మండుతున్న ధరలు

ABN , First Publish Date - 2021-11-18T05:45:40+05:30 IST

కర్నూలు వెంకటరమణ కాలనీకి చెందిన జ్యోతి అనే మహిళ తన భర్తతో కలిసి కర్నూలు మార్కెట్‌ యార్డులోని కూరగాయల దుకాణానికి వెళ్లారు.

మండుతున్న ధరలు

  1. కూరగాయలు కొనలేని పేదలు
  2. టమోటాకు పెరిగిన డిమాండ్‌
  3. అయినా రైతుకు గిట్టుబాటు లేదు


కర్నూలు(అగ్రికల్చర్‌), నవంబరు 17: కర్నూలు వెంకటరమణ కాలనీకి చెందిన జ్యోతి అనే మహిళ తన భర్తతో కలిసి కర్నూలు మార్కెట్‌ యార్డులోని కూరగాయల దుకాణానికి వెళ్లారు. టమోటా కిలో రూ.80, బీర రూ.60, మిగిలిన కూరగాయలు రూ.40 నుంచి రూ.50 అని వ్యాపారి చెప్పాడు. చేసేది లేక తక్కువ మొత్తంలో కూరగాయలను కొని తీసుకున్నారు. పది రోజుల క్రితం ఇదే వ్యాపారి వద్ద వంద రూపాయలకు అన్ని రకాల కూరగాయలు కొన్నానని, సంచి నిండా వచ్చాయని ఆమె అన్నారు. ఇప్పుడు రూ.350 వెచ్చించినా సగం సంచి కూడా నిండలేదని వాపోయారు. కూరగాయల ధరలు చుక్కలను తాకుతున్నాయి. దీంతో పేదలు పచ్చడి మెతుకులకే పరిమితం కావాల్సి వస్తోంది. 


ఇంకా పెరిగే అవకాశం


వర్షాలు ఎక్కువయ్యాయి. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో టమోటా సాగు దెబ్బతింది. జిల్లాలో కూడా జూన్‌లో కేవలం 720 హెక్టార్లలో టమోటా సాగు చేశారు. గత సంవత్సరం జూన్‌లో 2,500 హెక్టార్లలో సాగైంది. నెల క్రితం టమోటా కిలో రూ.2కు పడిపోయింది. దీంతో రైతులు రోడ్లమీద పారబోశారు. ఈ కారణంగా ఆగస్టులో ఎవ్వరూ సాగు చేసేందుకు ఆసక్తి చూపలేదు. జిల్లాలో సాగు తగ్గిపోవడం, పక్క రాష్ట్రాల్లో పంట దెబ్బతినడంతో ఇప్పుడు టమోటాకు డిమాండ్‌ పెరిగింది. పంటను సాగు చేసిన రైతులకు కలిసొచ్చింది. కానీ వినియోగదారులకు ఘాటు తగులుతోంది. హోల్‌సేల్‌ మార్కెట్‌లో కిలో టమోటాకు రూ.60 లభిస్తోంది. చిల్లర వర్తకులు కిలో రూ.80కి విక్రయిస్తున్నారు. 


పెరిగిన ధరలు


టమోటా దారిలోనే మిగిలిన కూరగాయల ధరలు కూడా మండిపోతున్నాయి. కిలో బీర రూ.60 పైగానే విక్రయిస్తున్నారు. కాకర రూ.40, మిర్చి రూ.30, బెండ రూ.40, చౌళేకాయలు రూ.40, చిక్కుడు రూ.40, బీన్స్‌ రూ.70, ఆలు రూ.40, వంకాయ రూ.60, క్యాబేజీ రూ.30 పలుకుతున్నాయి. దీంతో వినియోగదారులు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చాలామంది చౌకగా లభిస్తున్న ఆకుకూరలపై ఆధారపడుతున్నారు. వర్షాలకు పాడైపోతాయని భావించిన చిల్లర వర్తకులు టమోటాలను కొనుగోలు చేయడం లేదు. నగరంలోని చిన్న మార్కెట్‌లోనూ ఈ పరిస్థితి నెలకొంది.


లాభాలు లేవు


కూరగాయల ధరలు పెరుగుతున్నా తమకు నామమాత్రంగానే లాభం వస్తోందని రైతులు వాపోతున్నారు. కూరగాయల సాగుకు ఎకరానికి రూ.లక్షకు పైగానే పెట్టుబడి ఖర్చు అవుతుందని, దిగుబడి అమ్మితే అంత రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు మార్కెట్‌ యార్డులో వ్యాపారులు తమకు సరైన ధర ఇవ్వడం లేదని అంటున్నారు. కూరగాయల రైతుల నుంచి కమీషన్‌ వసూలు చేయరాదని ప్రభుత్వం ఆదేశించినా, వ్యాపారులు పది శాతం దాకా కమీషన్‌ వసూలు చేస్తున్నారని అంటున్నారు. కూరగాయల బస్తాపై 2 కేజీల దాకా మిగుల్చుకుంటున్నారని, ఈ దోపిడీతో నష్టపోతున్నామని రైతులు అంటున్నారు. కర్నూలు మార్కెట్‌ యార్డులో కమీషన్‌తో పాటు తరుగు, డ్యామేజీ కింద 2 కేజీలు తీసుకుంటున్నారని, అధికారులు ఈ అక్రమాలను అడ్డుకోవాలని రైతులు కోరుతున్నారు. 


అధికారులు పట్టించుకోరు..


కర్నూలు మార్కెట్‌ యార్డులో ఒక్క కూరగాయల అంగడి వద్ద కూడా ధరల పట్టిక లేదు. తూకాలు సరిగా వేయరు. అధికారులు పట్టించుకోవడం లేదు. ఇటువైపే రావడం లేదు. యార్డులోనే పరిస్థితి ఇలా ఉంటే బయట పరిస్థితి ఏమిటి..?          

- రజ్వీన్‌, వీఆర్‌ కాలనీ

Updated Date - 2021-11-18T05:45:40+05:30 IST