కరోనా వ్యాక్సిన్ తీసుకోవద్దని నా శివయ్య ఆదేశించాడంటూ.. నడిరోడ్డుపై రచ్చ రచ్చ చేసిన వృద్ధురాలు

ABN , First Publish Date - 2021-09-29T11:43:36+05:30 IST

దేశంలో కరోనా వ్యాక్సిన్‌పై అనేక అపోహలు నెలకొన్నాయి.

కరోనా వ్యాక్సిన్ తీసుకోవద్దని నా శివయ్య ఆదేశించాడంటూ.. నడిరోడ్డుపై రచ్చ రచ్చ చేసిన వృద్ధురాలు

దేశంలో కరోనా వ్యాక్సిన్‌పై అనేక అపోహలు నెలకొన్నాయి. దీనిపై నిపుణులు ఎంతగా అవగాహన కలిగిస్తున్నప్పటికీ ఇంకా చాలామంది టీకా తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. మధ్యప్రదేశ్‌లోని బైతూల్‌లో ఇటువంటి ఘటనే చొటుచేసుకుంది. వ్యాక్సిన్ వేయించుకోకుండా ఉండేందుకు ఒక మహిళ విచిత్రమైన నెపం చెప్పింది. దీంతో ఆమెకు నచ్చజెప్పేందుకు వైద్యబృందమంతా ఆలయానికి తరలివచ్చింది. వారిని చూసిన ఆ మహిళ మహాశివుని విగ్రహం తలపై చేయిపెట్టి... ‘నా శివయ్య ఇంజక్షన్ వేయించుకోవద్దని ఆదేశించాడు. అందుకే నేను వ్యాక్సిన్ వేయించుకోను’ అని చెప్పింది.


అయితే అక్కడకు వచ్చిన వైద్యబృందం ఆమెకు మరోమారు వ్యాక్సన్‌పై అవగాహన కలిగించే ప్రయత్నం చేసింది. అయితే ఆ మహిళ వారి కాళ్లపై పడిపోయి వ్యాక్సన్ వద్దని వేడుకుంది. తరువాత ఆమె తనపైకి అమ్మవారు వచ్చినట్లు నాటకం ఆడటం ప్రారంభించింది. ఆ మహిళకు ఎంతగా నచ్చజెప్పినప్పటికీ ఫలితం లేకపోవడంతో వారు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈ ఉదంతం ఆఠ్నెర్ గ్రామ పంచాయతీ పరిధిలోని నథ్యూఢానా గ్రామంలో చోటుచేసుకుంది. 


జిల్లా అధికారులు బైతూల్‌లో వ్యాక్సిన్ తొలిడోసును వందశాతం పూర్తిచేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు. దీనిలో భాగంగా పలువురు అధికారుల సారధ్యంలో మొబైల్ టీమ్‌లు ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ వేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే కొంతమంది వ్యాక్సిన్ వేయించుకునేందుకు ముందుకురావడం లేదు. ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లోని ప్రజలు వ్యాక్సిన్ వేయించుకునేందుకు నిరాకరిస్తున్నారు. దీంతో అధికారులు ఇటువంటివారికి వ్యాక్సిన్ వేసేందుకు నానా అవస్థలు పడుతున్నారు.

Updated Date - 2021-09-29T11:43:36+05:30 IST