కొండంత బాదుడు!

ABN , First Publish Date - 2022-05-01T08:32:25+05:30 IST

మీ కార్లో యాదగిరిగుట్టకు వెళ్లాలని భావిస్తున్నారా!? యాదగిరి నరసన్నను దర్శించుకోవాలని అనుకుంటున్నారా!? అయితే, మీ కారును కిందే పార్క్‌ చేసి ఆలయ బస్సులో కొండపైకి వెళ్లాలి! ఒకవేళ, కారులోనే కొండపైకి వెళ్లాలని అనుకున్నారనుకోండి..

కొండంత బాదుడు!

  • యాదగిరిగుట్టపైకి ప్రైవేటు వాహనాలకు అనుమతి
  • కాకపోతే, కార్లకు గంటకు పార్కింగ్‌ రుసుము రూ.500
  • గంట దాటితే, ప్రతి గంటకూ రూ.100 చొప్పున చార్జీ
  • ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీల వాహనాలకు మాత్రం ఫ్రీ
  • ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు అనుమతి నిరాకరణ
  • సమీక్షలో అధికారుల నిర్ణయం.. నేటి నుంచి అమల్లోకి
  • గతంలో బైక్‌కు 10; కారుకు 30 మాత్రమే పార్కింగ్‌ ఫీజు


యాదాద్రి, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): మీ కార్లో యాదగిరిగుట్టకు వెళ్లాలని భావిస్తున్నారా!? యాదగిరి నరసన్నను దర్శించుకోవాలని అనుకుంటున్నారా!? అయితే, మీ కారును కిందే పార్క్‌ చేసి ఆలయ బస్సులో కొండపైకి వెళ్లాలి! ఒకవేళ, కారులోనే కొండపైకి వెళ్లాలని అనుకున్నారనుకోండి.. అక్కడ భారీ బాదుడుకు సిద్ధమై వెళ్లాలి! ప్రైవేటు వాహనాల పార్కింగ్‌ రుసుము మొదటి గంటకు రూ.500, ఆ తర్వాత ప్రతి గంటకూ అదనంగా మరో రూ.100 చొప్పున వసూలు చేయాలని ఆలయ అధికారులు నిర్ణయించడమే ఇందుకు కారణం. అంతేనా, ఈ బాదుడంతా కేవలం సామాన్యులపైనే! ప్రజా ప్రతినిధులు, సెలబ్రిటీలు సొంత వాహనాల్లో కొండపైకి వెళ్లారనుకోండి.. వారికి ఫ్రీ!! స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తుల ద్విచక్ర వాహనాలు, ఆటోలు, జీపు, ప్రైవేట్‌ బస్సులు, ఇతర వాహనాలను కొండపైకి ఈ ఏడాది ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి నిషేధించిన విషయం తెలిసిందే. 


కొండపైకి భక్తులను ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా చేరవేస్తున్నారు. అందుకయ్యే వ్యయాన్ని దేవస్థానం భరిస్తోంది. దర్శనాలను పునః ప్రారంభించిన తర్వాత కొండపైకి ప్రైవేట్‌ వాహనాలను అనుమతించకపోవడం వివాదాస్పదమైంది. ఆలయ అధికారుల తీరును స్థానికులు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దాంతో, ఉన్నతాధికారులు శనివారం సమీక్ష నిర్వహించారు. మే ఒకటో తేదీ నుంచి కొండపైకి ప్రైవేట్‌ వాహనాలను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు.


అయితే, గతంలో కొండపైన ద్విచక్ర వాహనాలకు రూ.10; కార్లకు రూ.30 పార్కింగ్‌ ఫీజుగా వసూలు చేసేవారు. ఇప్పుడు ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు కొండపైకి అస్సలు అనుమతి లేదు. కార్లకు పార్కింగ్‌ రుసుము రూ.500గా నిర్ణయించారు. గంట దాటితే ప్రతి గంటకూ అదనంగా రూ. 100 వసూలు చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే యాదగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో స్వామివారి సేవ (ఆర్జిత) టికెట్లు ప్రియమయ్యాయి. గత ఏడాది డిసెంబ రు ధరలతో పోలిస్తే 30 నుంచి 50 శాతానికిపైగా పెంచారు. గతంలో స్వామివారి శాశ్వత బ్రహ్మోత్సవం రూ.1,116 ఉండగా దానిని రూ.1,500కు పెంచారు. శాశ్వత కల్యాణం టికెట్‌ ధర రూ.6,000 ఉండగా రూ.10,000కు, ఆండాల్‌ అమ్మవారి అభిషేకం రుసుము రూ.1,116 నుంచి రూ.2,500కు పెంచారు. పెరిగిన ధరలు ఇప్పటికే సామాన్య భక్తులకు తీవ్ర భారంగా మారగా.. ఇప్పుడు పార్కింగ్‌ రుసుముతో భక్తులపై చార్జీల మోత మోగనుంది.



మే 1 నుంచి అనుమతి: ఈవో గీతారెడ్డి

పార్కింగ్‌ రుసుము నిబంధనలు మే ఒకటో తేదీ నుంచి అమలు చేయనున్నట్లు  ఈవో గీతారెడ్డి తెలిపారు. ప్రధానాలయానికి నిత్యం దాదాపు 50 నుంచి 70 వాహనాల వరకు కొండపైకి వస్తున్నట్లు గుర్తించామని, ఈనెల 26న సమీక్ష నిర్వహించి.. కొండపైకి ప్రైవేట్‌ వాహనాలను అనుమతించాలని మౌఖికంగా ఆదేశించామని చె ప్పారు. కొండపైకి వచ్చే ఒక్కో వాహనానికి గంటకు రూ.500 చొప్పున చార్జీ నిర్ణయించామన్నారు. అయితే, స్వామివారి దర్శనార్థం కొండపైకి విచ్చేసే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, అధికారులు, న్యాయమూర్తుల వాహనాలకు ప్రొటోకాల్‌ ప్ర కారం ప్రవేశ రుసుం మినహాయింపు వర్తిస్తుందని తెలిపారు. అలాగే, దేవస్థానానికి భారీ విరాళాలు అందజేసే దాతల వాహనాలకు ప్రవేశ రుసుము మినహాయింపు వర్తిస్తుందన్నారు. కొండపైకి అనుమతించిన వాహనాలను క్యూ కాంప్లెక్స్‌ ఎదురుగా ఉన్న బస్టాండ్‌, వీఐపీ గెస్ట్‌హౌస్‌ పక్కన ఖాళీస్థలంలో బస్సులు తిరిగేందుకు అసౌకర్యం లేనంతవరకు పార్కింగ్‌ చేయించాలని ఆదేశించామన్నారు.


Updated Date - 2022-05-01T08:32:25+05:30 IST