ఫిబ్రవరి 1 నుంచి డోర్‌ డెలివరీ

ABN , First Publish Date - 2021-01-17T05:09:19+05:30 IST

ఫిబ్రవరి 1 నుంచి డోర్‌ డెలివరీ

ఫిబ్రవరి 1 నుంచి డోర్‌ డెలివరీ
కలెక్టర్‌ ఇంతియాజ్‌, జేసీ మాధవీలతతో మాట్లాడుతున్న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌

ఈనెల 21న విజయవాడ జోనల్‌ వాహనాలు ప్రారంభం

బెంజిసర్కిల్‌ వద్ద జెండా ఊపనున్న సీఎం జగన్‌

జిల్లాకు 817 వాహనాలు కేటాయింపు

విజయవాడ, ఆంధ్రజ్యోతి : నిత్యావసరాల డోర్‌ డెలివరీని  ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభించనున్నామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ కోన శశిధర్‌ స్పష్టం చేశారు. కార్డుదారుల ఇంటి దగ్గరకే వెళ్లి నిత్యావసరాలు అందజేసే వాహనాలను ఈనెల 21వ తేదీన సీఎం జగన్‌ ప్రారంభించనున్నట్టు చెప్పారు. నగరంలోని కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ ఇంతియాజ్‌, జాయింట్‌ కలెక్టర్‌ కె.మాధవీలతతో శనివారం ఆయన సమీక్ష జరిపారు. విజయవాడ జోనల్‌ పరిధిలోని కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన డోర్‌ డెలివరీ వాహనాల ప్రారంభోత్సవం, నిత్యావసరాల డోర్‌ డెలివరీపై సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా 9,260 డోర్‌ డెలివరీ ప్రత్యేక వాహనాలను కేటాయించారని, విజయవాడ జోనల్‌ పరిధికి 2,503 కేటాయించినట్టు చెప్పారు. ఈ వాహనాల ప్రారంభాన్ని పండుగలా జరపాలని తెలిపారు. ఈనెల 21వ తేదీ ఉదయం 9 గంటలకు బెంజిసర్కిల్‌ వద్ద ముఖ్యమంత్రి జగన్‌  జెండా ఊపి వీటిని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. అనంతరం వాహనాలు మూడు జిల్లాలకు వెళ్తాయన్నారు. ఆయా ప్రాంతాల్లో కార్డుదారులకు డోర్‌  డెలివరీపై అవగాహన కల్పించటానికి వీలుగా ఒక వీఆర్వోను సమన్వయకర్తగా నియమిస్తామన్నారు. డ్రైవర్లకు శిక్షణ కూడా ఇస్తామని ఆయన చెప్పారు. కలెక్టర్‌ ఇంతియాజ్‌ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఇప్పటికే రేషన్‌కార్డులను సచివాలయాల వారీగా మ్యాపింగ్‌ చేశామన్నారు. ప్రతి గడప వద్దకు వెళ్లి నిత్యావసరాలను అందించేందుకు ప్రత్యేక వాహనాలను సిద్ధం చేశామన్నారు. 

Updated Date - 2021-01-17T05:09:19+05:30 IST