దేశంలోనే తొలి స్పోర్ట్స్ డాక్యుమెంటరీతో ప్రారంభమైన నయా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం ‘ఫిపా ప్లస్’

ABN , First Publish Date - 2022-05-02T22:48:24+05:30 IST

భారతదేశంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఫిఫా ప్లస్ (FIFA+) కోసం స్పోర్ట్స్ డాక్యుమెంటరీ

దేశంలోనే తొలి స్పోర్ట్స్ డాక్యుమెంటరీతో ప్రారంభమైన నయా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం ‘ఫిపా ప్లస్’

ముంబై: భారతదేశంలో కొత్తగా అందుబాటులోకి వచ్చిన డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఫిఫా ప్లస్ (FIFA+) కోసం స్పోర్ట్స్ డాక్యుమెంటరీ ‘మైతానం’ (Maitanam)ను ప్రారంభించినట్టు ఆదివారం ఫిఫా ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చిన ఎంపిక చేసిన ఫిపా ప్లస్ ఒరిజినల్స్‌లో భాగంగా 'మైతానం' గ్లోబల్ స్పోర్ట్స్ స్టోరీ టెల్లింగ్ కంటెంట్ ఎలైట్ లిస్ట్‌లో చేరింది. ‘కేరళలోని ఫుట్‌బాల్‌కు 40 నిమిషాల ప్రేమలేఖ’ ట్యాగ్‌లైన్‌తో తీసుకొచ్చిన ‘మైతానం’లో తమ జీవితంలో ఫుట్‌బాల్‌ను భాగంగా మార్చేసుకున్న కేరళకు చెందిన ఆరు స్ఫూర్తిదాయక కథలు ఉన్నాయి. ఇప్పుడీ డాక్యుమెంటరీ FIFA+లో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ అవుతోంది. 


‘మైతానం’ అనేది మలయళ పదం. మైదానం అని అర్థం. కేరళీయుల అభిరుచికి, ఫుట్‌బాల్ పట్ల మలయాళీలకు ఉన్న ఇష్టానికి ఇది అద్దం పడుతోంది. అంతేకాదు, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ఇప్పుడిది ప్రయత్నిస్తోంది. కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి వాణిజ్య రాజధాని కొచ్చి, సాంస్కృతిక రాజధాని త్రిసూర్ వరకు విభిన్న భూభాగాలను ఈ డాక్యుమెంటరీ కవర్ చేస్తుంది, చెప్పులు లేకుండా ఆడే పూజారులను కలవడం, విదేశాల్లో జరిగే పోటీల్లో మహిళా జట్టు అలరిస్తున్న తీరు, 90 ఏళ్లు దాటిన వారి వద్ద చిన్నారులు శిక్షణ పొందుతుండడం వంటి వాటిని చూపించారు.


ఫిఫా ప్లస్ (FIFA+) కమిషనింగ్ ఎడిటర్, ఏపీఏసీ కంటెంట్ లీడ్ ఆండ్రూ వైట్‌లా మాట్లాడుతూ.. ఫుట్‌బాల్‌ను ఇష్టపడే కేరళలో దానిపై రూపొందించిన ‘మైతనం’ డాక్యుమెంటరీతో భారతీయ మార్కెట్లోకి ప్రవేశిస్తూ రైజ్ వరల్డ్‌వైడ్‌ (RISE Worldwide)తో భాగస్వామ్యం  కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది క్రీడాభిమానులను ఫిఫా ప్లస్ (FIFA+) ఒరిజినల్స్ లక్ష్యంగా చేసుకున్నట్టు చెప్పారు. వివిధ భౌగోళిక పరిస్థితులు, సంస్కృతులలో ఫుట్‌బాల్‌ను ఎలా ఆడతారు? ఆయా దేశాల అభిమానుల హృదయాల్లో దానికి ఎలాంటి స్థానం ఉంది అన్న విషయాలను ఈ చిత్రాలు కళ్లకు కడతాయని ఆండ్రూ తెలిపారు.  


రైజ్ వరల్డ్‌వైడ్ బ్రాడ్‌కాస్ట్, ప్రొడక్షన్ హెడ్ జేమ్స్ రెగో మాట్లాడుతూ.. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఆడే ఫుట్‌బాల్‌ను ప్రదర్శించే అవకాశం ఇచ్చిన ఫిఫాకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నట్టు పేర్కొన్నారు. స్థానికంగా ఫుట్‌బాల్ అసాధారణ స్వభావాన్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లడం గొప్ప విషయమని అన్నారు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది ఫుట్‌బాల్ అభిమానులతో తాము కనెక్ట్ అయ్యేందుకు ఇది దోహదపడుతుందన్నారు. ‘మైతనం’ను తమ ప్రపంచస్థాయి క్రియేటివ్ టీమ్ అత్యాధునిక పరికరాలతో చిత్రీకరించినట్టు చెప్పారు.  

Read more