ఎరువు.. ధరల దరువు

ABN , First Publish Date - 2022-06-29T05:54:41+05:30 IST

ఒకవైపు సాగు వ్యయం విపరీతంగా పెరిగిపోవడం, మరోవైపు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించక అప్పుల పాలవుతున్న అన్నదాతలను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం... వారిపై ఎరువుల ధరల పెంపు ద్వారా మరో దెబ్బ వేసింది.

ఎరువు.. ధరల దరువు

అన్నదాతలపై మరింత భారం మోపిన కేంద్రం

రకాన్నిబట్టి బస్తాకు రూ.140 నుంచి రూ.425 వరకు పెంపు

వరి, చెరకు పంటలకు పెరగనున్న పెట్టుబడి వ్యయం

ఎకరాకు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు అదనపు భారం

అన్నదాతలు బెంబేలు


(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

ఒకవైపు సాగు వ్యయం విపరీతంగా పెరిగిపోవడం, మరోవైపు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించక అప్పుల పాలవుతున్న అన్నదాతలను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం... వారిపై ఎరువుల ధరల పెంపు ద్వారా మరో దెబ్బ వేసింది. డీఏపీ, ఇతర కాంప్లెక్స్‌ ఎరువులపై బస్తాకు కనిష్ఠంగా రూ.140, గరిష్ఠంగా రూ.425లు పెరిగాయి. కొత్త ధరలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో ఎరువులు కొనుగోలు చేయడానికి దుకాణాలకు వెళ్లిన రైతులు... పెరిగిన ధరలను చూసి బెంబేలెత్తిపోతున్నారు. రసాయన ఎరువులను తప్పనిసరిగా వినియోగించే పంటల సాగు వ్యయం ఎకరాకు రూ.1,000 నుంచి రూ.1,500 వరకు పెరుగుతుందని అంటున్నారు. 

వ్యవసాయ రంగం గత కొన్నేళ్లుగా తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నది. పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోవడం, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించకపోవడంతో అన్నదాతలు అప్పుల పాలవుతున్నారు. కూలి రేట్లు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలు ఏటా పెరుగుతూనే వున్నాయి. కానీ ఆ స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్‌లో ధరలు పెరగడంలేదు. ప్రధానంగా అధిక పంట దిగుబడి కోసం వినియోగించే రసాయన ఎరువుల ధరలు కొన్నేళ్లుగా పైపైకి దూసుకుపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం గతంలో ఏడాదికోసారి ఎరువులు ధరలను పెంచేది. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎప్పుడుపడితే అప్పుడు ధరలు పెంచేస్తున్నది. కొన్ని ఎరువులకు సబ్సిడీలు కొనసాగిస్తున్నట్టు చెబుతున్నప్పటికీ ఇస్తున్న సబ్సిడీ కన్నా పెంచిన ధరలు రెండు మూడురెట్లు అధికంగా వుంటున్నాయి. దీంతో ఏటేటా ఎరువుల ధరలు పైపైకి ఎగబాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీ పెంచినట్టు సుమారు రెండు నెలల క్రితం ప్రకటించింది. దీంతో గత ఏడాది కన్నా ధరలు తగ్గుతాయని రైతులు భావించారు. ఎరువుల షాపులకు వెళ్లి కొనుగోలు చేసిన తరువాత అసలు విషయం బోధపడింది. డీఏపీ (40 కిలోలు) బస్తా రూ.150 పెరిగింది. గత ఏడాది బస్తా రూ.1,200 వుండగా, ప్రస్తుతం రూ.1,350 వుంది. వాస్తవంగా డీఏపీ బస్తా రూ.3,850 అని, దీనిలో రూ.2,500 కేంద్రం భరించి, రైతులకు రూ.1,350కే ఇస్తున్నట్టు కేంద్ర మంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ చెబుతున్నారు. మిగిలిన ఎరువుల విషయానికి వస్తే 14-35-14, 28-28.0 ఎరువులు 50 కిలోలపై రూ.425, 20-20-0-13 ఎరువుపై రూ.140, 15-15-15 ఎరువుపై రూ.300 చొప్పున ధరలు పెరిగాయి.

జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో అన్ని రకాల పంటలు కలిపి సుమారు లక్ష హెక్టార్లలో సాగు చేస్తుంటారు. ఎరువుల వినియోగం తప్పనిసరి అయిన వరి, చెరకు పంటలు దాదాపు సగం విస్తీర్ణంలో వుంటాయి. మిగిలిన వాటిలో చిరుధాన్యాలు, పప్పు దినుసులు, నూనె గింజలు, తదితర పంటలు వున్నాయి. ఎకరా వరికి ఒక బస్తా డీఏపీ, రెండు బస్తాల కాంప్లెక్స్‌ ఎరువులు వినియోగిస్తారు. పెరిగిన ధరల ప్రకారం ఈ ఏడాది డీఏపీపై రూ.150, కాంప్లెక్స్‌ ఎరువులపై రూ.850 వరకు అదనపు భారం పడనున్నది. 

అనకాపల్లి జిల్లాలో  ఖరీఫ్‌ సీజన్‌లో 25,555 టన్నుల ఎరువులు అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ప్రైవేటు వ్యాపారులు విక్రయించే ధర కన్నా రైతు భరోసా కేంద్రాల్లో తక్కువ ధరకు ఎరువులు విక్రయిస్తామని ప్రభుత్వం చెబుతున్నది. జిల్లాలో ఖరీఫ్‌ వ్యవసాయ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. జిల్లాలోని 239 రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్‌బీకే) ఈ నెలాఖరునాటికి 3,950 టన్నుల ఎరువులను నిల్వ చేయాలని వ్యవసాయ శాఖ, మార్క్‌ఫెడ్‌ లక్ష్యంగా పెట్టుకున్నాయి. కానీ ఇంతవరకు 1,287 టన్నులు మాత్రమే ఆర్‌బీకేలకు చేరాయి. దీంతో పలు కేంద్రాల్లో ఎరువులు లేకపోవడంతో రైతులు పూర్తిస్థాయి ధర చెల్లించి ప్రైవేటు షాపుల్లో కొనుగోలు చేయాల్సి వస్తున్నది.


ఎరువుల కొరత లేకుండా చూస్తాం :  లీలావతి, జిల్లా వ్యవసాయాధికారి 

జిలాలో మార్క్‌ఫెడ్‌ వద్ద 2,100 టన్నుల ఎరువులు సిద్ధంగా ఉన్నాయి. రైతు భరోసా కేంద్రాలు, సహకార సంఘాల ద్వారా రైతులు ఎరువులు పొందవచ్చు. రైతు భరోసా కేంద్రాల్లో నిల్వ సామర్థ్యం ఆధారంగా ఎరువులను అందుబాటులో వుంచుతాము. వర్షాలు మొదలైనందున మరో వారం రోజుల్లో వ్యవపాయ పనులు ఊపందుకుంటాయి. ఆ సమయానికి ఆర్‌బీకేల్లో సరిపడ ఎరువులు అందుబాటులో వుంటాయి.


Updated Date - 2022-06-29T05:54:41+05:30 IST