భయం..భయం

May 9 2021 @ 00:13AM

  1. ప్రభుత్వ కార్యాలయాల్లో పాజిటివ్‌
  2. సహచర ఉద్యోగులపై పని ఒత్తిడి
  3. మరణాలతో మానసిక ఆందోళన
  4. ముందస్తు చర్యలు లేకనే ఇబ్బందులు
     

జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ఆరుగురు ఉద్యోగులు కొవిడ్‌ బారిన పడ్డారు. దీంతో ఆ శాఖ కార్యాలయంలో గత నెల 24న అందరికీ సెలవు ఇచ్చారు. కార్యాలయాన్ని శానిటైజ్‌ చేయించారు.

 ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖలో ఆరుగురు ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. వీరిలో ఓ డ్రైవరు మృతి చెందాడు. జడ్పీ కార్యాలయంలో ముగ్గురు, పంచాయతీరాజ్‌ పీఐయూ శాఖలో ఆరుగురు వైరస్‌ బారిన పడ్డారు.
 

కర్నూలు అర్బన్‌ తహసీల్దారు కార్యాలయంలో ఓ ఉన్నతాధికారి కొవిడ్‌ బారిన పడ్డారు.

కర్నూలు, మే 8(ఆంధ్రజ్యోతి):
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాల పరిస్థితి ఇది. జిల్లా వ్యాప్తంగా దాదాపు ఇదే పరిస్థితి ఉంది. ఏ కార్యాలయంలో చూసినా.. ఎవరో ఒకరు వైరస్‌ బారిన పడుతున్నారు. ఉన్నతాధికారులు మొదలు సిబ్బంది వరకూ పాజిటివ్‌ జాబితాలో ఉన్నారు. ఫ్రంట్‌లైన్‌ సేవల్లో ఉండే పోలీసు, ఇతర శాఖలవారు వరుసగా కొవిడ్‌ బారిన పడుతున్నారు. కార్యాలయంలో ఒకరిద్దరికి పాజిటివ్‌ రాగానే, తమకు ఎక్కడ సోకుతుందోనని సహోద్యోగులు ఆందోళన చెందుతున్నారు. సెకండ్‌ వేవ్‌ వైరస్‌తో ఇబ్బంది అధికమన్న అభిప్రాయంతో చాలామంది భయపడుతున్నారు. ఇది ఒక కోణం కాగా, బాధిత ఉద్యోగులు సెలవులపై వెళ్ళడంతో పనులు పెండింగ్‌లో పడుతున్నాయి. ఆ భారం కూడా తామే మోయాల్సి వస్తోందని ఉన్నవారు వాపోతున్నారు. ఇలా అన్నిరకాల ఒత్తిడితో ప్రజలకు మెరుగైన సేవలు అందించలేకపోతున్నామని అంటున్నారు.


ముందు జాగ్రత్త లేకనే..
మొదటి దశలో చాలామంది కరోనా బారిన పడ్డారు. జిల్లా వ్యాప్తంగా పలు ప్రభుత్వ కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేశారు. జిల్లా యంత్రాంగం కరోనా సెకండ్‌ వేవ్‌ మొదలవ్వగానే జాగ్రత్త పడాల్సింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల మధ్య భౌతిక దూరం, మాస్కులను తప్పనిసరి చేయాల్సింది. ముందస్తు చర్యల్లో భాగంగా శానిటేషన్‌ చేయించాల్సింది. కానీ జిల్లా ఉన్నతాధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. ఉద్యోగులు కరోనా బారిన పడ్డాక కూడా శానిటేషన్‌ మాత్రమే చేయించారు. భౌతిక దూరానికి ఏర్పాట్లు చేయలేదు. ఇప్పటికైనా కరోనా నిబంధనలు పాటించేలా ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాట్లు చేయిస్తే బాగుంటుందని ఉద్యోగులు అంటున్నారు.


ఇబ్బందుల్లో ఉద్యోగులు
రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు ప్రజలు ఎక్కువగా వస్తుంటారు. ఆస్తుల బదలాయింపునకు కుటుంబ సమేతంగా రావాల్సి ఉంటుంది. సాక్షులు, ఇతర వ్యక్తులు అదనం. వేలిముద్ర వేయడంతో పాటు ఫొటోలు దిగాలి. ఇలా వచ్చినవారు గుంపులుగా నిలబడి పోతున్నారు. రవాణా శాఖలో చాలావరకు ఆన్‌లైన్‌ సేవలు ఉన్నా, వాహన మార్పిడులు, డూప్లికేట్‌ ఆర్సీలు, వెహికిల్‌ టెస్టులకు కార్యాలయాలకు తప్పక రావాల్సిన పరిస్థితి. రెవెన్యూ కార్యాలయాలకు పట్టాదారు, టైటిల్‌ డీడ్‌, ధ్రువీకరణ పత్రాలు, రైతుల సమస్యలకు సంబంధించి పనుల కోసం ప్రజలు భారీగా వస్తుంటారు. పంచాయతీరాజ్‌ శాఖకు సంబంధించి మౌలిక సదుపా యాలు, సంక్షేమ పథకాలు, గృహ నిర్మాణం, నీటి సరఫరా తదితర అనేక పనుల కోసం ప్రజలు వస్తుంటారు. సివిల్‌ సప్లయిస్‌కు కూడా కార్డుదా రులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఇలా ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చేవారంతా తమ పనులు త్వరగా ముగించుకోవాలన్న ఆతృతతో గుంపులు గుంపులుగా నిలబడుతున్నారు. కొవిడ్‌ వ్యాప్తికి కారణమవ తున్నారు. వారికి సేవలందించే ఉద్యోగులు కూడా కొవిడ్‌ బారిన పడుతున్నారు.


షిఫ్టు పాటిస్తే మేలు..
ప్రజలకు సేవలందించే పలువురు ప్రభుత్వ ఉద్యోగులు కరోనా బారిన పడుతున్నారు. పాజిటివ్‌ వచ్చిన కార్యాలయాల్లోనే కాకుండా, అన్ని కార్యాలయాలను శానిటైజ్‌ చేయించాలి. ప్రభుత్వ ఉద్యోగులకు త్వరగా వ్యాక్సినేషన్‌ పూర్తిచేయించాలి. వైద్య శాఖ ఉద్యోగులు రౌండ్‌ ది క్లాక్‌ పనిచేస్తున్నారు. వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లు, ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగులకు షిఫ్టు పద్ధతిలో విధులను కేటాయించాలి. ఇలా చేయడం వల్ల భౌతిక దూరం పాటించడానికి వీలుగా ఉంటుంది. ఇక ఆన్‌లైన్‌ సేవలు అందించే వారికి వర్క్‌ ఫ్రమ్‌ హోం ఇస్తే బాగుంటుంది.
- వెంగళ్‌రెడ్డి, ఏపీఎన్జీవో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు, కర్నూలు


ప్రత్యేక ఆస్పత్రి కేటాయించాలి..

కరోనా బారిన పడే ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక ఆస్పత్రి ఏర్పాటు చేస్తే బాగుంటుంది. కొవిడ్‌ ఉధృతంగా ఉన్నందున 50 శాతం మంది ఉద్యోగులు మాత్రమే విధులకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేయాలి. కొవిడ్‌తో మరణించిన వారికి ఎక్స్‌గ్రేషియా తక్షణమే చెల్లించాలి. కరోనా సోకిన వారికి 14 రోజులు స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌ మంజూరు చేయాలి.
- హేమంత్‌ కుమార్‌ రెడ్డి, ఏపీ పంచాయతీ కార్యదర్శుల సంఘం, రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు, కర్నూలు.

అర్జీలకు యాప్‌ ఏర్పాటు చేయాలి..
ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు పలు అర్జీలు పెట్టుకోవడానికి వస్తుంటారు. వారు కార్యాలయాల వరకు రాకుండా అర్జీలను స్వీకరించడానికి ప్రత్యేక యాప్‌ ఏర్పాటు చేయాలి. ఇలా చేయడం వల్ల కార్యాలయాల్లో రద్దీ తగ్గి, కరోనా వ్యాప్తి కూడా తగ్గే అవకాశం ఉంది. కొన్ని శాఖల ఉద్యోగులను మాత్రమే ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించాలి. కొవిడ్‌ బారిన పడ్డ ప్రభుత్వ ఉద్యోగులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని చికిత్స చేయించాలి.
- శ్రీనివాసులు, ఎంపీడీవో అసోసియేషన్‌ జిల్లా అఽఽధ్యక్షుడు

పనివేళల కుదింపు
కరోనా ఉధృతి తీవ్రంగా ఉండడంతో ప్రభుత్వ ఉద్యోగుల కు ఊరట కలిగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు పనిచేసేలా ఉత్తర్వులు జారీ చేసింది. మధ్యాహ్నం 12 నుంచి కర్ఫ్యూ ప్రారంభం అవుతుండటంతో ఆలోపు ప్రభుత్వ ఉద్యోగులు ఇళ్లకు చేరుకోవాలని సూచించింది. అయితే.. ఎంతమంది ఉద్యోగులు అవసరం? వారు ఎన్ని గంటల వరకు కార్యాల యాల్లో ఉండాలి? అని నిర్ణయించేందుకు ఆయాశాఖల ఉన్నతాధికా రులకు వదిలేసింది. పనివేళల కుదింపు ఉత్తర్వుల నుంచి పంచాయ తీరాజ్‌, పురపాలక, విద్యుత్‌, ఆరోగ్యశాఖను మినహాయించింది. ఈ నాలుగింటిని ఎమర్జెన్సీ శాఖలుగా గుర్తిస్తూ యథావిధిగా పని చేయాలని సూచించింది.

 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.