Independence day: భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలు.. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు!
ABN , First Publish Date - 2022-08-14T01:10:10+05:30 IST
భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకుని అమెరికాలోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్.. భారీ ఎత్తున స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిపించేందుకు ఏర్పాట్లు చేసింది.
భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకుని అమెరికాలోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్(Federation of Indian associations).. భారీ ఎత్తున స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరిపించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా పలు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఆగస్టు 15న న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ వద్ద జాతీయ జెండాను ఎగరేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రవాసీ భారతీయులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. అంతేకాకుండా.. హడ్సన్ నదిపై విమానం ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద ఖాదీ త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శిస్తారు. అదే రోజున.. మువ్వన్నెల జెండాను గుర్తుకు తెచ్చేలా ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ త్రివర్ణ కాంతుల్లో మెరిసిపోయేలా ప్రత్యేక లైట్ షో ఏర్పాటు చేశారు. టైమ్స్ స్క్వేర్ వద్ద ఇండియా డే పరేడ్-2022 బిల్బోర్డును కూడా ప్రదర్శించనున్నారు. ఆ రోజంతా పలు సాంస్కృతిక కార్యక్రమాలకు కూడా నిర్వహకులు అన్ని ఏర్పాట్లు చేశారు.