14 నుంచి శాసనసభ సమావేశాలు

ABN , First Publish Date - 2022-01-28T16:52:43+05:30 IST

రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభించాలని కేబినెట్‌లో తీర్మానించారు. గురువారం సీఎం బసవరాజ్‌ బొమ్మై అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఏడాది ప్రారంభంలో శాసనసభ సమావేశాలు జరిపే సంప్రదాయం

14 నుంచి శాసనసభ సమావేశాలు

                                    - 166 మంది ఖైదీల విడుదలకు కేబినెట్‌ నిర్ణయం


బెంగళూరు: రాష్ట్ర శాసనసభ సమావేశాలు ఫిబ్రవరి 14 నుంచి ప్రారంభించాలని కేబినెట్‌లో తీర్మానించారు. గురువారం సీఎం బసవరాజ్‌ బొమ్మై అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఏడాది ప్రారంభంలో శాసనసభ సమావేశాలు జరిపే సంప్రదాయం ఉంది. అందుకు అనుగుణంగానే బెంగళూరు విధానసౌధలో కార్యకలాపాలు జరిగేలా తీర్మానించారు. మంత్రివర్గ నిర్ణయాలను శాసనసభా వ్యవహారాల శాఖా మంత్రి మాధుస్వామి మీడియాకు వివరించారు. ఫిబ్రవరి 14నుంచి 25వ తేదీ దాకా ఉభయసభల సమావేశాలు జరుగుతాయన్నారు ఇందుకు ఏర్పాట్లు చేసేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని తీర్మానించామన్నారు. రాష్ట్రంలో వివిధ జైళ్ళలో శిక్షలు అనుభవిస్తూ సత్ప్రవర్తన కలిగిన 166 మంది ఖైదీలను విడుదల చేసేలా తీర్మానించామన్నారు. 2021-22 వి ద్యా సంవత్సరంలో విద్యావికాస ప్రోత్సాహకంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో 1-10 తరగతులలలో చదివే విద్యార్థులకు రూ.93.27 కోట్లతో యూనిఫాంను సమకూర్చాలని తీర్మానించామన్నారు. డాక్టర్‌ కే శివరాంకారంత లే అవుట్‌కుగాను యలహంక తాలూకా పరిధిలో 66.17 ఎకరాల ప్రభుత్వ భూమిని బీడీఏకు మంజూరు చేసేలా నిర్ణయించామన్నారు. రామనగర్‌ జిల్లా చెన్నపట్టణ పట్టు శిక్షణా కేంద్రం పరిధిలో అత్యాధునిక సౌలభ్యాలతో హైటెక్‌ పట్టుగూళ్ళ విక్రయ కేంద్రాన్ని నాబార్డు సాయంతో రూ.75 కోట్లతో నిర్మించేందుకు పాలనాపరమైన అనుమతులు ఇచ్చామన్నారు. కల్యాణకర్ణాటక అభివృద్ది మండలి నిధుల ద్వారా కలబురిగి నగరం సేడం రింగ్‌ రోడ్డు నుంచి ఖర్గే పెట్రోలు బంకుదాకా ఫ్లైఓవర్‌ నిర్మాణాలకు రూ.49 కోట్లు మంజూరు చేశామన్నారు. మైసూరు చాముండేళ్వరి ఆలయ భక్తులకు మౌలిక వసతుల నిర్మాణాలకు రూ.92.81 కోట్లు మంజూరు చేశామన్నారు. బెంగళూరు దక్షిణ విభాగం హుళిమావు గ్రామ పరిధిలో 4.19 ఎకరాల భూమిని ఇంటిలిజెన్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ ఏర్పాటుకు మంజూరు చేశామన్నారు. గ్రామీణ వసతి హక్కు, సాగు భూముల హక్కుల వివరాలను సిద్ధ చేసేందుకు ప్రైవేటు ఏజెన్సీ ద్వారా వైమానిక సమీక్ష జరిపేందుకు రూ.287 కోట్లతో చేపట్టేలా తీర్మానించామన్నారు. 400 మంది పశువైద్యుల నియామకాలకు అనుమతించామన్నారు. వర్తూరు ఎలివేటెడ్‌ కారిడార్‌ను 1.3 కిలోమీటర్‌ల నుంచి 1.99 కిలోమీటర్‌ల మేరన పెంచేందుకు రూ.488కోట్లు కేటాయించామన్నారు. రాయచూరు జిల్లా సిద్దరాంపురలో బంజారా భవన్‌ నిర్మాణాలకు భూసాయ మార్పిడి చేశామన్నారు. చామరాజనగర్‌ జిల్లా గుండ్లుపేట తాలూ కా 131 గ్రామాలకు తాగునీటి కోసం 22 కోట్లు విడుదలకు అంగీకరించామన్నారు. మంగళూరు నగరాభివృద్ధి ప్రాధికార ద్వారా పేదల నివాసాలకై రూ. 30.50 కోట్లతో అభివృద్దికి అంగీకరించామన్నారు. కర్ణాటక అటవీ అభివృద్ధి మండలి, అటవీ పారిశ్రామిక అభివృద్ధి మండలి, జీడిపప్పు అభివృద్ధి మండలిలను విలీనం చేసేలా తీర్మానించామన్నారు. ఇదే సందర్భంగా విద్యాసంస్థల ఆరంభానికి సంబంధించి చర్చ జరిగిందని అయితే నిపుణుల కమిటీతో చర్చించాక నిర్ణయం తీసుకునేలా వాయిదా వేశామన్నారు. ఇతరత్రా అంశాలు చర్చకు రాలేదని కానీ పలు అభివృద్ధి పనులకు పాలనాపరంగా గ్రాంట్లు మంజూరు చేశామని తెలిపారు.

Updated Date - 2022-01-28T16:52:43+05:30 IST