జమ్మూలో ఆర్మీ క్యాంపుపై ఉగ్ర దాడి

ABN , First Publish Date - 2022-08-12T09:20:50+05:30 IST

స్వాతంత్య్ర అమృతోత్సవాలు సమీపిస్తున్న వేళ జమ్మూ-కశ్మీర్‌లో గురువారం ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు.

జమ్మూలో ఆర్మీ క్యాంపుపై ఉగ్ర దాడి

4 గంటలు కాల్పులు.. ఇద్దరు ముష్కరుల హతం

నలుగురు జవాన్ల ప్రాణత్యాగం

రాజౌరీలో దుర్ఘటన

జమ్మూ, ఆగస్టు 11: స్వాతంత్య్ర అమృతోత్సవాలు సమీపిస్తున్న వేళ జమ్మూ-కశ్మీర్‌లో గురువారం ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇద్దరు ఫిదాయీన్‌ (ఆత్మాహుతి) దళం సభ్యులు ఆర్మీ క్యాంపుపై దాడికి పాల్పడ్డారు. ఈ సందర్భంగా నాలుగు గంటల పాటు జరిగిన కాల్పుల్లో నలుగురు జవాన్లు అమరులయ్యారు. దాడికి వచ్చిన ఆ ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. ఇక్కడికి 185 కి.మీ.దూరంలోని రాజౌరీ జిల్లా పర్ఘాల్‌ ఆర్మీ క్యాంపుపై దాడి చేసేందుకు బుధవారం అర్ధరాత్రి ఇద్దరు ఉగ్రవాదులు ప్రయత్నించారు. చుట్టూ చెట్లు, ప్రతికూలమైన వాతావరణం ఉండడాన్ని వారు అవకాశంగా భావించారు. ఇద్దరు అపరిచిత వ్యక్తులు క్యాంపు వైపు వస్తున్న విషయాన్ని అక్కడున్న సెంట్రీలు గుర్తించి అప్రమత్తమయ్యారు. ఆ శిబిరంలోకి చొరబడేందుకు ఉగ్రవాదులు గ్రెనేడ్లు విసరగా సెంట్రీలు కాల్పులు జరిపారు. వెం టనే ఇతర జవాన్లు వారిని చుట్టముట్టడంతో హోరాహోరీగా కాల్పులు చోటుచేసుకున్నాయి. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో తొలి తుపాకీ శబ్దం వినపడగా, గురువారం ఉదయం 6.10 గంటల వేళ చివరిది వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ కాల్పుల్లో ఉగ్రవాదులు ఇద్దరూ హతమయ్యారు. ఎదురు కాల్పుల్లో ఆరుగురు జవాన్లు గాయపడగా, వారిలో నలుగరు మరణించారు. సుబేదార్‌ రాజేంద్ర ప్రసాద్‌ (రాజస్థాన్‌), రైఫిల్‌మ్యాన్‌ డి.లక్ష్మణన్‌(తమిళనాడు), రైఫిల్‌మ్యాన్‌ మనోజ్‌ కుమార్‌(హరియాణా), రైఫిల్‌మ్యాన్‌ నిషాంత్‌ నాయక్‌ (హరియాణా) అమరులయ్యారని జమ్ములోని డిఫెన్స్‌ పీఆర్‌ఓ లెఫ్టినెంట్‌ కర్నల్‌ దేవేందర్‌ ఆనంద్‌ తెలిపారు. 

పుల్వామా తరువాత మళ్లీ ఇదే
ఇది ‘ఫిదాయీన్‌’ (ఆత్మాహుతి దళం) దాడి అని సైనిక వర్గాలు భావిస్తున్నాయి. జమ్మూ-కశ్మీర్‌లో మూడేళ్ల అనంతరం ఇలాంటి దాడి జరిగింది. చివరి సారిగా 2019 ఫిబ్రవరి 14న పుల్వామా జిల్లా లెథ్‌పోరాలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మరణించారు. ప్రస్తుత ఫిదాయీన్‌లు ఇద్దరూ నిషేధిక ఉగ్రవాద సంస్థ జైష్‌ ఎ మహమ్మద్‌కు చెందిన వారని డీఐజీ దిల్బాగ్‌ సింగ్‌ చెప్పారు. రాజౌరీ బెల్ట్‌లో ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దాంతో బుధవారం కూంబింగ్‌ నిర్వహించారు కూడా. బలగాలన్నీ అప్రమత్తంగా ఉన్నప్పటికీ ఈ సంఘటన చోటు చేసుకుంది. 

Updated Date - 2022-08-12T09:20:50+05:30 IST