జిల్లా ఆస్పత్రిలో ‘కాన్పు’ కష్టాలు

Sep 20 2021 @ 03:33AM
ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రి

పీడిస్తున్న గైనకాలజిస్టుల కొరత

కాన్పు కోసం వస్తే రెఫర్‌ చేస్తున్నారు

విధిలేని పరిస్థితిలో ప్రైవేట్‌ ఆస్పత్రులకు పరుగులు

ప్రొద్దుటూరు, సెప్టెంబరు 19: ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పు సురక్షితం. ఒక్క పైసా ఖర్చు లేకుండా పేదలు ప్రభుత్వాసుపత్రుల్లోనే కాన్పులు చేయించుకోవాలని ప్రభుత్వం ప్రకటనలు చేస్తుంటే అందుకు భిన్నంగా ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో పరిస్థితులు నెలకొన్నా యి. అత్యవసర పరిస్థితుల్లో పురుటి నొప్పులతో గర్భిణులు కాన్పు కోసం జిల్లా ఆస్పత్రికి వస్తే, గైనకాలజిస్టులు అందుబాటులో లేక వేరే ఆస్పత్రులకు రెఫర్‌ చేస్తున్నారు. దీంతో  విధిలేని పరిస్థితుల్లో ప్రైవేట్‌ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. అక్కడ కాన్పు కోసం వేలకు వేలు ఖర్చు చేస్తున్నారు. దీనికి కారణం గైనకాలజిస్టుల కొరతే. గైనకాలజిస్టులను నియమించి పేదలకు కాన్పు కష్టాలు లేకుండా చూడాలని ఇక్కడి ప్రజలు పాలక పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నారు. 


- ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రి స్థాయికి ఇక్కడి కాన్పుల విభాగంలో ఐదుగురు స్త్రీ సంబంధిత వైద్య నిపుణులు ఉండాలి. అయితే ప్రస్తుతం ఒక్కరే కాన్పుల విభాగంలో వైద్యసేవలు అందిస్తున్నారు. ఈ విభాగంలో సివిల్‌ సర్జన్‌ ఒకరు, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జున్లు ముగ్గురు ఉండాలి. అలాగే జిల్లా ఆస్పత్రిలోని సీమాంక్‌ ఆస్పత్రిలో సివిల్‌ అసిస్టెంట్‌ ఉండాలి. అయితే సివిల్‌ సర్జన్‌తో పాటు సివిల్‌ ఆసిస్టెంట్‌ సర్జన్‌ ఒకరు సెలవుపై వెళ్లారు. మరో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ డిప్యూటేషన్‌పై వేరే ప్రాంతానికి వెళ్లారు. సీమాంక్‌లో పనిచేసే సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ రాజీనామా చేశారు. ఈ క్రమంలో కొన్ని నెలలుగా ఒక్క సివి ల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ మహిళా ఓపీతో పాటు కాన్పులు కూడా చేయాల్సి వస్తోంది. దీంతో గర్భిణులకు కాన్పు కష్టాలు తప్పట్లేదని ఇక్కడి వైద్య సిబ్బంది చెబుతున్నారు. 

- ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలోని మహిళా విభాగం ఓపీకి సరాసరి రోజుకు వంద మం ది రోగులు వస్తుంటారు. అదే విధంగా గతంలో కాన్పుల విభాగంలో నెలకు 300లకు పైగానే కాన్పులు జరిగేవి. అందులో సుమారు 80 దాకా శస్త్రచికిత్సల కాన్పులు జరిగేవి. అయితే ఐదు నెలలుగా గైనకాలజిస్టుల కొరత కారణంగా నెలకు కేవలం 150 వరకు మాత్రమే కాన్పులు జరుగుతున్నాయి. గడచిన నాలుగు నెలల గణాంకాలను పరిశీలిస్తే...

ఏప్రిల్‌ నెలలో 156 కాన్పులు జరుగగా, అందులో 86 సాధారణం, 70 ఆపరేషన్లు ఉన్నాయి. అదే విధంగా  మేలో 127 కాన్పులకు గానూ 86 సాధారణం, 41 ఆపరేషన్లు, జూన్‌లో 128కి గానూ 70 సాధారణం, 58 ఆపరేషన్లు, జూలైలో 156కు గానూ సాధారణం 96, ఆపరేషన్లు 60, ఆగస్టులో 158 కాన్పులు జరుగగా, అందులో 69 సాధారణం, 89 ఆపరేషన్లు ఉన్నాయి. 

- కాన్పుల కోసం రాత్రి వేళల్లో జిల్లా ఆస్పత్రికి వస్తే రెఫర్‌ చేయడం పరిపాటిగా మారిందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాన్పు నొప్పులు ఎప్పుడు వస్తాయో తెలియదు,  రాత్రివేళల్లో నొప్పులతో జిల్లా ఆస్పత్రికి వస్తే కనీసం చూసేవారు ఉండరని, ఏదో ఒకటి చెప్పి వేరే ఆస్పత్రులకు రెఫర్‌ చేస్తున్నారని వారి సంబంధీకులు చెబుతున్నారు. బీపీ ఎక్కువగా ఉంటే తగ్గించేందుకు ఇంజెక్షన్లు కూడా లేవని వాపోతున్నారు. ఏవేవో సాకులు చెప్పి వేరే ఆస్పత్రులకు పంపుతున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సం బంధిత ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గైనకాలజిస్టులను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. 


సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం.. 

- డాక్టర్‌ డేవిడ్‌ సెల్వరాజ్‌, ప్రొద్దుటూరు జిల్లాఆస్పత్రి మెడికల్‌ సూపరింటెండెంట్‌

జిల్లా ఆస్పత్రిలో గైనకాలజిస్టు ఒక్కరే ఉన్నారు. ఇంకా నలుగురు కావాల్సి ఉంది. గైనకాలజిస్టులు లేకనే కాన్పుల సంఖ్య తగ్గింది. ఉన్న ఒక్క వైద్యురాలితోనే నెలకు 150 కాన్పులు చేస్తున్నాం. గతంలో నెలకు 300కు పైగానే కాన్పులు జరిగేవి. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాను. గైనకాలజిస్టులను ఏర్పాటు చేస్తామని వారు చెబుతున్నారు. త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది.


కలెక్టర్‌ దృష్టి పెట్టాలి.. 

- పసుపులేటి శివకృష్ణ, ఏపీ మెడికల్‌ కాంట్రాక్టు ఎంప్లాయిస్‌ యూనియన్‌ నేత

ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో గైనకాలజిస్టుల కొరతతో కాన్పుల కోసం వచ్చే గర్భిణీలు ఇబ్బంది పడుతున్నారు. కాన్పు కోసం జిల్లా కేంద్రానికి, లేదా ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. వెంటనే గైనకాలజిస్టులను నియమించే దిశగా కలెక్టర్‌ చర్యలు తీసుకోవాలి. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.