రైతుల్లో ఫీ‘డర్‌’

ABN , First Publish Date - 2021-11-25T06:20:00+05:30 IST

వెలిగొండ వస్తుంది.. తమ బతుకుల్లో వెలుగులు నింపుతుందని.. వేయి కళ్లతో ఎదురుచూస్తున్న రైతులకు కడగండ్లే మిగులుతున్నాయి.

రైతుల్లో ఫీ‘డర్‌’
కడపరాజుపల్లె వద్ద వరద నీటికి తెగిన ఫీడర్‌ కెనాల్‌ (ఫైల్‌)

నాసిరకం..నిర్లక్ష్యం..!

అస్తవ్యస్తంగా వెలిగొండ కాలువలు

మళ్లీ ప్రధాన కాలువకు భారీ గండి

40 ఎకరాల్లో పంట మునక

ఆందోళనలో రైతులు

రెండేళ్ల క్రితం  కడపరాజుపల్లె వద్ద తెగిన కట్ట

నేటికీ అందని పరిహారం 

వెలిగొండ కాలువలు కడగండ్లు మిగుల్చుతున్నాయి. వాన కురిసిందంటే చాలు కట్టలు ఎక్కడ తెగుతాయోనన్న భయం వెంటాడుతోంది. అస్తవ్యస్త నిర్మాణమే అందుకు కారణం. పెద్ద సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం తమ భూముల సమీపంలో జరుగుతుంటే ఏ రైతుకైనా సంతోషం ఉంటుంది. కానీ వెలిగొండ ప్రాజెక్టులో కీలకమైన ఫీడర్‌ కెనాల్‌ నిర్మాణంతో చుట్టుపక్కల గ్రామాల రైతుల్లో గుబులు నెలకొంది. వానొస్తే చాలు కాలువ వైపే వణుకుతూ చూస్తున్నారు. ఎక్కడ గండిపడుతుందో.. తమ పొలాలు నీట మునుగుతాయోనని గజగజలాడుతు న్నారు. ప్రధానంగా మండలంలోని కడపరాజుపల్లె, కటకానిపల్లె గ్రామాలకు చెందిన రైతులకు ముంపు కష్టాలు తప్పడం లేదు.    మిగతా తీగలేరు తదితర కాలువలదీ అదే పరిస్థితి.

పెద్దదోర్నాల, నవంబరు 24 : వెలిగొండ వస్తుంది.. తమ బతుకుల్లో వెలుగులు నింపుతుందని.. వేయి కళ్లతో ఎదురుచూస్తున్న రైతులకు కడగండ్లే మిగులుతున్నాయి. ప్రాజెక్టు పూర్తవుతుందో లేదో కానీ.. ఆ ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధాన కాలువ కట్టలు నాసిరకంగా నిర్మించడంతో తరచూ వరద నీటికి తెగిపోయి పంటలకు నష్టం వాటిల్లుతోంది. కృష్ణా నదిలోని కొల్లంవాగు ప్రాంతం నుంచి మిగులు జలాల ద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని క్షామ ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు నిర్మిస్తున్న పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు కీలక భాగాలైన మొదటి సొరంగం పనులు పూర్తికాగా, రెండో సొరంగం పనులను నడుస్తున్నాయి. అయితే కీలకమైన ప్రాజెక్టులోని ప్రధాన కాలువల పరిస్థితి దయనీయంగా మారింది. ప్రాజెక్టు నిర్మాణం మొదట్లో దాదాపు పుష్కర కాలం క్రితం తవ్విన ఫీడర్‌, తీగలేరు కాలువలు అధ్వానంగా మారాయి. కాలువల్లో చిల్లకంప పెరిగింది. కరకట్టలు కోతలకు గురయ్యాయి. చిన్నపాటి వర్షానికే గండ్లు పడుతున్నాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 


ఫీడర్‌ కెనాల్‌ అంటే  రైతుల్లో గుబులు

కృష్ణా నది నుంచి దోర్నాల మండలం కొత్తూరు వరకు 18.80 కిలోమీటర్లు సొరంగాల ద్వారా ప్రవహించి అక్కడ నుంచి ప్రధానమైన ఫీడర్‌ కెనాల్‌ ద్వారా 21.80కి.మీ దూరంలో ఉన్న నల్లమల రిజర్వాయర్‌కు నీరు చేరతాయి. అందుకు గానూ ఫీడర్‌ కెనాల్‌ను రూ.145 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఇప్పటివరకు 21 కిలో మీటర్ల తవ్వకం పూర్తయ్యింది. మిగిలిన భాగం కొంత తవ్వినా కాలువను పటిష్ట పరచలేదు. కరకట్టలు అందుబాటులో ఉన్నా తువ్వ, చౌడు మట్టిని పోయడంతోపాటు రోలింగ్‌ చేయకపోవడంతో చిన్న వర్షానికే కోతకు గురవుతున్నాయి. కాలువకు కొంతభాగం కుడివైపు కొండప్రాంతం ఉంది. ఒకవైపు మాత్రమే కరకట్టను పటిష్ట పరచాల్సి ఉండగా, అది కూడా నాసిరకంగా చేపట్టడంతో తరచూ కోతలు, గండ్లు పడుతున్నాయి. దీంతో నీరు ఉధృతంగా పక్కనున్న పొలాల్లోకి ప్రవహించడంతో పైర్లు ముంపునకు గురవుతున్నాయి. ఆరుగాలం శ్రమించి పండించినపంటలు నీటిపాలవుతున్నాయి. సారవంతమైన భూములు కోతలు పడి రాళ్లు ఏర్పడుతున్నాయి.ఈ కాలువపై 20చోట్ల వంతెనలు నిర్మించాల్సి ఉంది. 14 వంతెనలు నిర్మించారు. అవి కూడా అసంపూర్ణమే. ఇటీవల కాలువల నిర్మాణాలకు అదనంగా రూ.150కోట్ల నిధులు మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. 


 తీగలేరు అంతే 

ప్రాజెక్టులోని ముఖ్యమైన సప్లై చానల్‌ తీగలేరు కాలువ దాని నిర్మాణం కూడా అసంపూర్ణమే. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పెద్దారవీడు, దోర్నాల, ఎర్రగొండపాలెం, పుల్లలచెరువు మండలాలకు సాగు నీరందించేందుకు గానూ 48.300 కిలోమీటర్లు నిర్మించేందుకు రూ.77కోట్లతో పనులు ప్రారంభించారు. ఇప్పటికి 47.060 కి.మీ తవ్వకం చేశారు.ఈ కాలువపై 73 వంతెనలు నిర్మించాల్సి ఉంది. ఇప్పటికి 40 వంతెనలు పూర్తిచేశారు. ఇంకా 33 నిర్మించాల్సి ఉంది. అంతే గాకనల్లమల రిజర్వాయర్‌కు తీగలేరు అనుసంధానం గా 600 మీటర్లు సొరంగం తవ్వాల్సి ఉంది. అంతేగాక కాలువల్లో చిల్లకంప పెరిగి అస్తవ్యస్తంగా ఉండడంతో వర్షం పడినప్పుడు వరదనీరు పొలాల్లో ప్రవహిస్తున్నాయి. పల్లపు ప్రాంతాలను కోతలకు గురిచేస్తున్నాయి.  


చిన్నపాటి వర్షానికే గండ్లు

మూడు జిల్లాలకు చెందిన 40 మండలాల్లోని 4,47,300 ఎకరాలకు రెండు సొరంగాల ద్వారా 40 టీఎంసీలు సాగునీరందించే ఫీడర్‌ కాలువ నిర్మాణం ఎంతో పటిష్టంగా ఉండాలి. అందుకు భిన్నంగా నామమాత్రంగా కాలువను తవ్వి వదిలేస్తే ప్రాజెక్టు నుంచి వచ్చే కృష్ణానీరు నల్లమల జలాశయాలకు చేరుతాయనే అనుమానం అందరిలోనూ వ్యక్తమవుతోంది. రెండేళ్ల క్రితం కడపరాజుపల్లె గ్రామం సమీపంలో కట్ట తెగి గ్రామంలోకి నీరు చేరింది. బొప్పాయి, అరటి, మిరప, పత్తి వంటి పంటలు నాశనమయ్యాయి. పొలాలన్నీ రాళ్లు చేరి కోతకు గురయ్యాయి. అప్పటి కలెక్టర్‌ పోలా భాస్కర్‌ గ్రామానికి వచ్చి పరిశీలించారు నష్టపరిహారం ఇస్తామన్నారు. నేటికీ ఆ ఊసే లేదు. ఈ ఏడాది ఆగస్టులో కురిసిన వానకు కటకానిపల్లె గ్రామం సమీపంలో ఫీడర్‌ కాలువకు గండి పడి 50 ఎకరాల్లో సాగు చేసిన పంటలు నీటి పాలయ్యాయి. మళ్లీ నాలుగు రోజుల క్రితం చిన్న వానకే ప్రధాన కాలువకు గండిపడింది. దీంతో గ్రామానికి చెందిన సుభాని, దూదేకుల రసూల్‌, వెంకటేశ్వరరావు, సత్యనారాణ, పాపయ్య,  వీరరాఘవయ్య మరికొందరు రైతులకు చెందిన 40 ఎకరాల్లో సాగు చేసిన మిరప నీట మునిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాలువల నిర్మాణాన్ని పటిష్టంగా చేయాలని రైతులు కోరుతున్నారు.




Updated Date - 2021-11-25T06:20:00+05:30 IST