కేంద్రంతో ఫీజు పంచాయితీ

ABN , First Publish Date - 2022-05-01T08:27:55+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరో వివాదం రాజుకుంటోంది.

కేంద్రంతో ఫీజు పంచాయితీ

  • దళిత విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ను నేరుగా
  • చెల్లించేందుకు అంగీకరించని రాష్ట్ర ప్రభుత్వం
  • 40 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటాను విద్యార్థుల
  • ఖాతాల్లో జమ చేయాలని కేంద్రం ప్రతిపాదన
  • ఆపై తమ వాటా 60 శాతం వేస్తామని వెల్లడి
  • ఒప్పుకోని రాష్ట్రం.. 250 కోట్ల అదనపు భారం


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరో వివాదం రాజుకుంటోంది. దళిత విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిపల చెల్లింపు అంశం ఇందుకు కారణమవుతోంది. స్కాలర్‌షి్‌పలను కాలేజీల యాజమాన్యాలకు కాకుండా.. నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంలేదు. దీంతో కేంద్రం వాటాగా రావాల్సిన నిధులు కూడా నిలిచిపోయి.. రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అసలే ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న సర్కారుకు ఇది మరింత భారంగా మారనుంది. రాష్ట్రంలో దళిత విద్యార్థులకు చెల్లిస్తున్న స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కుగాను ఏటా రూ.450 కోట్ల వరకు అవసరమవుతాయి. గతంలో కేంద్రం వాటా 15 శాతం (రూ.67.5 కోట్లు), రాష్ట్రం వాటా 85 శాతం (రూ.382.5 కోట్లు) ఉండేది. 


ఈ మొత్తాన్ని కాలేజీల యాజమాన్యాల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసేది. అయితే 2021-22 విద్యా సంవత్సరం నుంచి కేంద్రం తన వాటాను 60 శాతానికి పెంచి ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో కేంద్రం నుంచి రాష్ట్రానికి ఏటా సుమారు రూ.250 కోట్లు వస్తాయి. ఈ మొత్తాన్ని విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తామని కేంద్రం తెలిపింది. వారిపేరిట బ్యాంకు ఖాతాలు తెరిపించాలని, రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 40 శాతం మొత్తాన్ని ముందుగా వారి ఖాతాల్లో జమ చేయాలని పేర్కొంది. ఆపై తమ వాటాను జమ చేస్తామని తెలిపింది. ఈ ప్రతిపాదనపై గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు సమావేశమై చర్చించారు. నేరుగా విద్యార్థుల ఖాతాలో నగదు జమ చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని, దుర్వినియోగమయ్యే అవకాశాలు కూడా ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కేంద్ర అధికారులకు తెలిపారు. సమావేశం అనంతరం ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి తెలపాలని ఎస్సీ సంక్షేమశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించారు. 


కేంద్రం ప్రతిపాదనకు నో..

దళిత విద్యార్థుల స్కాలర్‌షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు అంగీకరించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే విషయాన్ని త్వరలో లిఖితపూర్వకంగా తెలియజేసేందుకు ఏర్పాట్లు చేయాలని తమకు ఆదేశాలు వచ్చినట్లు ఉన్నతాధికారి ఒకరు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. అయితే ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయకపోవడంతో కేంద్రం 2021-22 విద్యా సంవత్సరం వాటా రూ.250 కోట్లు ఇవ్వలేదు. దీంతో మొత్తం రూ.450 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సిన పరిస్థితి తలెత్తింది. మున్ముందు కూడా ఈ విషయంలో స్పష్టత రాకపోతే ఏటా రూ.250 కోట్ల భారం పడనుంది. ఇదిలా ఉండగా.. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై వివిధ రాష్ట్రాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో అభ్యంతరం చెబుతూ కొందరు కోర్టును ఆశ్రయించారు. అమ్మఒడి పథకంలో భాగంగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని ఏపీ ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. ప్రస్తుతం ఆ అంశం పెండింగ్‌లో ఉంది. ఉత్తరప్రదేశ్‌తోపాటు ఒకటి, రెండు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రం కేంద్రం ప్రతిపాధించిన విధానాన్ని అమలు చేస్తున్నారు. యూపీలో విద్యార్థులు కాలేజీల్లో చేరిన సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తమ 40 శాతం వాటాను వారి ఖాతాల్లో జమ చేయగా, డిసెంబరులో కేంద్రం వాటాను జమ చేసింది. 

Updated Date - 2022-05-01T08:27:55+05:30 IST