వాన గండం

ABN , First Publish Date - 2021-11-19T05:55:19+05:30 IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలతో వారం రోజులుగా వర్షాలు జిల్లాను ముంచెత్తుతున్నాయి.

వాన గండం
నందికొట్కూరులో తడిసిన మొక్కజొన్న పంట

  1. కోతకొచ్చిన పంటకు ముప్పు
  2. పొలాల్లో వర్షపు నీటి నిల్వ
  3. పత్తి, శనగ, మిరప, ఉల్లికి నష్టం 
  4. మరో రెండు రోజులు భారీ వర్షాలు
  5. దిగుబడులు దక్కవని రైతుల ఆందోళన


కర్నూలు(అగ్రికల్చర్‌), నవంబరు 18: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలతో వారం రోజులుగా వర్షాలు జిల్లాను ముంచెత్తుతున్నాయి. ఎండ కాయడమే లేదు. లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ పంటలన్నీ కోత దశకు చేరుకున్నాయి. వీటిని పెరికి ఆరబెట్టేందుకు రైతులు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో వర్షాలు, ముసురుతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్‌లో సాగు చేసిన ఉల్లి, పత్తి, మొక్కజొన్న, మిరప పంటలతో పాటు రబీలో వేసిన శనగ పంటకు ఈ వర్షం తీవ్ర ముప్పుగా పరిణమించిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


దెబ్బతింటున్న పంట


జిల్లాలో ఖరీఫ్‌లో 5.90 లక్షల హెక్టార్లలో వేరుశనగ, పత్తి, మొక్కజొన్న, ఉల్లి, మిరప తదితర పంటలు సాగు చేశారు. వరి పక్వానికి రావడంతో పైరును కోసి, నూర్పిడి చేసేందుకు యంత్రాలను సిద్ధం చేసుకున్నారు. వర్షాలు నెమ్మదించి ఎండ కాస్తే పొలాల్లోకి దిగాలని ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ తెరిపి ఇవ్వకపోవడంతో పంటను ఎలా కాపాడుకోవాలో తెలియక దిగులు చెందుతున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ బుధవారం హెచ్చరించింది. దీంతో రైతుల ఆందోళన మరింత ఎక్కువైంది. ఖరీఫ్‌లో దాదాపు లక్షన్నర ఎకరాల్లో వరి, 6 లక్షల ఎకరాల్లో పత్తి, 60 వేల ఎకరాల్లో ఉల్లి, 50 వేల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు. మొక్కజొన్న దాదాపు లక్షన్నర ఎకరాల్లో సాగైంది. వర్షాల కారణంగా ఆముదం, కూరగాయల పంటలు నీటమునిగాయి. నందికొట్కూరు, ఆత్మకూరు, నంద్యాల, పాణ్యం నియోజకవర్గాల్లో మొక్కజొన్న వర్షానికి తడవకుండా రైతులు కిందామీద పడుతున్నారు. పత్తిని తీసేందుకు భారీగా కూలీలను ఏర్పాటు చేసుకున్న రైతులు వర్షం కారణంగా ఏమీ చేయలేకున్నారు. వర్షం మరో వారం రోజులు కొనసాగితే పంట చేతికి వచ్చే పరిస్థితి ఉండదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


రబీ పంటకూ నష్టమే


రబీ సీజన్‌లో జిల్లాలో దాదాపు 2 లక్షల ఎకరాల్లో శనగ పంటను రైతులు సాగు చేశారు. జొన్న, వరి, వేరుశనగ పంటను కూడా మరో లక్ష ఎకరాల్లో సాగయ్యాయి. వేరుశనగ పంటకు వేరుకుళ్లు సమస్యలు వస్తున్నాయి. కంది పూత రాలిపోతోంది. మొక్కజొన్న రంగు మారి బూజు తెగులు సోకే ప్రమాదం ఏర్పడింది. ఉల్లి రైతు పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఈ పంట మొత్తం పొలాల్లోనే తడిసి కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. కర్నూలు మార్కెట్‌ యార్డుకు వచ్చే ఉల్లి నిల్వలు ఎండ లేనికారణంగా ఆరబెట్టే వీలులేక కుళ్లిపోతున్నాయి. యార్డులో దుర్వాసన వస్తుండటంతో కుళ్లిన గడ్డలను తొలగించేందుకు మార్కెట్‌ అధికారులు పడరాని పాట్లు పడుతున్నారు.


ఇంకా వానలు


బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం పశ్చిమ దిశగా ప్రయాణించి గురువారం నైరుతి బంగాళాఖాతం వద్ద దక్షిణాంద్ర, ఉత్తర తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, వీటి ప్రభావంతో రానున్న నాలుగు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఈ ప్రభావం వల్ల కర్నూలు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం జిల్లా కలెక్టరేట్‌కు సమాచారం ఇచ్చింది. 


17,370 హెక్టార్లలో పంట నష్టం: జేడీఏ వరలక్ష్మి 


జిల్లాలో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు వివిధ దశల్లో ఉన్న ఖరీఫ్‌, రబీ పంటలు 17,371 హెక్టార్లు దెబ్బతిన్నాయని వ్యవసాయశాఖ జేడీ వరలక్ష్మి తెలిపారు. దొర్నిపాడు, కోవెలకుంట్ల, చాగలమర్రి, హోళగుంద, కొలిమిగుండ్ల, కోసిగి, బండి ఆత్మకూరు, పాణ్యం, బనగానపల్లె, మహానంది, నంద్యాల, ఆళ్లగడ్డ మండలాల్లో వరి 6,100 హెక్టార్లలో దెబ్బతిందన్నారు. మినుములు 700 హెక్టార్లు, పప్పుశనగ 9,570 హెక్టార్లలో దెబ్బతిన్నాయన్నారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందజేశామన్నారు. వర్షాల వల్ల పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. 

Updated Date - 2021-11-19T05:55:19+05:30 IST