మహిళా రథసారథులు

ABN , First Publish Date - 2021-03-08T06:19:37+05:30 IST

చిరునవ్వులతో చుక్‌ చుక్‌ రైలును పరిగెత్తించే బిటెక్‌ అమ్మాయిలు వాళ్లు! ఎంచుకున్న వృత్తి భిన్నమైనది, అరుదైనదైనా బెరకు దరిచేరనివ్వని మెరుపు రవ్వలు వాళ్లు! ఏకంగా లక్ష కిలోమీటర్లకు పైగా రైళ్లను నడిపి, మహిళా శక్తిని చాటుతున్న మెట్రో మహిళా రథ సారథులు వాళ్లు! మహిళా దినోత్సవం సందర్భంగా...

మహిళా రథసారథులు

చిరునవ్వులతో చుక్‌ చుక్‌  రైలును పరిగెత్తించే బిటెక్‌ అమ్మాయిలు వాళ్లు! ఎంచుకున్న వృత్తి భిన్నమైనది, అరుదైనదైనా బెరకు దరిచేరనివ్వని మెరుపు రవ్వలు వాళ్లు! ఏకంగా లక్ష కిలోమీటర్లకు పైగా రైళ్లను నడిపి, మహిళా శక్తిని చాటుతున్న మెట్రో మహిళా రథ సారథులు వాళ్లు! మహిళా దినోత్సవం సందర్భంగా హుషారైన ఆ మెట్రో లోకో పైలట్లను నవ్య కలిసింది!


  • నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం


2017లో

ప్రారంభమైన మెట్రో రైళ్ల సేవల్లో మొత్తం 250 మంది మెట్రో లోకో పైలట్లు ఉన్నారు. వారిలో 34 మంది మహిళలే! బస్సు, ఆటో, క్యాబ్‌, విమానం... ప్రజా రవాణా వ్యవస్థ సారథులుగా పురుషులకు ఏమాత్రం తీసిపోని మహిళా డ్రైవర్ల గురించి విన్నాం. కానీ ట్రైన్‌ ఇందుకు భిన్నం. వందల సంఖ్యలో ప్రయాణీకులు, నిరంతరంగా ట్రైన్‌ను నడుపుతూ వారిని గమ్యస్థానాలకు చేర్చవలసిన డ్రైవింగ్‌ వృత్తి. ఇది అంత సులువైన విషయం కాదు. అయినా ఆ బాధ్యతనూ ఎంతో సునాయాసంగా సాధ్యం చేసి చూపించారు మహిళా మెట్రో లోకో పైలట్లు. 

గత నాలుగేళ్లుగా భాగ్యనగరమంతా మెట్రో రైళ్లను నిరంతరంగా పరుగులు పెట్టిస్తూ సత్తా చాటుతున్న ఈ పైలట్లందరూ ఇంజనీరింగ్‌ పట్టభద్రులే! బిటెక్‌ డిగ్రీతో ఉద్యోగ ప్రయత్నంలో ఉండగా స్నేహితులు, బంధువుల ద్వారా మెట్రో లోకో పైలట్‌ ఉద్యోగ ఖాళీల గురించి తెలుసుకుని దరఖాస్తు చేసుకున్న వారు కొందరైతే, నోటిఫికేషన్‌ చూసి అప్లై చేసిన వారు మరికొందరు. ఈ ఉద్యోగానికి కుటుంబసభ్యుల మద్దతు కొందరు దక్కించుకోగలిగితే, అన్యమనస్కంగానే అంగీకారం పొందిన పరిస్థితి మరికొందరిది. ఏదేమైనప్పటికీ పూర్తిగా భిన్నమైన వృత్తిలో మొదటిసారి అడుగు పెట్టినప్పటికీ, ట్రైన్‌ డ్రైవింగ్‌ మీద పట్టు సాధించి అందరి మెప్పు పొందగలిగారు. వారితో మాటలు కలిపితే మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. రైల్వే కెరీర్‌లో ఉద్వేగానికి లోనైన క్షణాలు, ఆనందంతో గంతులేసిన ఘడియల గురించి ఆ మహిళా లోకో పైలట్లు ఇలా చెప్పుకొచ్చారు.





ఎంపిక క్లిష్టమే!   

లోకో పైలట్‌ ఉద్యోగం సాధించడం అంత తేలికైన విషయం కాదు. సైకోమెట్రిక్‌ పరీక్షలు, రీసెర్చి డిజైన్లు, స్టాండర్డ్‌ ఆర్గనైజేషన్‌ పరీక్షలు, సాంకేతిక పరిజ్ఞానం, చివరిగా ఇంటర్వ్యూ, ఆ తర్వాత వైద్య పరీక్షలు.... ఇలా దశల వారీగా అభ్యర్థుల ఎంపిక సాగుతుంది. ఈ పరీక్షల్లో రీజనింగ్‌, ఆప్టిట్యూడ్‌, కోర్‌ సబ్జెక్ట్‌, ఆర్‌డిఎస్‌ఒ పరీక్షలు... ఈ క్రమంలో అభ్యర్థులను జల్లెడ పడతారు. చివరిగా జరిపే వైద్య పరీక్షల్లో దృష్టి లోపాలు, శరీర దారుఢ్యం, ఇతరత్రా ఆరోగ్య పరిస్థితులను పరీక్షిస్తారు. బిటెక్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన నేను, అప్పటికే మెట్రోలో పనిచేస్తున్న వారి ద్వారా రిక్రూట్‌మెంట్‌ గురించి తెలుసుకుని అప్లై చేశాను. ఈ ఉద్యోగానికి అప్లై చేసినప్పుడు ఎంపిక ఇంత క్లిష్టంగా సాగుతుందని ఊహించలేదు. పైగా వేల సంఖ్యలో అందే దరఖాస్తుల్లో నా దరఖాస్తును పరిశీలించి, పిలుస్తారా? అనే సంశయంతో ఉండేదాన్ని. అయితే చివరకు నా దరఖాస్తు ఎంపికై మెట్రో నుంచి పిలుపొచ్చింది. ఒక్కో దశ దాటుకుంటూ ఇంటర్వ్యూ దశకు చేరుకున్నప్పుడు ఈ ఉద్యోగం సాధించగలననే నమ్మకం కలిగింది. స్వతహాగా టు వీలర్‌, ఫోర్‌ వీలర్‌ డ్రైవింగ్‌ మీద ఆసక్తి ఉండడంతో ట్రైన్‌ డ్రైవింగ్‌ పట్ల కూడా ఉత్సాహం, ఆసక్తి కలిగింది. ఇంతకాలంగా మెట్రో ట్రైన్‌ నడుపుతున్నా ఒక్క క్షణం కూడా విసుగుకు లోనయింది లేదు. ప్రతి ప్రయాణం కొత్త ఉత్సాహాన్ని అందిస్తూ ఉంటుంది. 

- సరిత బాలసాని, కరీంనగర్‌.





డ్రైవింగ్‌తో పాటు బోలెడు బాధ్యతలు!

కాలేజి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ ద్వారా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడం, దశలవారీ పరీక్షల్లో పాసై లోకో పైలట్‌గా ఎంపికవడం జరిగింది. లోకో పైలట్‌గా ట్రైన్‌ నడపడంతోనే మా బాధ్యత తీరిపోదు. అదనపు బాధ్యతలు కూడా బోలెడన్ని ఉంటాయి. ట్రైన్‌ స్టేషన్‌లో ఆగినప్పుడు తలుపులు తెరుచుకుని, మూసుకునే సమయంలో ప్రయాణీకులు అప్రమత్తంగా ఉంటున్నారో, లేదో గమనించుకోవాలి. తలుపులు మూసుకునే క్రమంలో ఎవరికైనా తాకితే, బలమైన దెబ్బలు తగిలే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అనౌన్స్‌మెంట్స్‌ ఇస్తూ, సిసి కెమెరాల ద్వారా గమనించుకుంటూ ఉండాలి. స్టేషన్‌ నుంచి రైలును కదిలించే ప్రతిసారీ ప్రయాణికులు అందరూ ఎక్కారా? లేక ఎవరైనా పిల్లలు కుటుంబంతో కలిసి రైలెక్కడం ఆలస్యమె,ౖ ప్లాట్‌ఫాం మీదే ఉండిపోయారా? అనేది గమనించుకుంటూ ఉండాలి. కొన్నిసార్లు పిల్లలు స్టేషన్‌లో తప్పిపోతూ ఉంటారు. ఆ విషయాలు కూడా చూసుకోవాలి. మెట్రో మొదలైన రోజుల్లో, కరోనా లాక్‌డౌన్‌ ప్రారంభంలో విపరీతమైన ప్రయాణీకుల రద్దీ ఉండేది. ఆ సమయాల్లో ప్రయాణికులను కంట్రోల్‌ చేయడానికి చాలా కష్టపడ్డాం. ట్రైన్‌ ఎక్కే సమయంలో, దిగే సమయంలో ఎలాంటి ప్రమాదం జరగకుండా చూసుకోవడంలో ఎంతో ఒత్తిడిని ఎదుర్కొన్నాం. ట్రైన్‌ నడపడంతో పాటు ప్యాసింజర్లకు సంబంధించిన అనౌన్స్‌మెంట్లు, అడ్వర్‌టైజ్‌మెంట్లు, భద్రతకు సంబంధించిన అనౌన్స్‌మెంట్లను ఇచ్చే పనులు కూడా మాకు ఉంటాయి. ఓ పక్క రైలు నడుపుతూనే, ఇవన్నీ నిరంతరంగా కొనసాగిస్తూ ఉండాలి. అలాగే ప్యాసింజర్లు కొందరు ఏసి తగ్గించమంటారు. మరికొందరు ట్రైన్‌లో శుభ్రత తగ్గిందని ఫిర్యాదు చేస్తూ ఉంటారు. ఇవన్నీ మేమే చూసుకోవాలి.

- శుశ్రుత గోవు, హైదరాబాద్‌.





కఠోర శిక్షణతో ...

ఇంజనీరింగ్‌ చదివిన వాళ్లందరూ ఇంజనీర్లుగానే స్థిరపడాలనే నియమమేమీ లేదు. రొటీన్‌కు భిన్నమైన ఉద్యోగాలను ఎంచుకోవడంలో వెనకాడకూడదు. రొటీన్‌కు భిన్నమైన ఉద్యోగాలు ఎంతమంది సాధించగలరు? నా మటుకు నాకు ఈ వృత్తి ఎంతో సంతృప్తినిస్తోంది. మా కుటుంబసభ్యుల ప్రోత్సాహం కూడా ఉంది. 2017 జూన్‌లో ఈ ఉద్యోగానికి ఎంపికయ్యాను. అక్టోబరులో శిక్షణ మొదలైంది. మూడు నెలల పాటు ఉప్పల్‌ డిపోలో సాగిన ఈ శిక్షణలో ట్రైన్‌ నడపడంతో పాటు సాంకేతిపరమైన ఎన్నో అంశాల మీద పట్టు పెంచుకున్నాను. ట్రైన్‌ నడపడంలో మెలకువలతో పాటు, సవాళ్లు, వాటిని చాకచక్యంగా అధిగమించే నైపుణ్యాలను నేర్చుకున్నాను. ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు ఆ పరిస్థితిని ఎలా అదుపులోకి తెచ్చుకోవాలి? ఆందోళన, ఒత్తిడికి లోను కాకుండా ఆ సమయంలో ఎలా స్పందించాలి? అనే విషయాల పట్ల అవగాహన ఏర్పడేలా పూర్తి శిక్షణ కొనసాగింది. థియరీలో ఊహించని ప్రమాదాల గురించి నేర్పించడమే కాకుండా, ప్రాక్టికల్‌గా కూడా అలాంటి పరిస్థితిని సృష్టించి, మమ్మల్ని మానసికంగా మెట్రో డ్రైవింగ్‌లో ఎదురయ్యే సవాళ్లన్నింటికీ సిద్ధం చేశారు. రైలు నడుస్తూ ఉండగా ప్రయాణీకులకు ఏదైనా వైద్యపరమైన అత్యవసర స్థితి తలెత్తితే ఎలా స్పందించాలో కూడా నేర్చుకున్నాం. ఎలాంటి విపత్తు ఎదురైనా తొణకకుండా, మానసిక సంతులనం కోల్పోకుండా ఎలా నడుచుకోవాలో కూడా ఈ శిక్షణలో నేర్చుకున్నాం. 

- అవని సాగినేని, భద్రాద్రి కొత్తగూడెం.






శిక్షణతో ఆత్మవిశ్వాసం పెరిగింది!

స్నేహితుల ద్వారా ఈ ఉద్యోగం గురించి తెలుసుకుని అప్లై చేశాను. మొదట్లో ఒకే పరీక్షతో ఎంపిక సాగుతుందనే అభిప్రాయంలో ఉండేదాన్ని. అది క్వాలిఫై అయ్యాక, ఇంటర్వ్యూ ఉంటుందేమో అనుకుంటే సైకోమెట్రిక్‌, ఆర్‌డిఎస్‌ఒ, మెడికల్‌ టెస్ట్‌.... ఇలా వరుసగా పరీక్షలు ఉండడంతో ఇవన్నీ నెగ్గగలనా? అనే సంశయంలో పడిపోయాను. అయితే ఒక్కో పరీక్ష నెగ్గేకొద్దీ ఆత్మవిశ్వాసం పెరిగింది. ఎంపికకు సంబంధించిన కమ్యూనికేషన్‌ మొత్తం మెయిల్‌ ద్వారానే సాగింది. దాంతో మెయిల్‌ ఎప్పుడొస్తుందా అని ఎంతో ఆతృతతో ఎదురుచూసేదాన్ని. ఉద్యోగంలో చేరమని చివరి మెయిల్‌ వచ్చిన రోజు ఎంతో సంతోషం కలిగింది. ‘హమ్మయ్య... ఇదే ఆఖరి పరీక్ష అన్నమాట!’ అని హాయిగా ఊపిరి పీల్చుకున్నాను. తర్వాత కఠోర శిక్షణ సాగింది. శిక్షణలో భాగంగా ఖాళీ రైళ్లను డిపోలో నడిపాం. ఆ తర్వాత మెట్రో పట్టాలపైనా పరిగెత్తించాం. నెలల తరబడి ఒంటరిగా ట్రైన్‌ నడిపే శిక్షణ సాగింది కాబట్టి ప్రయాణీకులతో నడిపేటప్పుడు కొత్తగా అనిపించలేదు. ఎంతో ఆత్మవిశ్వాసంతో నడిపాను. లోకో పైలట్‌గా మాకు ఎనిమిది గంటల షిఫ్ట్‌లు ఉంటాయి. అన్నీ పగటి వేళే ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం రెండు వరకూ లేదా ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం మూడు వరకూ సాగుతాయి. ఇంటి దగ్గర నుంచే పైలట్‌ యూనిఫాంలో బయల్దేరతాను. ఒకరోజు ముందుగా మాకు డ్యూటీ రోస్టర్‌ వేస్తారు. డ్యూటీలు రోజూ మారుతూ ఉంటాయి. ప్రతి జర్నీ తర్వాత 15 నుంచి 25 నిమిషాల బ్రేక్‌ ఉంటుంది. మియాపూర్‌, ఉప్పల్‌, అమీర్‌పేట, ఎమ్‌జిబిఎస్‌... ఇలా కేటాయించిన స్టేషన్‌కు సమయానికి చేరుకుని, ఆయా స్టేషన్ల మధ్య ట్రైన్‌ నడపడమే మా డ్యూటీ. 

- దివ్యతేజ గడ్డం, మహబూబ్‌నగర్‌.






మహిళల కోసం ప్రత్యేకం!

మహిళా సంఘాలతో సదస్సులను నిర్వహించి, సమస్యలపై చర్చించి, వారి సూచనలకు అనుగుణంగా స్టేషన్లు నిర్మించాం. మెట్రో రైలు సహా, స్టేషన్లలో ప్రతి అంగుళాన్ని నిఘా పరిధిలోకి తీసుకొచ్చాం. మధురానగర్‌ స్టేషన్‌కు ‘తరుణి’ అని పేరు పెట్టి మహిళలకు అంకితమిచ్చాం. మహిళలకు శిక్షణనిచ్చి, లోకో పైలెట్లుగా తీర్చిదిద్దాం. మహిళల సాధికారత కోసం ఎప్పుడూ కృషి చేస్తుంటాం.

- ఎన్వీయస్‌ రెడ్డి, ఎండి, హైదరాబాద్‌ మెట్రో రైల్‌



- గోగుమళ్ల కవిత,  ఫొటోలు: లవకుమార్‌

Updated Date - 2021-03-08T06:19:37+05:30 IST