రాజానగరంలో జ్వరాల విజృంభణ

ABN , First Publish Date - 2022-08-19T06:41:06+05:30 IST

మండలంలోని వెంకటనగరం పంచాయతీ రాజానగరంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామానికి చెందిన సుమారు 70మంది వరకు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. ప్రతి ఇంట్లో ఒకరు జ్వరపీడితులు ఉన్నట్టు గ్రామస్థులు చెపుతున్నారు.

రాజానగరంలో జ్వరాల విజృంభణ
విశాఖలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గ్రామానికి చెందిన జ్వరపీడితులు

సుమారు 70 మంది వరకు విశాఖ, కాకినాడ ఆస్పత్రుల్లో చేరిక

పలువురికి ప్లేట్‌లెట్స్‌ డౌన్‌ 

నీరు కలుషితమే కారణమని గ్రామస్థుల ఆరోపణ

ఉన్నతాధికారులు తక్షణమే స్పందించాలని సర్పంచ్‌ వేడుకోలు

పాయకరావుపేట రూరల్‌, ఆగస్టు 18 : మండలంలోని వెంకటనగరం పంచాయతీ రాజానగరంలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. గ్రామానికి చెందిన సుమారు 70మంది వరకు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. ప్రతి ఇంట్లో ఒకరు జ్వరపీడితులు ఉన్నట్టు గ్రామస్థులు చెపుతున్నారు. శ్రీరాంపురం పీహెచ్‌సీ సిబ్బంది వైద్య శిబిరం ఏర్పాటు చేసినా జ్వరాలు అదుపులోకి రావడం లేదని సర్పంచ్‌ వంకా రమణ పేర్కొన్నారు. కొంతమంది పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖపట్నం, కాకినాడ తదితర ప్రాంతాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్నారన్నారు. గ్రామానికి చెందిన పారా గాలిబాబు, మోసా ఈశ్వరమ్మ, గరికిన రఘుపతి, చోడిపల్లి అనిత తదితరులు ప్లేట్‌లెట్స్‌ పడిపోవడంతో విశాఖపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. గ్రామానికి సమీపంలో రొయ్యల చెరువులు ఉండడంతో దోమల బెడద ఎక్కువగా ఉండడమే కాకుండా, ఆక్వా చెరువుల వల్ల నీరు కలుషితమై జ్వరాలు విజృంభిస్తున్నాయని గ్రామ స్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గతంలో చెరువుల వలన తాగు నీరు కలుషితమై రోగాల బారిన పడుతున్నామని ఆందోళన చేపట్టినా అధికారులు పట్టించుకోలేదని సర్పంచ్‌ ఆరోపిం చారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు.  

Updated Date - 2022-08-19T06:41:06+05:30 IST