ఫీజులు ఫుల్‌.. వసతులు నిల్‌!

ABN , First Publish Date - 2022-05-17T05:00:18+05:30 IST

జిల్లాలో పాఠశాల విద్యాశాఖ పరిధిలో జరిగే అన్ని రకాల పరీక్షల నిర్వహణ, ఫీజుల వసూళ్లకు ప్రత్యేకంగా పరీక్షల విభాగం పని చేస్తోంది.

ఫీజులు ఫుల్‌..  వసతులు నిల్‌!
నేలపై కూర్చొని పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు (ఫైల్‌)

పరీక్షల నిర్వహణకు రూ.41.9 లక్షలకుపైగా వసూలు

ఒక్కో టెన్త్‌ విద్యార్థి నుంచి రూ.125..

ఎగ్జామ్స్‌ సెంటర్లలో నామమాత్రంగా వసతులు

సిబ్బందికి కంటితుడుపుగా రెమ్యూనరేషన్‌

అక్రమాలకు అడ్డాగా జిల్లా పరీక్షల విభాగం


పరీక్షల పేరుతో విద్యార్థుల నుంచి భారీగా ఫీజులు వసూళ్లు చేస్తున్నా, నామమాత్రపు వసతుల కల్పనతో చేతులు దులుపుకుంటోంది జిల్లా పరీక్షల విభాగం. ఈ క్రమంలో పరీక్షల నిర్వహణ తీరుపై ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేగాక  పరీక్షల సిబ్బందికి కంటితుడుపుగా రెమ్యునరేషన్‌ ఇస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షల విభాగం అధికారులు, సిబ్బంది లక్షలాది రూపాయలు పక్కదారి పట్టిస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి.


నెల్లూరు (విద్య) మే 16 : జిల్లాలో పాఠశాల విద్యాశాఖ పరిధిలో జరిగే అన్ని రకాల పరీక్షల నిర్వహణ, ఫీజుల వసూళ్లకు ప్రత్యేకంగా పరీక్షల విభాగం పని చేస్తోంది.  పరీక్షల ఫీజు పేరుతో  భారీగా వసూళ్లు చేస్తున్న ఆ విభాగం పరీక్షల నిర్వహణ కోసం ఖర్చు పెట్టడానికి వెనకడుగు వేస్తోందని ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఉదాహరణకు పదోతరగతి వార్షిక పరీక్షలకు ఒక్కో విద్యార్ధి నుంచి రూ.125 (ఎలాంటి అపరాధ రుసుము లేకుండా) వసూలు చేశారు. ఫీజులు ఆలస్యంగా చెల్లించే వారి నుంచి అపరాధ రుసుము పేరుతో మరికొంత అదనంగా కట్టించుకున్నారు. దీన్నిబట్టి జిల్లాలో 33,527 మంది నుంచి రూ.41.90 లక్షలు వసూలు చేశారు. అపరాధ రుసుము కింద మరో రూ.5లక్షల వరకు వచ్చినట్లు సమాచారం. ఈ నిధులతో విద్యార్థులకు అన్ని వసతులు కల్పించడంతోపాటు విధుల నిర్వహణలో ఉన్నవారికి చెల్లించే భత్యాన్ని కూడా ఇదే నిధుల నుంచి ఖర్చుచేయాలి. అయితే వసూలు చేసిన మొత్తంలో నుంచి కనీసం 10శాతం కూడా వెచ్చించ లేదన్నది వాస్తవం.


వసూలు లక్షల్లో... ఖర్చు వేలల్లో..

ప్రభుత్వ పరీక్షల విభాగం విద్యార్థుల నుంచి లక్షల రూపాయల ఫీజులను వసూలు చేస్తున్నా పరీక్షల నిర్వహణలో మాత్రం తూతూమంత్రంగా నిధులు విడుదల చేస్తూ అత్యధికంగా ప్రైవేట్‌ స్కూళ్లపై బాధ్యతలు మోపుతున్నారు. కానీ ప్రభుత్వానికి అందించే లెక్కల్లో మాత్రం లక్షలు వెచ్చించినట్లు చూపిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.  విద్యార్ధుల సంఖ్యను బట్టి ఒక్కో విద్యార్ధికి పరీక్షల సమయంలో వసతుల నిమిత్తం నిధులు కేటాయించాలి. అలాగే పరీక్షల నిర్వహణ నేపథ్యంలో స్టేషనరీ, గుడ్డసంచులు, ప్రొఫార్మాలు, కట్టర్‌, బోల్డ్‌మార్కర్‌లు, పాలిథీన్‌ కవర్లు, గమ్‌, పెట్టెలకు తాళాలు, సూది, దారం, స్కేల్‌, లక్క తదితర స్టేషనరీ కోసం ప్రభుత్వ పరీక్షల విభాగం నుంచి నిధులు కేటాయిస్తారు. గతంలో ఒక్కో విద్యార్థిక కేవలం రూ.2 మాత్రమే చెల్లించేవారు. అనంతరం దీన్ని 2016లో రూ.5లకు, 2019లో రూ.8లకు పెంచారు. ఈ ఏడాది దీన్ని రూ.12లకు పెంచాలని ప్రతిపాదనలు పంపినా పాత పద్ధతిలో రూ.8 మాత్రమే చెల్లించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఒక పరీక్ష కేంద్రంలో వందమంది విద్యార్ధులు ఉంటే వసతుల కల్పనకు రూ.800 చొప్పున చెల్లిస్తున్నారు. అయితే అన్ని రకాల పరీక్షలను ప్రైవేట్‌ సెంటర్లలో నిర్వహించడంతో వసతులన్నీ ఆయా పాఠశాలల యాజమాన్యాలే భరిస్తున్నాయి. కానీ లెక్కల్లో మాత్రం అన్ని పరీక్ష కేంద్రాలకు నిధులు వెచ్చించినట్లు చూపుతారన్న ఆరోపణలు విద్యాశాఖలో సర్వత్రా వినిపిస్తూనే ఉన్నాయి. 


రెండేళ్ల నిధులు మాయం

కొవిడ్‌ కారణంగా రెండేళ్లపాటు పరీక్షలు  జరగలేదు. కానీ ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్‌ పాఠశాలల నుంచి మాత్రం పరీక్షల విభాగం ఫీజులు వసూలు చేశారు. త్రైమాసిక, అర్ధవార్షిక, వార్షిక పరీక్షల నిర్వహణకు ప్రశ్నపత్రాల ముద్రణ వేసి సరఫరా చేయాల్సి ఉంది. ఫీజులు వసూలు చేశారు కానీ కొవిడ్‌ నేపథ్యంలో పరీక్షలు నిర్వహించలేదు. కనీసం ఈ నిధులను కూడా ప్రభుత్వానికి చెల్లించలేదు. విద్యార్థులకూ వెనక్కి ఇవ్వలేదు. అయితే ఈ విద్యాసంవత్సరంలో పుస్తకాలు తయారీ, ప్రశ్నపత్రాలు, ఇతర ప్రకటనల పేరుతో దొంగ లెక్కలు చూపించనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 


కంటితుడుపు రెమ్యూనరేషన్‌

ప్రభుత్వ పరీక్షల్లో సిబ్బందికి చెల్లించే రెమ్యూనరేషన్‌పై సంబంధిత సిబ్బంది తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇటీవల జరిగిన పదోతరగతి పరీక్ష కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్‌, డిపార్ట్‌మెంటల్‌ ఆఫీసర్లు, ఏడీవోలు, సిట్టింగ్‌ స్క్వాడ్స్‌ సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.44, ఇన్విజిలేటర్‌లు, క్లర్క్‌లకు రూ.22, అటెండర్లకు రూ.13.20, వాటర్‌మన్‌, స్వీపర్లకు రోజుకు రూ.11 చెల్లించారు. వీటితో పాటు పరీక్ష కేంద్రాల్లో కల్పించే వసతులకు ఒక్కో విద్యార్ధికి రూ.8 చొప్పున ఖర్చు చేశామని చెబుతున్నారు. మరీ ఇంత దారుణంగా రెమ్యూనరేషన్‌ చెల్లించడమేమిటని, రోజుకు కూలికి వెళ్లే వారికి సైతం రూ.500 ఇస్తున్నారంటూ సిబ్బంది మండి పడుతున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి వసతుల కల్పనకు నిధులు పెంచడంతోపాటు పరీక్షల విధుల్లో పాల్గొనే సిబ్బందికి రెమ్యూనరేషన్‌ పెంచాలని కోరుతున్నారు. అలాగే పరీక్షల విభాగంలో జరిగే అక్రమాలపై విచారణ జరిపాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 

Updated Date - 2022-05-17T05:00:18+05:30 IST