జయశంకర్‌ అగ్రి వర్సిటీలో ఫీజుల మోత!

ABN , First Publish Date - 2022-09-27T21:34:12+05:30 IST

ఆచార్య జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఫీజుల మోత మోగుతోంది. సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ కోటా పేరుతో వసూలు చేస్తున్న ఫీజులు... సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు అందనంత ఎత్తులో ఉన్నాయి. అగ్రికల్చర్‌

జయశంకర్‌ అగ్రి వర్సిటీలో ఫీజుల మోత!

సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ కోటా పేరుతో వీరబాదుడు

అగ్రికల్చర్‌ బీఎస్సీ సీటు ఖరీదు రూ. 14 లక్షలు

బీఎస్సీ హార్టికల్చర్‌  సీటుకైతే రూ. 9 లక్షల ఫీజు

తగ్గించాలని విద్యార్థులు, తల్లిదండ్రుల విజ్ఞప్తులు

పట్టించుకోని యూనివర్సిటీ, రాష్ట్ర ప్రభుత్వం


హైదరాబాద్‌, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఆచార్య జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఫీజుల మోత మోగుతోంది. సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ కోటా పేరుతో వసూలు చేస్తున్న ఫీజులు... సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు అందనంత ఎత్తులో ఉన్నాయి. అగ్రికల్చర్‌ బీఎస్సీ సీటుకు రూ. 14 లక్షలు, బీఎస్సీ- హార్టికల్చర్‌ సీటుకైతే రూ.9 లక్షల ఫీజును వసూలు చేస్తుండటంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మూడేళ్లుగా ఫీజులు తగ్గించాలని డిమాండ్‌ చేస్తున్నా వర్సిటీగానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ ఏమాత్రం స్పందించటం లేదు. వ్యవసాయ కోర్సులకు పెరిగిన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని జయశంకర్‌ వర్సిటీ మూడేళ్ల కిత్రం ‘సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ కోటా’ను ఏర్పాటు చేసింది. బీఎస్సీ(హానర్స్‌) అగ్రికల్చర్‌, బీఎస్సీ(హానర్స్‌) కమ్యూనిటీ సైన్స్‌ కోర్సులకు రూ. 14 లక్షలు వసూలు చేస్తోంది. హాస్టల్‌ ఫీజు, మెస్‌ చార్జీలు అదనం. దీంతోపాటు వర్సిటీ ఫీజు రూ. 39 వేలు చెల్లించటం కూడా తప్పనిసరి చేశారు. పైగా అడ్మిషన్‌ సమయంలోనే రూ. 10.11 లక్షలు ఏకకాలంలో వసూలు చేస్తున్నారు. బీఎస్సీ(హానర్స్‌) హార్టికల్చర్‌ సీటుకు రూ.9 లక్షల చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ కోర్సుకు కూడా ఏకకాలంలో అడ్మిషన్‌ సమయంలో రూ. 5.50 లక్షలు వసూలు చేస్తున్నారు. ఈ ఫీజులను చూసి విద్యార్థులు, తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు.


ఇంజనీరింగ్‌ సీటు మేనేజ్‌మెంట్‌ కోటాలో పొందాలంటే అధికారికంగా రూ.1.75 లక్షలకు మించి లేదు. బీఎస్సీ అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌ కోర్సులకు డిమాండ్‌ ఉన్నా.. ఒక ప్రభుత్వ వర్సిటీలో రూ.9 లక్షల నుంచి 14 లక్షల ఫీజు వసూలు చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంసెట్‌ ర్యాంకు ఆధారంగా విద్యార్థులు పొందే సీట్లకైతే... బీఎస్సీ (హానర్స్‌) అగ్రికల్చర్‌, కమ్యూనిటీ సైన్స్‌ కోర్సులకు రూ. 39 వేలు ఫీజు ఉంది. బీవీఎస్సీ(యానిమల్‌ హస్బెండ్రీ)కి రూ. 55,800 ఫీజు ఉంది. బీఎ్‌ఫఎస్సీ కోర్సుకు రూ. 43,290, బీఎస్సీ హార్టికల్చర్‌ సీటుకైతే రూ. 47,090 మాత్రమే ఫీజు ఉంది. కానీ సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ కోటా వరకు వచ్చేసరికి లక్షలకు లక్షలు వసూలు చేస్తుండటంపై విమర్శలు వస్తున్నాయి. 


ఈసారీ అవే ఫీజులు 

ఫీజుల మోతపై గతంలో విద్యార్థులు, తల్లిదండ్రులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఫిర్యాదులు చేశారు. దీనిపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని కేంద్ర ఉన్నత విద్యాశాఖ... రాష్ట్ర ఉన్నత విద్యామండలికి ఆదేశాలు జారీచేసింది. కానీ ఇంతవరకు ఎలాంటి విచారణ చేపట్టలేదు. కాగా, ఈ విద్యాసంవత్సరం కూడా అదే తరహాలో ఫీజులు వసూలుచేస్తామని ఆచార్య జయశంకర్‌ వర్సిటీ జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది. 

Updated Date - 2022-09-27T21:34:12+05:30 IST