ప్రతి ఇంట్లో ఒకరికి ఆరోగ్య సమస్య

ABN , First Publish Date - 2022-01-26T17:30:25+05:30 IST

రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో జ్వరం, జలుబు, గొంతునొప్పి, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నా తమ ఇంటి వద్దకు వస్తున్న వైద్య

ప్రతి ఇంట్లో ఒకరికి ఆరోగ్య సమస్య

జ్వర సర్వేలో చెప్పని ప్రజలు

హైదరాబాద్/రాజేంద్రనగర్‌/చార్మినార్‌: రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో జ్వరం, జలుబు, గొంతునొప్పి, దగ్గు వంటి సమస్యలతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నా తమ ఇంటి వద్దకు వస్తున్న వైద్య సిబ్బందికి మాత్రం ప్రజలు వివరాలు వెల్లడించడంలేదు. స్థానికంగా ఉన్న మెడికల్‌ షాప్‌లలో మందులు కొనుగోలు చేస్తూ ఇంటివద్దనే సొంతవైద్యం చేసుకుంటున్నారు. అనారోగ్య సమస్యలు ఎక్కువైతే స్థానికంగా ఉన్న క్లినిక్‌లు, ఆర్‌ఎంపీలతో చికిత్స చేయించుకుంటున్నారు. ఇంట్లో ఒకరికి జ్వరం వస్తే ఇంటిల్లిపాదికి వస్తుందని పలువురు వాపోతున్నారు. 

298 మంది ఔట్‌ పేషెంట్లు

బుద్వేల్‌లోని రాజేంద్రనగర్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో మంగళవారం 298 మంది వరకు ఔట్‌ పేషెంట్లుగా వైద్యం పొందారని ఆస్పత్రి మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ సుగుణ తెలిపారు. వారిలో జ్వరం, దగ్గుతో బాధపడుతున్న వారే ఎక్కువగా ఉన్నారన్నారు. ఆస్పత్రికి వచ్చిన వారిలో 182 మంది కరోనా పరీక్షలు చేయించుకోగా 67 మందికి పాజిటివ్‌ వచ్చినట్టు ఆమె వెల్లడించారు. 


సర్వేలో 104 మందికి జ్వరం

రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో మంగళవారం వైద్యాధికారులు 45 బృందాలతో నిర్వహించిన జ్వర సర్వేలో 4,112 ఇళ్లల్లో ప్రజల ఆరోగ్య సమాచారం అడిగి తెలుసుకున్నారు. వారిలో 104 మంది జ్వరం, ఇతర సమస్యలతో బాధపడుతున్నట్టు తెలిపారని, దీంతో వారికి మందులు పంపిణీ చేశామని కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ మహ్మద్‌ సిరాజుద్దీన్‌, హెల్త్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ చెన్న కేశవులు తెలిపారు. 

 పాతబస్తీలో జ్వరాలు, దగ్గుతో బాధపడుతున్నవారి సంఖ్య తక్కువగానే ఉంది. బండ్లగూడ, బార్కస్‌, పార్వతీనగర్‌, మైసరం, ఉప్పుగూడ, బాలగంజ్‌, యూపీహెచ్‌సీలలో 44టీంలు 2,696 ఇళ్లలో సర్వే చేయగా 149 మందికి జ్వరాలు వచ్చినట్టు గుర్తించారు. పై ఆరు యూపీహెచ్‌సీలలో 552 మందికి కరోనా పరీక్షలు చేయగా 47మందికి పాజిటివ్‌ వచ్చినట్టు వైద్యులు తెలిపారు.


మెడికల్‌ షాప్‌లో మందుల కొనుగోలు

జలుబు, దగ్గు, గొంతునొప్పి సమస్యలతో చాలా మంది ఆస్పత్రులకు వెళ్లకుండా మెడికల్‌ షాప్‌లోనే మందులు కొనుగోలు చేసి వేసుకుంటునట్టు తెలుస్తోంది. 

- దుంబాల ఉమారెడ్డి, శ్రీరామ మెడికల్‌ షాప్‌,రాజేంద్రనగర్‌


రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో 202 మందికి పాజిటివ్‌ 

రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో మంగళవారం 656మందికి కరోనా పరీక్షలు చేయగా 202 మందికి పాజిటివ్‌ వచ్చినట్టు వైద్యాధికారులు తెలిపారు. రాజేంద్రనగర్‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో 182 మందిలో 67, మైలార్‌దేవుపల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో 201 మందిలో 78, శివరాంపల్లి ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌లో 173 మందిలో 53, హసన్‌నగర్‌లో 100 మందిలో నలుగురికి పాజిటివ్‌ వచ్చింది. 

Updated Date - 2022-01-26T17:30:25+05:30 IST