FEMA, PMLA cases: ఆ మూడేళ్లతో పోల్చితే ఈ మూడేళ్ళలో భారీ పెరుగుదల

ABN , First Publish Date - 2022-07-26T20:44:28+05:30 IST

భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని ఎన్డీయే (NDA) పరిపాలన కాలంలో నమోదైన

FEMA, PMLA cases: ఆ మూడేళ్లతో పోల్చితే ఈ మూడేళ్ళలో భారీ పెరుగుదల

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని ఎన్డీయే (NDA) పరిపాలన కాలంలో నమోదైన FEMA, PMLA కేసుల సంఖ్య భారీగా కనిపిస్తోంది. 2014-15 నుంచి 2016-17 వరకు నమోదైన కేసులకు దాదాపు మూడు రెట్ల కేసులు 2019-20 నుంచి 2021-22 వరకు నమోదయ్యాయి. జేడీయూ ఎంపీ రాజీవ్ రంజన్ వురపు లలన్ సింగ్ అడిగిన ప్రశ్నపై స్పందిస్తూ ప్రభుత్వం పార్లమెంటుకు ఈ వివరాలను తెలిపింది.


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 2014లో అధికారం చేపట్టింది. వరుసగా రెండోసారి 2019లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభకు సోమవారం లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో తెలిపిన వివరాల ప్రకారం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ-Enforcement Directorate) విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం, 1999 (FEMA), మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 (PMLA)ల ప్రకారం 2014-15 నుంచి 2016-17 వరకు 4,913 కేసులను నమోదు చేసింది. 2019-20 నుంచి 2021-22 వరకు 14,143 కేసులను నమోదు చేసింది. అంటే 187 శాతం పెరుగుదల కనిపించింది. 


2019-20 నుంచి 2021-22 వరకు 11,420 ఫెమా కేసులను దర్యాప్తునకు చేపట్టినట్లు పంకజ్ తెలిపారు. 2014-15 నుంచి 2016-17 వరకు 4,424 కేసులను దర్యాప్తునకు చేపట్టినట్లు తెలిపారు. పీఎంఎల్ఏ కేసులు 2014-15 నుంచి 2016-17 వరకు 489 కేసులు నమోదు కాగా, 2019-20 నుంచి 2021-22 వరకు 2,723 కేసులు నమోదయ్యాయని చెప్పారు. అంటే 456 శాతం పెరిగినట్లు వివరించారు. 


సంవత్సరాలవారీగా సమాచారాన్ని పరిశీలించినపుడు మోదీ ఎనిమిదేళ్ళ పదవీ కాలంలో 2021-22లో అత్యధిక సంఖ్యలో మనీలాండరింగ్, ఫెమా ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. 2020-21లో ఈడీ ఫెమా క్రింద 5,313 కేసులను, 2017-18లో 3,627 కేసులను  దాఖలు చేసింది.  2020-21లో 1,180 పీఎంఎల్ఏ  కేసులను దాఖలు చేసింది. 


గడచిన పదేళ్ళలో ఈడీ దాదాపు 24,893 కేసులను ఫెమా నిబంధనల ప్రకారం దర్యాప్తునకు చేపట్టింది. పీఎంఎల్ఏ క్రింద 3,985 కేసులను నమోదు చేసింది. వీటిలో 22,130 ఫెమా కేసులు, అదేవిధంగా 3,555 పీఎంఎల్ఏ కేసులు  గడచిన ఎనిమిదేళ్ళలో నమోదయ్యాయి. పీఎంఎల్ఏ చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి 2022 మార్చి 31 వరకు 5,422 కేసులు నమోదయ్యాయి. వీటిలో 65.66 శాతం కేసులు గడచిన ఎనిమిదేళ్ళలోనే నమోదయ్యాయి. 


పీఎంఎల్ఏ కేసుల దర్యాప్తులో భాగంగా రూ.1,04,702 కోట్లు (సుమారుగా) విలువైన ఆస్తులను అటాచ్‌మెంట్ చేసినట్లు పంకజ్ చెప్పారు. 992 కేసుల్లో ప్రాసిక్యూషన్ కంప్లయింట్లను దాఖలు చేసినట్లు, రూ.869.31 కోట్లు (సుమారుగా) విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు తెలిపారు. 23 మంది నిందితులపై నేరం రుజువైనట్లు చెప్పారు. 


అదేవిధంగా ఈడీ 2022 మార్చి 31 వరకు ఫెమా క్రింద 30,716 కేసులను నమోదు చేయగా, వీటిలో 72 శాతం కేసులు గడచిన ఎనిమిదేళ్ళలో నమోదయ్యాయన్నారు. 8,109 షోకాజ్ నోటీసులను జారీ చేసినట్లు, 6,472 షోకాజ్ నోటీసులపై నిర్ణయం తీసుకున్నట్లు, తద్వారా దాదాపు రూ.8,130 కోట్లు పెనాల్టీ విధించినట్లు తెలిపారు. ఫెమా నిబంధనల ప్రకారం దాదాపు రూ.7,080 కోట్లు విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు తెలిపారు. 


Updated Date - 2022-07-26T20:44:28+05:30 IST