గ్రూప్‌-1లో మహిళా సత్తా

Published: Wed, 06 Jul 2022 02:52:15 ISTfb-iconwhatsapp-icontwitter-icon
గ్రూప్‌-1లో మహిళా సత్తా

టాప్‌ 10లో ఏడుగురు వారే

హైదరాబాద్‌ వాసికి 3వ ర్యాంకు

167 పోస్టులకు 163 మంది ఎంపిక

కోర్టు తుది ఆదేశాలకు లోబడి 

ఉండాలని అభ్యర్థుల నుంచి అండర్‌టేకింగ్‌

రీవాల్యుయేషన్‌ చేస్తే తేడా ఖాయం

మార్కులు వెల్లడించకుండానే ర్యాంకులు

వచ్చే నెలలో మళ్లీ గ్రూప్స్‌ నోటిఫికేషన్లు

ఇంటర్వ్యూలపై నిర్ణయం తీసుకోలేదు

ఏపీపీఎస్సీ చైర్మన్‌ సవాంగ్‌ వెల్లడి


అమరావతి, జూలై 5(ఆంధ్రజ్యోతి): 2018 గ్రూప్‌-1 నోటిఫికేషన్‌కు సంబంధించిన తుది ఫలితాలను ఏపీపీఎస్సీ మంగళవారం ప్రకటించింది. మొత్తం 167 పోస్టులకుగాను 163 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు వెల్లడించింది. రెండు పోస్టులు క్రీడల విభాగంలో, రెండు పోస్టులు ట్రెజరీ విభాగంలో మిగిలిపోయినట్లు తెలిపింది. ఈ ఫలితాల్లో మహిళలు సత్తా చాటారని, టాప్‌ 10లో ఏడుగురు మహిళా అభ్యర్థులేనని పేర్కొంది. కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణానికి చెందిన డాక్టర్‌ రాణి సుస్మిత ఫస్ట్‌ ర్యాంకు సాధించగా, అన్నమయ్య జిల్లా రాయచోటి ప్రాంతానికి చెందిన కొండూరు శ్రీనివాసరాజు రెండో ర్యాంకును, హైదరాబాద్‌ వాసి, కందుకూరు కోడలు.. సంజనా సింహ మూడో ర్యాంకును సొంతం చేసుకున్నారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ చైర్మన్‌ గౌతం సవాంగ్‌ మంగళవారం వివరించారు. పలు కారణాలతో గ్రూప్‌1 నోటిఫికేషన్‌ 2018 ప్రక్రియ నాలుగేళ్లుగా వాయిదా పడుతూ వస్తోందన్నారు. 325 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారని, వారిలో 169 మంది మహిళలు, 156 మంది పురుషులు ఉన్నారని చెప్పారు.


తొలుత డిజిటల్‌ విధానంలో మూల్యాంకనం జరిగిందని, ఈ అంశం కోర్టు పరిధిలోకి వెళ్లడంతో, కోర్టు ఆదేశాలతో మాన్యువల్‌ విధానంలో రీవాల్యుయేషన్‌ చేశామన్నారు. ఎక్కడా రీవాల్యుయేషన్‌ అనేది ఉండదని, ఒకసారి వాల్యుయేషన్‌ చేసిన పేపర్‌ను, మరొకరు చేస్తే ఎంతో కొంత మార్కుల్లో వ్యత్యాసం వస్తుందన్నారు. డిజిటల్‌కు, మాన్యువల్‌కు కూడా ఈ తేడానే వచ్చిందని పేర్కొన్నారు. మొత్తం వాల్యుయేషన్‌, ఇంటర్వ్యూల ప్రక్రియను పారదర్శకంగా పూర్తిచేసినట్లు చెప్పారు. కాగా, ఎంపికైన అభ్యర్థులు కోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటామని ఈ నెల 12లోగా అండర్‌టేకింగ్‌ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఆయా శాఖలకు పంపిస్తామన్నారు. ఎంపికైన వారిలో టాప్‌10లో ఏడుగురు మహిళలు ఉన్నారని చెప్పారు. ఇంటర్వ్యూలకు మార్కులు లేవని, గ్రేడ్లు ఇచ్చామని సవాంగ్‌ వివరించారు.


మళ్లీ నోటిఫికేషన్లు

ఇప్పటికే ఇచ్చిన 13 నోటిఫికేషన్లకు సంబంధించి భర్తీ ప్రక్రియ చేపట్టనున్నట్టు సవాంగ్‌ తెలిపారు. దేవదాయ ఈవో, రెవెన్యూ జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల పరీక్షలకు 5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. వచ్చే నెలలో 110 గ్రూప్‌ 1, 182 గ్రూప్‌2 పోస్టులకు నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. మిగతా నోటిఫికేషన్లు కూడా వీలైనంత త్వరగా విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఇకపై నిర్వహించే భర్తీ ప్రక్రియలో ఇంటర్వ్యూలు ఉంటాయా? ఉండవా? అనే విషయంపై నిర్ణయం తీసుకోలేదని, దీనిపై అధ్యయనం చేస్తున్నామని వివరించారు. సిలబ్‌సలో చిన్నపాటి మార్పులు ఉంటాయన్నారు.


182 మంది బీటెక్‌ చదివినవారే

గ్రూప్‌1 ఇంటర్వ్యూలకు వచ్చిన వారిలో బీటెక్‌, బీఈ చదివిన వారే అత్యధికంగా ఉన్నారని ఏపీపీఎస్సీ చైర్మన్‌ సవాంగ్‌ తెలిపారు. మొత్తం 325 మంది ఇంటర్వ్యూలకు ఎంపికైతే వారిలో ఐదుగురు హాజరుకాలేదని పేర్కొన్నారు. మిగిలిన వారిలో 182 మంది బీటెక్‌ లేదా బీఈ విద్యార్హత కలిగినవారున్నారని తెలిపారు. ఐఐటీ చదివిన వారు 12 మంది, ఐఐఎం ఏడుగురు, ఎన్‌ఐటీ 10 మంది, ట్రిపుల్‌ ఐటీ చదివిన వారు ముగ్గురు ఉన్నారని పేర్కొన్నారు. వృత్తి, పోటీ పరీక్షల పరంగా చూస్తే సివిల్స్‌ ర్యాంకర్లు 9 మంది, యూపీఎస్సీ ఇంటర్వ్యూకు వెళ్లినవారు 23 మంది, యూపీఎస్సీ మెయిన్స్‌ రాసినవారు 19 మంది, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 102 మంది, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 36 మంది, బ్యాంకు ఉద్యోగులు 12 మంది ఉన్నారన్నారు.


మార్కులు గోప్యం

ఎంపికైన వారికి ఎన్ని మార్కులు వచ్చాయనే వివరాలను ఏపీపీఎస్సీ వెల్లడించలేదు. ప్రిలిమ్స్‌, మెయిన్స్‌, ఇంటర్వ్యూ అన్నీ కలిపి ఎన్ని మార్కులు సాధించారు అనే వివరాలు ఇవ్వాల్సి ఉండగా ఏపీపీఎస్సీ వాటిని గోప్యంగా ఉంచింది. ముఖ్యంగా ఇంటర్వ్యూ బోర్డుల్లో అత్యధికంగా తెలుగేతర వ్యక్తులు ఉండటం వల్ల తెలుగు మీడియం అభ్యర్థులు ఎక్కువగా నష్టపోయారనే విమర్శలున్నాయి. మీడియం వారీగా ఏ కేటగిరీలో ఎంతమంది ఎంపికయ్యారనే వివరాలను కూడా ఏపీపీఎస్సీ పేర్కొనలేదు. ఈ వివరాలను వెల్లడించకపోవడంపై అభ్యర్థుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గ్రూప్‌-1లో మహిళా సత్తా

కోచింగ్‌ లేకుండానే.. ఫస్ట్‌ ర్యాంక్‌!

పిఠాపురం: ‘‘ఎక్కడా కోచింగ్‌ తీసుకోలేదు. సొంతంగానే ప్రిపేరయ్యా. చిన్నప్పటి నుంచి జనరల్‌ నాలెడ్జ్‌పై ఉన్న అవగాహన బాగా ఉపయోగపడింది. టాప్‌-5లో ఉంటానని అనుకున్నా. ఏకంగా ఫస్ట్‌ ర్యాంకు వచ్చింది’’ అని గ్రూప్‌-1లో టాపర్‌గా నిలిచిన కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణానికి చెందిన డాక్టర్‌ రాణి సుస్మిత చెప్పారు. ఏపీపీఎస్సీ ప్రకటించిన గ్రూప్‌-1 ఫలితాల్లో సుస్మిత మొదటిస్థానంలో నిలిచారు. 1 నుంచి 10వ తరగతి వరకు పిఠాపురం ప్రియదర్శిని స్కూల్లో చదవగా, ఇంటర్మీడియట్‌ కాకినాడ ఆదిత్య కళాశాలలో, పీజీ హైదరాబాదు సెంట్రల్‌ యూనివర్సిటీలో చదివారు. అక్కడ గోల్డ్‌మెడల్‌ సాధించారు. తమిళనాడులోని తిరుచానపల్లి ఎన్‌ఐటీలో హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌లో పీహెచ్‌డీ చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియాలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.  

గ్రూప్‌-1లో మహిళా సత్తా

రైతు కుమారుడికి రెండో ర్యాంక్‌

లక్కిరెడ్డిపల్లె: అష్టకష్టాలు పడి కొడుకును చదివించిన ఆ రైతు ఇంట పండుగ వాతావరణం నెలకొంది. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం, కోతలగుట్టపల్లె గ్రామానికి చెందిన కొండూరు రెడ్డెయ్యరాజు, తులసమ్మల కుమారుడు శ్రీనివాసరాజు గ్రూప్‌ 1 ఫలితాల్లో రెండో ర్యాంకు సాధించారు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన శ్రీనివాసరాజు డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యారు. ఈయన 1 నుంచి 7వ తరగతి వరకు తన సొంత గ్రామంలో చదివి 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు రాయచోటిలో చదివారు. డిగ్రీ కడపలో, ఎంసీఏ తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో చదివారు. ఢిల్లీలో కోచింగ్‌ తీసుకుని గ్రూప్‌-1లో రెండో ర్యాంకు సాధించారు. 

గ్రూప్‌-1లో మహిళా సత్తా

సివిల్స్‌లో 37.. గ్రూప్స్‌లో 3

కందుకూరు: ఇటీవల సివిల్స్‌లో 37వ ర్యాంకు సాధించి ఐఏఎ్‌సకు ఎంపికైన కందుకూరు కోడలు వి. సంజనా సింహ గ్రూప్‌-1 ఫలితాల్లోనూ సత్తా చాటారు. ఈ ఫలితాల్లో సంజనా సింహ  3వ ర్యాంకు సాధించారు. 

హైదరాబాద్‌ వాసి అయిన సంజనా సింహ కందుకూరుకి చెందిన మన్నవ శ్రీహర్షను వివాహం చేసుకున్నారు. సివిల్స్‌లో 37వ ర్యాంకు సాధించినప్పటికీ.. గ్రూప్‌-1లో కూడా తన సామర్థ్యాన్ని నిరూపించాలన్న పట్టుదలతో ఈ పరీక్షలకు హాజరైనట్టు సంజన తెలిపారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.