ఫీవర్‌ ..ఫియర్‌

ABN , First Publish Date - 2021-10-27T05:10:11+05:30 IST

గడిచిన నాలుగు రోజులుగా చలి, జ్వరం, తలనొప్పి, కళ్లు తిరగడం, కీళ్ల నొప్పులు, ప్లేట్‌ లెట్స్‌ తగ్గడం, పట్టు తప్పి పడిపోవడం, వంటి లక్షణాలతో చిన్నా పెద్దా తేడా లేకుండా సుమారు 60 మంది వరకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఫీవర్‌ ..ఫియర్‌
సొమ్మసిల్లి పడిపోయిన బాధితుడు

నాలుగు రోజులుగా చలి జ్వరంతో పదుల సంఖ్యలో ఆస్పత్రిపాలు

తలనొప్పి, కళ్లు తిరగడం, కీళ్ల నొప్పులతో పడిపోతున్న బాధితులు

రంగంలోకి దిగిన వైద్య బృందాలు.. కారణాల అన్వేషణకు ఇంటింటా సర్వే

అపారిశుధ్యం, తాగునీటి కాలుష్యమే కారణమని కాలనీ వాసుల ఆగ్రహం

రిఫరల్‌ కేంద్రంగా తయారైన కొవ్వూరు ప్రభుత్వ వైద్యశాలపై మండిపాటు

వైరల్‌ జ్వరాలుగా నిర్ధారణ : జేసీ హిమాన్షుశుక్లా.. బాధితులకు పరామర్శ


కొవ్వూరు ఒకటో వార్డు శ్రీ రామ కాలనీలో ఏం జరుగుతోంది ? ఒకరి తర్వాత మరొకరు తీవ్ర అస్వస్థతకు గురై ఎందుకు కుప్ప కూలిపోతున్నారు. గతంలో ఏలూరులో కనిపించిన వింత వ్యాధి లక్షణాలేమోనని ఓ దశలో స్థానికులు భయపడ్డారు. ఎందుకిలా జరిగిందో తెలుసుకునేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటా సర్వే చేపట్టారు. మరోవైపు జాయింట్‌ కలెక్టర్‌ హిమాన్షుశుక్లా ఇక్కడ పర్యటించి ఇవి వైరల్‌ జ్వరాలేనని తేల్చి చెప్పడంతో ఆ దిశగా వైద్య సేవలందిస్తున్నారు. 


కొవ్వూరు, అక్టోబరు 26 : గడిచిన నాలుగు రోజులుగా చలి, జ్వరం, తలనొప్పి, కళ్లు తిరగడం, కీళ్ల నొప్పులు, ప్లేట్‌ లెట్స్‌ తగ్గడం, పట్టు తప్పి పడిపోవడం,  వంటి లక్షణాలతో చిన్నా పెద్దా తేడా లేకుండా సుమారు 60 మంది వరకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరిలో 20 మందికిపైగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోను, మిగిలిన వారు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ చికిత్స తీసుకుంటున్నట్టు చెబుతున్నారు.  పీహెచ్‌సీ వైద్యులు బృందాలుగా ఏర్పడి డోర్‌ టు డోర్‌ సర్వే చేపట్టారు. ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. జ్వరాలతో బాధపడుతున్న వారిని మెడికల్‌ క్యాంపునకు తరలించి, పరీక్షలు నిర్వహిస్తున్నారు. అత్యవసరమైన వారిని 108 అంబులెన్స్‌లో ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ కేటీ సుధాకర్‌ ఆధ్వర్యంలో కాలనీ అంతా బ్లీచింగ్‌ చల్లించి, సూపర్‌ శానిటేషన్‌ చేపట్టారు. తాగునీటి పైపలైను సూపర్‌ క్లోరినేషన్‌ చేయించడంతోపాటు, తాగునీటి శాంపుల్స్‌ సేకరించి ఏలూరు నీటి పరీక్ష కేంద్రాలకు పంపించారు. జ్వర పీడితులను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత పరామర్శించారు. మున్సిపల్‌, రెవెన్యూ, వైద్యాధికారులకు సూచనలు చేశారు. మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ బావన రత్నకుమారి, ఆర్డీవో ఎస్‌.మల్లిబాబు, తహసిల్ధార్‌ బి.నాగరాజనాయక్‌ , కౌన్సిలర్లు సూరపనేని చిన్ని, బొండాడ సత్యనారాయణ, అక్షయపాత్ర రవీంద్ర, కంఠమణి రమేష్‌, రుత్తల భాస్కరరావు, వైద్యులు బి.శ్రీనివాస్‌, ఎం.ధర్మరాజు, పి.దేశాయ్‌నాఽథ్‌వర్మ, సీహెచ్‌ రాజేష్‌ కాలనీలో పర్యటించి రోగులను నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 


బాధితులకు మెరుగైన వైద్యం : మంత్రి వనిత

గత రాత్రి నుంచి శ్రీరామవరం కాలనీలో జ్వరాలు, కళ్లు తిరగడం, జాయింట్‌ పెయిన్స్‌ వంటి లక్షణాలతో కొందరు బాధపడుతున్నారు. జిల్లా కలెక్టర్‌, వైద్యాధికారులతో సంప్రదించి బాధితుల నుంచి రక్త నమూనాలను సేకరించి డెంగీ, ప్లేట్‌ లెట్‌ కౌంట్‌ పరీక్షలు నిర్వహిస్తున్నాం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానితో చర్చించి కొవ్వూరు ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్య సేవలందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరాం.


ఇంటింటా సర్వే చేయాలి : చిన్ని 

పట్టణంలో ఇంటింటా సర్వే జరిపి, విష జ్వరాలు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని టీడీపీ మున్సిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ సూరపనేని సూర్యభాస్కర రామ్మోహన్‌(చిన్ని) అధికారులను కోరారు. బొండాడ సత్యనారాయణతో కలిసి వార్డులో ఇంటింటికి వెళ్లి బాధితులను పరామర్శించారు. కాలనీలో తాగునీరు కలుషితం కావడంతోపాటు, అపారిశుధ్య నిర్వహణ, దోమలు పెరిగి విషజ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని ప్రజలు భావిస్తున్నారన్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్‌ చేశారు.   


ఇవి వైరల్‌ జ్వరాలే : జేసీ హిమాన్షు

కొవ్వూరులో నమోదవుతున్నవి వైరల్‌ జ్వరాలేనని ప్రాథమికంగా గుర్తించినట్టు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ హిమాన్షుశుక్లా తెలిపారు. శ్రీ రామ కాలనీ, ప్రభుత్వాసుపత్రిలో రోగులను మంగళవారం రాత్రి హిమాన్షుశుక్లా పరామర్శించారు. అధికారులతో సమావేశం నిర్వహించి జ్వరాలకు సంబంధించి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొందరు జ్వరాలు, తీవ్ర జాయింట్‌ పెయిన్స్‌తో బాధపడుతున్నట్టు తెలియడంతో జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఆదేశాల మేరకు జిల్లా వైధ్యాదికారులతో ఆ ప్రాంతాన్ని పరిశీలించినట్టు తెలిపారు. ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురికావద్దన్నారు. ప్రభుత్వాసుపత్రిలోనే మెరుగైన వైద్యసేవలు అందించే చర్యలు చేపడుతున్నామన్నారు. కొవ్వూరు ఆసుపత్రిలో తాత్కాలికంగా వైద్యులను ఏర్పాటు చేసి ప్రతి కేసును పూర్తి స్థాయిలో పరిశీలిస్తామని తెలిపారు. ఈ నెల 23వ తేదీ నుంచి కొవ్వూరు 1వ వార్డు శ్రీరామ కాలనీలో జ్వరం కేసులు నమోదవుతున్నాయి. 23, 24 తేదీల్లో 1, 2 కేసులు నమోదయ్యాయి. 25వ తేదీ రాత్రి నుంచి 16 కేసులు నమోదు కాగా వాటిలో ఎనిమిది మైల్డ్‌ కేసులుగా గుర్తించాం. కాలనీలో మెడికల్‌ క్యాంపు ఏర్పాటుతో పాటు ప్రతి వీధికి ఒక ఏఎన్‌ఎం, ఇద్దరు ఆశలతో పికెటింగ్‌ ఏర్పాటు చేశాం. జిల్ల్లా డీసీహెచ్‌ఎస్‌, డీఎంహెచ్‌వోల ఆధ్వర్యంలో వైద్య బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. బాధితుల రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించగా డెంగీ, మలేరియా కాదని వైరల్‌ ఫీవర్‌గా వైద్యులు చెబుతున్నారన్నారు. ఫుడ్‌ కంట్రోల్‌, పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు అధికారులను రప్పించి, ప్రతి ఇంటి నుంచి తాగునీరు, పాలు, కూరగాయల శాంపిల్స్‌ సేకరించి వైజాగ్‌ ల్యాబ్‌కు టెస్టింగ్‌ కోసం పంపించామన్నారు. పరీక్ష ఫలితాలు రేపటికి వస్తాయన్నారు. ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల తరువాత ఒక్క కేసు నమోదు కాలేదన్నారు. 


కలుషిత నీరే కారణం

– యాదగిరి రత్నం, కొవ్వూరు

ఇలా అనారోగ్యం పాలవడానికి ప్రధాన కారణం.. కాలనీలో మునిసిపాలిటీ  అందించే తాగు నీరే. ఇది కలుషితమైందని  ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు, కౌన్సిలర్లు పట్టించుకోవడం లేదు. పేద వాళ్లమని మాపై చిన్న చూపు చూస్తున్నారు.


వైద్యం అందడం లేదు

– మానస ఫణికుమార్‌

మూడు రోజులుగా చలి, జ్వరంతో బాధ పడుతున్నాం. కాలనీలో పారిశుధ్యం అధ్వానం. జ్వరంతో కొవ్వూరు ఆసుపత్రికి వెళితే బెడ్‌లు ఖాళీ లేవని చెబుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. మెరుగైన వైద్య చికిత్స అందించాలి.


రాజమండ్రి రిఫర్‌ చేస్తున్నారు

– మెంటే బాబూ

శ్రీరామకాలనీలో రెండు రోజులుగా 50 నుంచి 60 మంది జ్వరం బారిన పడ్డారు. ప్లేట్‌లెట్స్‌ పడిపోయి, కీళ్ల నొప్పులతో ఇబ్బందులు గురవుతున్నారు. కొవ్వూరు ఆసుపత్రికి వెళితే రాజమండ్రి రిఫర్‌ చేస్తున్నారు. ఇలాగైతే ఎలా ? 






Updated Date - 2021-10-27T05:10:11+05:30 IST