ఎరువు.. ధరల దరువు!

ABN , First Publish Date - 2022-01-24T08:01:37+05:30 IST

కేంద్ర ప్రభుత్వ నియంత్రణ పూర్తి స్థాయిలో లేకపోవడంతో ఎరువుల ధరలను కంపెనీలే నిర్ణయిస్తున్నాయి.

ఎరువు.. ధరల  దరువు!

రైతు నెత్తిన అధిక భారం

రసాయన ఎరువులపై రూ.500 వరకు పెంపు

ఉత్తరాది రైతులు వినియోగించే

యూరియా, డీఏపీలకే రాయితీలు

మిగతా ఎరువులపై లేవు

ఎన్‌పీవీకి రాయితీలిస్తున్నా..

రైతుకు నేరుగా అందడం లేదు

అటు రిటైల్‌ డీలర్లకూ సమస్యలు

జగన్‌ సర్కారు తీరుతో మరిన్ని కష్టాలు

ఆర్‌బీకేల్లో అమ్మడానికి వీలుగా

వారి కేటాయింపుల్లో కోత

సొసైటీలకూ నామమాత్రంగానే


అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి సరుకుల ధరలు పెరిగాయన్న సాకుతో అన్‌సీజన్‌లోనూ కంపెనీలు రసాయన ఎరువుల ధరలను అమాంతం పెంచేశాయి. ఏడాదిలోపే ఐదారుసార్లు ధరలు పెంచడంతో రైతులపై భారం బాగా పెరిగిపోయింది. ఎరువుల ధరలు ఈ రకంగా పెరుగుతూ పోతే ఇక వ్యవసాయం చేయడం కష్టమవుతుందని వారు ఆందోళన చెందుతున్నారు.


(అమరావతి-ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ నియంత్రణ పూర్తి స్థాయిలో లేకపోవడంతో ఎరువుల ధరలను కంపెనీలే నిర్ణయిస్తున్నాయి. రసాయన ఎరువుల తయారీకి వాడే ముడి సరుకుల ధరలు పెరుగుతున్నాయంటూ దాదాపు అన్ని కంపెనీలూ బస్తాకు రూ.వందల చొప్పున పెంచేస్తుండటంతో రైతులపై పెట్టుబడి భారం పెరిగిపోతోంది. దీనికితోడు కంపెనీలే లాభం మొత్తం తీసుకుంటున్నాయి. డీలర్లకు మార్జిన్‌ను పెంచడం లేదు. గత మే నెలలో ఉన్న ధరలతో పోల్చితే ఇప్పుడు బస్తాకు 30-40ు వ్యత్యాసం వచ్చింది. ఏడాది తిరక్కుండానే రూ.400 నుంచి రూ.500 దాకా పెరిగింది. ఖరీఫ్‌ మొదట్లో 20:20:0:13 రకం రూ.975 నుంచి రూ.1,050 వరకు ఉంటే.. ఇప్పుడు రూ.1,300కి చేరింది. 28:28:00 రకం రూ.1,450 నుంచి రూ.1,920కు పెరిగింది. ఈ విధంగా అన్ని రకాల ఎరువుల ధరలూ పెంచేశారు. డీఏపీకి కేంద్రం 50ు రాయితీ ఇస్తుండడంతో రైతుకు 50 కిలోల బస్తా రూ.1,200కు విక్రయిస్తున్నారు. యూరియా కూడా బస్తా రూ.266కే అమ్ముతున్నారు.


ఉత్తరాది రాష్ట్రాల రైతులు అధికంగా వినియోగించే యూరియా, డీఏపీలకు కేంద్రం రాయితీలిస్తోంది. మిగతా ఎరువులపై రాయితీల్లేవు. కాంప్లెక్స్‌ ఎరువుల్లో వాడే ఎన్‌పీవీకి రాయితీలిస్తున్నా.. రైతుకు ప్రత్యక్షంగా అందని పరిస్థితి. దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ రైతులు వాడే ఎరువుల్లో సగానికి పైగా కాంప్లెక్స్‌ ఎరువులే. ఫలితంగా రైతులపై ధరల భారం పడుతోంది. కాగా.. యూరియా 50 కిలోల బస్తా రూ.266కు అమ్మితే రూ.40-60 దాకా నష్టమొస్తోందని డీలర్లు వాపోతున్నారు. తయారీ కంపెనీలు డోర్‌డెలివరీ ఇవ్వకపోవడంతో రవాణా ఖర్చులు వారే భరించాల్సి వస్తోంది. దీంతో యూరియాకు డిమాండ్‌ వచ్చినప్పుడు ధర పెంచి అమ్ముతున్నారు. 


పురుగు మందుల ధరలూ..

క్రిమిసంహారక మందుల ధరలు ఈ ఏడాది 6-18% వరకు పెరిగాయి. కొవిడ్‌ కారణంగా చైనా నుంచి కొన్ని రకాల ముడి పదార్థాలు, పురుగు మందుల దిగుమతులు ఆగిపోవడం, ఎల్లో ఫాస్పేట్‌, పెట్రో కెమికల్‌ రేట్లు అంతర్జాతీయంగా పెరగడంతో వీటి ధరలు పెరిగాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెరుగుదల ప్రభావంతో రవాణా చార్జీలు కూడా 50%పైగా పెరిగాయి. ఓడలు, కార్గో విమానాల ద్వారా సరుకు దిగుమతులు సజావుగా సాగకపోవడం, కంటైనర్ల కొరత వల్ల కూడా దిగుమతులు లేక అటు ఎరువులు, ఇటు పురుగు మందుల ధరలు పెరుగుతున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.


డీలర్లకు కోత-వాత

డీలర్లకు ఎరువుల కేటాయింపుల్లో దేశవ్యాప్తంగా ఒకే విధానం ఉండగా.. మన రాష్ట్రంలో దీనికి భిన్నంగా ఉంది. రైతుభరోసా కేంద్రాల్లో ఎరువులు అమ్మడం కోసం.. ప్రైవేటు వ్యాపారులకు కంపెనీల నుంచి ఎరువులు ఇండెంట్‌ ప్రకారం రాకుండా జగన్‌ ప్రభుత్వం అడ్డుకుంటోంది. డీలర్లకు వ్యవసాయ శాఖ అనుమతితోనే కంపెనీలు ఎరువులను సరఫరా చేయాలన్న విధానం వల్ల డీలర్లకు కేటాయింపుల్లో అధికారులు కోత విధిస్తున్నారు. ఎరువుల్లో ఎక్కువ భాగం ఆర్బీకేలకు మళ్లిస్తున్నారు. సహకార సంఘాలకు కూడా నామమాత్రంగానే కేటాయిస్తున్నారు. కానీ ఆర్బీకేల్లో అన్ని రకాల ఎరువుల లభ్యత లేకపోగా.. కొన్నింటిలో సేంద్రియ ఎరువులు కొనుగోలు చేస్తేనే డీఏపీ, యూరియా, పొటాష్‌ లాంటి ఎరువులు ఇస్తామంటున్నారని రైతులు వాపోతున్నారు.  


ఐపీలు, ఆత్మహత్యలు.. 

ఎరువుల ధరల పెరుగుదలను వ్యాపారులు సైతం వ్యతిరేకిస్తున్నారు. ఎరువుల డీలర్లు చాలా మంది రైతులకు అప్పులు పెడతారు. కొవిడ్‌ నేపథ్యంలో రైతులకు, రిటైల్‌ వ్యాపారులకు పరపతి పెరగక.. ఆర్థిక లావాదేవీలు సజావుగా సాగడం లేదు. పైగా రాష్ట్రంలో వరుస వాయుగుండాలు, తుఫాన్లు, అకాల వర్షాలతో వరి, పత్తి, ఉద్యాన పంటలు దెబ్బతినగా, కొత్త రకం చీడపీడలతో మిర్చి అత్యధిక భాగం దెబ్బతిన్నది. పత్తికి మినహా ఇతర పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, మళ్లీ కొవిడ్‌, ఒమైక్రాన్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో డబ్బు తిరగక వ్యాపారం సజావుగా సాగడం లేదు. ఈ కారణాల వల్ల వ్యవసాయం, ఎరువుల వ్యాపారం సంక్షోభంలో పడింది.


ఈ పరిస్థితుల్లో ఈ ఏడాది పలువురు డీలర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. కొవిడ్‌, వరుస విపత్తుల నేపథ్యంలో ఎరువులు, పురుగు మందుల వ్యాపారం ఒడిదొడుకుల్లో ఉందని రాష్ట్ర ఎరువులు, పురు గు మందుల డీలర్ల సంఘ అధ్యక్షుడు వజ్రాల వెంకట నాగిరెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. వ్యవసాయం కోసం రైతులకు ఇచ్చిన అప్పులు కొన్ని చోట్ల వెనక్కి రావ డం లేదన్నారు. ఎరువులు, క్రిమిసంహారక మందుల ధరలు పెరగడంతో పెట్టుబడులు పెరిగిపోయాయన్నారు. ఈ కారణంగా ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయినవారిలో 18 మంది ఈ ఏడాది ఆత్మహత్య చేసుకున్నారని, పలువురు ఐపీ పెట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. యూరియా అమ్మితే బస్తాకు రూ.60దాకా నష్టమొస్తోందన్నారు. అందువల్ల ప్రభుత్వాలు రైతులకు, వ్యాపారులకు సహాయం చేయాలన్నారు.

Updated Date - 2022-01-24T08:01:37+05:30 IST