మొదటి విడతగా రూ.42లక్షలు  కేటాయించి, రూ.2.50లక్ష ల నిధులు మం జూరు చేసింది.నెల రోజుల క్రితం పాఠశాల ఆవరణలో కాంట్రాక్టర్‌ ఐదు పెద్ద గుంతలు తవ్వించారు. ఆ తర్వాత మరో కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించారు.  అయితే  సదరు కాంట్రాక్టర్‌ పనులు ప్రారంభించకుండా  జాప్యం చేస్తున్నందున  ఆ గుంతల్లోకి వరద నీరు చేరింది.  ప్రాథమిక పాఠశాలలలోనే అంగన్‌వాడీ కేంద్రం ఉండటంతో ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా చిన్నారులు గుంతల్లో పడే ప్రమాదం ఉందని ఉపాధ్యాయులు భయపడుతున్నారు. వెంటనే అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని ప్రారంభించాలని కోరుతున్నారు.  అదనపు తరగతి గదుల నిర్మాణానికి పునాది గుంతలు తీసినప్పటి నుంచి వర్షాలు కురుస్తున్నందున పనులు ప్రారంభించలేదని ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం బావ్‌సింగ్‌ తెలిపారు. ప్రతీ  ఉదయం మోటారు ద్వారా గుంతల్లో  నీటిని తొలగిస్తే వర్షాల కారణంగా సాయంత్రానికి గుంతల్లోకి నీరు చేరుతున్నందున పనులు ప్రాంభించలేకపోతున్నామని తెలిపారు. 

వర్షాలు తగ్గగానే పనులు ప్రారంభిస్తాం  

వర్షాలు తగ్గగానే నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. రెండు పిల్లర్‌ గుంతల్లో బండ పడింది.  బండను తొలగించి పిల్లర్స్‌కు అనుగుణంగా ఏర్పాటు చే స్తాం.  పిల్లర్ల కోసం ఐరన్‌ బుట్టలు కట్టించాం.

 - హర, ్షపీఆర్‌ ఏఈ, అనంతగిరి



Updated Date - 2022-08-18T05:57:04+05:30 IST