పండగ సీజన్‌ అమ్మకాల్లో రెండంకెల వృద్ధి!

Sep 20 2021 @ 03:25AM

కన్య్సూమర్‌ డ్యూరబుల్స్‌ పరిశ్రమ అంచనా

  కొత్త మోడల్స్‌, ఆకర్షణీయమైన పథకాలతో సిద్ధం 


న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌, ఎలకా్ట్రనిక్‌ వినియోగ వస్తూత్పత్తి (కన్స్యూమర్‌ డ్యూరబుల్స్‌) పరిశ్రమ ఈ సంవత్సరం కూడా దసరా, దీపావళి పండగలపైనే ఆశలు పెట్టుకుంది. ఈ పరిశ్రమ వార్షిక టర్నోవర్‌లో దాదాపు 30 శాతం ఈ పండగల సీజన్‌లోనే ఉంటుంది. కొవిడ్‌ రెండో ఉధృతి కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీంతో ఆ లోటు ఈ పండగ సీజన్‌లో పూడ్చుకునేందుకు సిద్ధమవుతోంది. కొన్ని సమస్యలు ఉన్నా ఈ సంవత్సరం పండగల సీజన్‌లో అమ్మకాల వృద్ధి రేటు ఎంతలేదన్నా రెండంకెల్లో ఉంటుందని భావిస్తోంది.


ప్రత్యేక ఆఫర్లు

పండగల సీజన్‌లో కొత్త మోడల్స్‌, భారీ ప్రచారం, ఆకర్షణీయమైన డిస్కౌంట్స్‌, క్యాష్‌బ్యాక్‌లతో గృహోపకరణ  ఉత్పత్తుల తయారీ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఆఫర్లకు తోడు కొవిడ్‌తో ఇప్పటి వరకు కొనుగోళ్లు వాయిదా వేసుకున్న వినియోగదారులు మళ్లీ కొనుగోళ్లకు దిగుతారని పరిశ్రమ కొండంత ఆశలు పెట్టుకుంది. పానాసోనిక్‌, ఎల్‌జీ, హేయర్‌, లాయిడ్స్‌, గోద్రెజ్‌ అప్లయన్సెస్‌ వంటి కంపెనీలైతే ప్రీమియం టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషిన్లకూ వచ్చే పండగల సీజన్‌లో మంచి డిమాండ్‌ ఉంటుందని భావిస్తున్నాయి. డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా, నిల్వలను సిద్ధం చేస్తున్నాయి. 


కోలుకుంటున్న డిమాండ్‌

కొవిడ్‌ రెండో ఉధృతి తగ్గడంతో ఎలక్ట్రిక్‌, ఎలకా్ట్రనిక్‌  వినియోగ వస్తువుల అమ్మకాలూ పుంజుకుంటున్నాయి. పానాసోనిక్‌ ఇండియా కంపెనీ అమ్మకాలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే గత నెలలో (ఆగస్టు) 25 శాతం పెరిగాయి. ఇంటి నుంచి పని, ఇంటి పట్టునే ఉండడంతో సరదాగా బయటికి వెళ్లే అవకాశాలు తగ్గాయి. దీంతో ఇంటి పట్టునే మంచి వినోదం అందించే ప్రీమియం వస్తువులకు డిమాండ్‌ పెరిగింది. కొంతమంది ఇందుకోసం ఉన్న పాత వస్తువుల స్థానంలో లేటెస్ట్‌ మోడల్స్‌కు మారిపోతున్నారు. పండగల సీజన్‌ ఆఫర్లతో ఇది మరింత పెరుగుతుందని కంపెనీలు భావిస్తున్నాయి. 


సవాళ్లున్నాయ్‌.. 

అయితే ఈ పండగ సీజన్‌లోనూ పొంచి ఉన్న కొవిడ్‌ మూడో ఉధృతితో పాటు సిలికాన్‌ చిప్‌ల కొరత అమ్మకాలను దెబ్బతీసే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భయపడుతున్నాయి. మరోవైపు ఈ ఏడాది ఇప్పటికే ఉత్పత్తుల ధరలను రెండు సార్లు పెంచటం కూడా అమ్మకాలపై ప్రభావం చూపించే వీలుందని అంచనా వేస్తున్నాయి. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.