FIFA ban : ఏఐఎఫ్ఎఫ్‌పై ఫిఫా బ్యాన్ నేపథ్యంలో సుప్రీంకోర్ట్ కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2022-08-22T21:09:15+05:30 IST

భారత(India) ఫుట్‌బాల్ సమాఖ్య ఏఐఎఫ్ఎఫ్(All India Football Federation) పై ఫిఫా (FIFA ) నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్(Supreme Court) కీలక చర్యకు ఉపక్రమించింది.

FIFA ban : ఏఐఎఫ్ఎఫ్‌పై ఫిఫా బ్యాన్ నేపథ్యంలో సుప్రీంకోర్ట్ కీలక నిర్ణయం

న్యూఢిల్లీ : భారత(India) ఫుట్‌బాల్ సమాఖ్య ఏఐఎఫ్ఎఫ్(All India Football Federation) పై ఫిఫా (FIFA ) నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్ట్(Supreme Court) కీలక చర్యకు ఉపక్రమించింది. ఏఐఎఫ్ఎఫ్‌(AIFF) రోజువారీ కార్యకలాపాల పర్యవేక్షణకుగానూ ఈ ఏడాది మే నెలలో నియమించిన త్రిసభ్య పాలనా కమిటీ(CoA)ని రద్దు చేసింది. నిషేధం ఎత్తివేతకు ఫిఫా సూచించిన కీలక ప్రమాణాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ తెలిపింది. ఈ మేరకు సోమవారం మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత సెక్రటరీ జనరల్ సారధ్యంలోని పాలనా యంత్రాంగం ఏఐఎఫ్ఎఫ్ రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తుందని జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు.


మరోవైపు ఈ నెల 28న జరగాల్సిన ఏఐఎఫ్ఎఫ్ ఎన్నికల తేదీని వారం రోజులు ముందుకు జరుపుతున్నట్టు (పొడగింపు) సుప్రీంకోర్ట్ తెలిపింది. ఓటర్ల  జాబితాలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 36 మంది సభ్యులు మాత్రమే ఉండాలని స్పష్టం చేసింది. కాగా విచారణ సందర్భంగా సీవోఏ తరపున న్యాయవాది గోపాల్ శంకర్‌నారాయణన్ హాజరయ్యారు. ఏఐఎఫ్ఎఫ్ మధ్యంతర ఆడిట్ రిపోర్టును అందజేశారు. తుది రిపోర్టును ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని వెల్లడించింది. కాగా సుప్రీంకోర్ట్ జారీ చేసిన ఈ ఆదేశాలు ఏఐఎఫ్ఎఫ్‌పై ఫిఫా నిషేధం ఎత్తివేత దిశగా బాటలు వేయనుంది. ఫిఫా నిర్ణయంతో ఇప్పటికే జాతీయ జట్టుతోపాటు క్లబ్ జట్లపై ప్రతికూల ప్రభావం పడుతున్న విషయం తెలిసిందే.


ఎందుకీ వివాదం..

ఏ దేశంలోనైనా ఫుట్‌బాల్‌ కార్యక్రమాలను ఆయా సమాఖ్యలు స్వతంత్రంగా నిర్వహించుకోవాలని ఫిఫా కోరుకుంటుంది. అది ప్రభుత్వమైనా, కోర్టులైనా తృతీయ పక్షం జోక్యాన్ని అస్సలు సహించదు. కానీ ఫిఫా నిబంధనల గురించి స్పష్టంగా తెలిసినప్పటికీ భారత సమాఖ్య నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తూ వచ్చింది. 2020 డిసెంబరులోనే అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉన్నా కార్యరూపం దాల్చలేదు. అప్పటికే మూడు పర్యాయాలు అధ్యక్ష పీఠంపై కూర్చున్న ప్రఫుల్‌ పటేల్‌..  జాతీయ క్రీడాబిల్లు నిబంధన ప్రకారం ఇక ఆ  పదవిలో కొనసాగేందుకు ఎంతమాత్రం వీల్లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ ఏడాది మే 18న ఏఐఎఫ్ఎఫ్ అధ్యక్షుడు ప్రఫుల్‌, అతడి కార్యవర్గంపై నిషేధం విధించిన సుప్రీం.. సమాఖ్య వ్యవహారాల  పర్యవేక్షణకు జస్టిస్‌ దవే నేతృత్వంలో త్రిసభ్య కార్యనిర్వాహక కమిటీ (సీఓఏ)ని ఏర్పాటు చేసింది. ఈ పరిణామాలను గమనిస్తున్న ఫిఫా కొంతకాలంగా ఆగ్రహంతోనే ఉంది. పరిస్థితులు మారకపోవడంతో వేటు వేయక తప్పలేదు.

Updated Date - 2022-08-22T21:09:15+05:30 IST