2.22 లక్షల ఇళ్లలో జ్వరసర్వే

ABN , First Publish Date - 2021-05-10T04:56:59+05:30 IST

2.22 లక్షల ఇళ్లలో జ్వరసర్వే

2.22 లక్షల ఇళ్లలో జ్వరసర్వే
తాండూరులో కొవిడ్‌ ఐసోలేషన్‌ సెంటర్‌ను పరిశీలిస్తున్న మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, కలెక్టర్‌, తదితరులు

  •  వికారాబాద్‌ జిల్లాలో 6,500మందికి కొవిడ్‌ లక్షణాలున్నట్టు గుర్తింపు
  • రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
  • తాండూరులో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ పరిశీలన


తాండూరు: వికారాబాద్‌ జిల్లాలో 2.22లక్షల ఇళ్లలో జ్వరసర్వే పూర్తయిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం ఆమె తాండూరులోని మాతాశిశు ఆరోగ్యకేంద్రంలో ఏర్పాటు చేసిన కొవిడ్‌కేర్‌ సెంటర్‌ను  ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రోహిత్‌రెడ్డి, డాక్టర్‌ ఆనంద్‌, జిల్లా కలెక్టర్‌ పౌసుమిబసుతో కలిసి పరిశీలించారు. ఆసుపత్రిలో మహిళలు, పురుషులకు వేర్వేరుగా ఏర్పాటు చేసిన వార్డులు, ఐసీయూ సెంటర్‌, ల్యాబ్‌లను పరిశీలించారు. అనంతరం అధికారులు వైద్యులతో కలిసి సమీక్షించారు. కొవిడ్‌ పరిస్థితులపై నిరంతరం పర్యవేక్షణ చేస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కొవిడ్‌కేర్‌ సెంటర్‌లో 18మంది వైద్యులు, 12మంది నర్సులు మూడు షిఫ్ట్‌లలో వైద్యసేవలు అందించాలని అన్నారు. 75 ఆక్సిజన్‌ బెడ్లు, 15 ఐసీయూ బెడ్లు సిద్ధం చేయడాన్ని ఆమె పరిశీలించారు. వికారాబాద్‌ జిల్లాలో బాధితులు కొవిడ్‌ హెల్ప్‌లైన్‌ టోల్‌ఫ్రీ నెం.1800 599 6863కు ఫోన్‌చేసి సహాయం పొందాలని, కొవిడ్‌ వచ్చిన వారు జాగ్రత్తగా ఉండాలని, ధైర్యంగా వైర్‌సను ఎదుర్కోవాలని కోరారు. జిల్లాలో మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ వేసుకున్న 45వేల మందికి 2వ డోస్‌ ప్రక్రియ పూర్తయిన అనంతరం మళ్లీ మొదటి డోస్‌ కార్యక్రమం చేపడతామని తెలిపారు. తాండూరు జిల్లా ఆసుపత్రిలో 54మంది కరోనా పేషెంట్లు చికిత్స పొందుతుండగా ఐదగురికి ఆక్సిజన్‌తో వైద్యం అందిస్తున్నామని తెలిపారు. మంత్రి వెంట జిల్లా గ్రంథాలయ  సంస్థ చైర్మన్‌ మురళీగౌడ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ స్వప్న, యాలాల ఎంపీపీ బాలేశ్వర్‌గుప్తా, కౌన్సిలర్‌ శోభారాణి తదితరులు ఉన్నారు.

వికారాబాద్‌లో త్వరలో ఆక్సిజన్‌ బెడ్స్‌ ఏర్పాటు

వికారాబాద్‌: జిల్లా కేంద్రంలో త్వరలో ఆక్సిజన్‌ బెడ్లు ఏర్పాటు చేస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆది వారం ఆమె ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, వికారాబాద్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ మెతుకు ఆనంద్‌, తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డిలతో కలిసి పట్టణంలోని రాజీవ్‌నగర్‌ కాలనీలో నిర్మించిన వంద పడకల ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న మూడు రోజుల్లో వికారాబాద్‌ పట్టణంలోని రాజీవ్‌నగర్‌ కాలనీలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్టీపీసీఆర్‌ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా ఆసుపత్రిలో ఆక్సిజన్‌ బెడ్స్‌ కూడా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ను ఆమె ఆదేశించారు. ఫీవర్‌ సర్వేలో గుర్తిం చిన అనుమానితులను పర్యవేక్షించాలని, అనుమానం ఉన్న వారికి టెస్టులు నిర్వహించిన అనంతరం జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. ప్రజలు కూడా తప్పనిసరిగా మాస్కు ధరించి అత్యవసరమైతేనే బయటకు రావాలన్నారు. జ్వరం, దగ్గు, జలుబు ఉన్న ప్రతి ఒక్కరూ పరీక్ష చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ పౌసుమిబసు, అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్‌ నాగేందర్‌గౌడ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ మురళీకృష్ణగౌడ్‌, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మంజుల, నాయకులు, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-05-10T04:56:59+05:30 IST