పెద్ద చదువులకు పేదరికం అడ్డుకాకూడదు

Dec 1 2021 @ 03:26AM

  • విద్యార్థులకు తోడుగా నిలిచేందుకే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌
  • వారం పది రోజుల్లో కాలేజీలకు చెల్లించాలి
  • ముఖ్యమంత్రి జగన్‌ వెల్లడి
  • మూడో విడత విద్యా దీవెన కింద తల్లుల ఖాతాల్లో 686 కోట్లు జమ


అమరావతి, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): ‘పిల్లలు పెద్ద చదువులు చదవడానికి, పెద్దస్థాయికి ఎదగడానికి పేదరికం అడ్డు రాకూడదు.. అడ్డు కాకూడదు. వారికి అన్ని రకాలుగా మంచి జరగాలి. వారికి అండగా తోడుగా నిలబడుతూ ఈరోజు మనం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌  పథకాన్ని అమలు చేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. జగనన్న విద్యా దీవెనలో భాగంగా మూడోవిడత సొమ్ము రూ.686 కోట్లను.. 9,87,965 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో.. మంగళవారమిక్కడ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో.. కంప్యూటర్‌ బటన్‌ నొక్కి ఆయన జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ మొత్తంతో 11.03 లక్షల మంది పిల్లలకు మేలు కలుగుతుందన్నారు. పేదరికం పోవాలన్నా, మన తలరాతలు మారాలన్నా పేద సామాజిక వర్గాల్లో నుంచి ఇంజనీర్లు, డాక్టర్లు వంటి పెద్ద చదువులు చదువుకున్న వారి సంఖ్య బాగా పెరగాలని చెప్పారు. ‘మన లక్ష్యం ఈ రోజు వందకు వంద శాతం అక్షరాస్యత కాదు. వందకు వంద శాతం గ్రాడ్యుయేట్లుగా నిలబెట్టాలన్నదే మన లక్ష్యం. మంచి ఆశయాలతో, మంచి మనసుతో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని విద్యా దీవెనగా అందిస్తున్నాం. గత ప్రభుత్వం చెల్లించాల్సిన, బకాయిలుగా పెట్టి వదిలేసిన రూ .1,778 కోట్లు బకాయిలు కూడా కలిపి, మనం చేసిన ఖర్చు అక్షరాలా రూ.6,259 కోట్లు. ఈ డబ్బులతో దాదాపు 21,48,477 మంది విద్యార్థులకు మేలు జరిగింది. 


తల్లులందరికీ మనస్ఫూర్తిగా ఒక్క మనవి చేస్తున్నాను. మీ ఖాతాల్లో జమయిన సొమ్మును వారం పది రోజుల్లోగా కళాశాలలకు చెల్లించాల్సిన బాధ్యత మీపై ఉంది. మీరు కాలేజీలకు చెల్లించకపోతే తదుపరి విడతలో ఆ ఫీజు డబ్బులు నేరుగా కళాశాలలకే ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది’ అని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రం లో మొత్తం 11 మెడికల్‌ ప్రభుత్వ కాలేజీలు ఉంటే.. మరో 16 వైద్య కశాళాలలకు శ్రీకారం చుట్టామని.. రెండేళ్లలో ఇవి అందుబాటులోకి వస్తాయని జగన్‌ తెలిపారు. ‘విజయనగరం జిల్లాలో గురజాడ జేఎన్టీయూ, ఒంగోలులో ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం తీసుకొస్తున్నాం. సాలూరులో ట్రైబల్‌ వర్సిటీకి త్వరలోనే శంకుస్థాపన చేసి పనులు మొదలుపెడతాం. కర్నూల్లో క్లస్టర్‌ యూనివర్సిటీని నెలకొల్పుతున్నాం’ అని చెప్పారు. 


వారంలోగా కళాశాలలకు చెల్లించండి

తల్లులకు ప్రభుత్వ సూచన.. ఉత్తర్వులు జారీ

జగనన్న విద్యా దీవెన పేరుతో తల్లుల ఖాతాల్లో జమ అయిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సొమ్మును వారం రోజుల్లో విద్యార్థుల తల్లులు వారి పిల్లలు చదివే కళాశాలలకు వెళ్లి విధిగా చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. మంగళవారం ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చెల్లించకుంటే జ్ఞానభూమి పోర్టల్‌లో కళాశాలల యాజమాన్యాలు ఫిర్యాదు చేసుకునే అవకాశం కల్పించింది. ఆ ఫిర్యాదును అనుసరించి గ్రామ, వార్డు వాలంటీర్లు విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి వారు ఫీజు చెల్లించేలా చూడాలని ఆదేశించింది. మూడు వారాల తర్వాత కూడా ఫీజు చెల్లింకపోతే తదుపరి విడతలో ప్రభుత్వమే నేరుగా తల్లుల ఖాతాలకు కాకుండా, విద్యార్థి చదివే కళాశాలల ఖాతాకే వేయనున్నట్లు జీవోలో స్పష్టం చేసింది. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.