కొవిడ్‌ నియంత్రణకే జ్వరసర్వే

ABN , First Publish Date - 2022-01-21T05:58:10+05:30 IST

కొవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా శుక్రవారం నుంచి గ్రామాల్లో జ్వరసర్వే నిర్వహించాలని ఆర్థిక వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. కొవిడ్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై పంచాయతిరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి గురువారం ఆయన కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్యఆరోగ్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొవిడ్‌ ప్రస్తుత దశలో లక్షణాలు కనిపించకపోవడం, ప్రజలు పరీక్షలు చేసుకోవడానికి ముందుకురాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. గ్రామాలు, వార్డులవారీగా బృందాలను ఏర్పాటుచేసి ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించాలని ఆదేశించారు.

కొవిడ్‌ నియంత్రణకే జ్వరసర్వే

అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్‌ ఔట్‌పేషెంట్‌ సేవలను ప్రారంభించాలి

ఆర్థిక, వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు


సిద్దిపేట టౌన్‌, జనవరి 20: కొవిడ్‌ నియంత్రణ చర్యల్లో భాగంగా శుక్రవారం నుంచి గ్రామాల్లో జ్వరసర్వే నిర్వహించాలని ఆర్థిక వైద్యఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. కొవిడ్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై పంచాయతిరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి గురువారం ఆయన కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్యఆరోగ్యశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొవిడ్‌ ప్రస్తుత దశలో లక్షణాలు కనిపించకపోవడం, ప్రజలు పరీక్షలు చేసుకోవడానికి ముందుకురాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా సర్వే నిర్వహించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. గ్రామాలు, వార్డులవారీగా బృందాలను ఏర్పాటుచేసి ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించాలని ఆదేశించారు. జ్వర లక్షణాలు కనిపిస్తే హోమ్‌ ఐసోలేషన్‌ కిట్‌ను ఇవ్వాలని సూచించారు. ఐదు రోజుల అనతరం కూడా ఆరోగ్యం మెరుగుపడకపోతే ఆసుపత్రుల్లో చేర్పించాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్‌ ఓపీ సేవలను అందజేశాలని నిర్దేశించారు. కొవిడ్‌ టెస్టింగ్‌ కిట్‌లు, హోమ్‌ ఐసోలేషన్‌ కిట్‌లు, మందులను సరిపడా నిల్వ ఉంచుకోవాలని సూచించారు. కలెక్టర్లు ప్రభుత్వ వైద్యులతో సమీక్షలు నిర్వహించాలని, ప్రజలందరూ కొవిడ్‌ నిబంధనలు పాటించేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని అన్నారు. సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ మాట్లాడుతూ కొవిడ్‌తో మృతిచెందినవారి కుటుంబాలు ఎక్స్‌గ్రేషియా కోసం చేసుకున్న దరఖాస్తులను జిల్లాస్థాయిలో ఏర్పాటైన కమిటీ పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌, జిల్లా వైద్యాధికారి మనోహర్‌, జిల్లా పంచాయితీ అధికారి కౌసల్య, ఆయా శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.


జిల్లాలో సర్వే ప్రారంభం

కొండపాక, జనవరి 20: సిద్దిపేట జిల్లాలో ఫీవర్‌ సర్వేను ఒకరోజు ముందుగానే ప్రారంభించారు. కొండపాక మండలం దమ్మక్కపల్లిలో జిల్లా అదనపు కలెక్టర్‌ ముజామిల్‌ఖాన్‌ గురువారం సాయంత్రం సర్వేను ప్రారంభించారు. మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం గురువారం సాయంత్రం కలెక్టర్‌ జిల్లాస్థాయి అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించి సర్వేపై చర్చించారు. పనులపై బయటకు వెళ్లిన ప్రజలు సాయంత్రం ఇంటికి చేరుకునే దృష్ట్యా గురువారం సాయంత్రమే సర్వేను ప్రారంభించాలని ఆదేశించారు. కలెక్టర్‌ ఆదేశాలతో అదనపు కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ కొండపాక మండలం దమ్మక్కపల్లిలో ఫీవర్‌ సర్వేను ప్రారంభించారు. సిబ్బందితో కలిసి ప్రతీ ఇంటికి వెళ్లి ఆయా కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితపై ఆరా తీశారు.

Updated Date - 2022-01-21T05:58:10+05:30 IST