పెరగనున్న ఫీజులు!

ABN , First Publish Date - 2021-11-10T15:47:19+05:30 IST

రాష్ట్రంలో..

పెరగనున్న ఫీజులు!

ఇంజనీరింగ్‌ ఫీజుల పెంపు!

వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు

వారం రోజుల్లో నోటిఫికేషన్‌ జారీ

ఫీజుల నియంత్రణ కమిటీ సమావేశంలో నిర్ణయం


హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ ఫీజులు పెరగనున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫీజులను పెంచనున్నారు. ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కోర్సులతోపాటు, ఇతర వృత్తివిద్యా కోర్సుల ట్యూషన్‌ ఫీజులను కూడా పెంచే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. తెలంగాణ అడ్మిషన్స్‌ అండ్‌ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్‌సీ) సమావేశం మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి... అంటే 2022-23 నుంచి 2024-25 విద్యా సంవత్సరం వరకు మూడేళ్లపాటు అమల్లో ఉండే విధంగా ఫీజుల ఖరారుపై ఈ సమావేశంలో చర్చించారు. ఇంజనీరింగ్‌, బీఎడ్‌, బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు సంబంధించిన ఫీజులను ఈ కమిటీనే నిర్థారిస్తుంది.


కాలేజీల్లో వసతులు, ఫ్యాకల్టీ తదతర ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం కమిటీ ఫీజులను ఖరారు చేయనుంది. మూడేళ్లకు ఒకసారి ఫీజులను పెంచుకొనే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా 2016లో, ఆ తర్వాత మళ్లీ 2019లో ప్రైవేట్‌ కాలేజీల్లో ఫీజులను పెంచారు. 2019లో పెంచిన ఫీజుల గడువు ప్రస్తుత విద్యా సంవత్సరంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో వచ్చే మూడేళ్లకు సంబంధించిన ఫీజులను నిర్ణయించాల్సి ఉంది.


నామమాత్రంగానే ఫీజుల పెంపు..!

కరోనా నేపథ్యంలో తల్లిదండ్రులకు ఫీజులు భారం కాకుండా, నామమాత్రంగానే పెంచాలని కమిటీ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు తెలిసింది. రాష్ట్రంలోని పలు కాలేజీల్లో ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), డేటా సైన్స్‌, మైనింగ్‌ తదితర కొత్త కోర్సులను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీన్ని దృష్టిలో ఉంచుకొని వృత్తి విద్యాకోర్సుల ఫీజుల పెంపుపై సమావేశంలో చర్చించారు. ఫీజుల పెంపుపై ప్రభుత్వానికి లేఖ రాయాలని కూడా అధికారులు భావిస్తున్నారు. ఫీజులకు సంబంధించిన నోటిఫికేషన్‌ జారీ అయ్యాక ఆయా కాలేజీలు తమ ఆదాయ, వ్యయాలకు సంబంధించిన ఆడిట్‌ నివేదికలను కమిటీకి సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం ఆయా కాలేజీల్లో కమిటీ నిపుణులు తనిఖీలను చేపట్టనున్నారు. ఆ తర్వాత పెంపుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

Updated Date - 2021-11-10T15:47:19+05:30 IST