అమలాపురంలో ఆర్టీసీ బస్సులకు నిప్పు అంటించడంతో మంటల్లో కాలుతున్న దృశ్యం..
కోనసీమ అంటే పచ్చని అందాలకు పెట్టింది పేరు. అటువంటి ప్రకృతి అందాలకు నెలవైన ప్రాంతం మంగళవారం రణరంగమైంది. ఆగ్రహ అగ్ని జ్వాలలతో కదనరంగంగా మారింది. యుద్ధాన్ని తలపించేలా భీకరంగా మారింది. తమ ముట్టడిని కట్టడి చేసి ఉక్కుపాదం మోపారనే ఆగ్రహంతో రగిలిపోయిన ఆందోళనకారులు పెను విధ్వంసానికి దిగారు. ప్రశాంత నిరసనకు ప్రయత్నిస్తే తీరా పోలీసులు లాఠీఛార్జి చేయడంతో రగిలిపోయారు. కట్టలు తెగిన ఆగ్రహంతో రెచ్చిపోయారు. దీంతో పోలీసులపై తెగబడ్డారు. దొరికిన వారిని దొరికినట్టు రాళ్లతో దాడి చేశారు. కనిపించిన బస్సులపై రాళ్లు రువ్వి నిప్పు పెట్టారు. ఈ ఆగ్రహ జ్వాలలు చివరకు అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు వ్యాపించింది. మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పుపెట్టే వరకు దారితీసింది. అక్కడి నుంచి మరో ఎమ్మెల్యే సతీష్ ఇంటికీ పాకింది. అసలేం జరుగుతోందో.. విధ్వంసకాండ ఎక్కడకు పయనిస్తుందో తెలియని భయానక పరిస్థితులకు దారితీసింది. ఎస్పీపైనా రాళ్లదాడి జరగడంతో ఆయన గాయపడ్డారు. అర్ధరాత్రి వరకు ఈ భయానక పరిస్థితులు కొనసాగాయి.
కోనసీమ.. ఇప్పుడు ఆ పేరే అలజడి!
8అటు కోనసీమ జిల్లా పేరు మార్పు 8 ఇటు సామాజిక వర్గాల మధ్య వార్
మురమళ్ల సభతో సీఎంలో మార్పు 8 వెంటనే పేరు మార్చి ఉత్తర్వులు
(అమలాపురం-ఆంధ్రజ్యోతి)
ప్రశాంతంగా ఉండే కోనసీమలో అలజడికి ఆ పేరే కారణమైంది. జిల్లాల పునర్విభజనలో ఏర్పడిన కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్పుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న అనూహ్య నిర్ణయం వివాదమైంది. జిల్లా పేరు మార్పు పై దళిత వర్గాలు హర్షం వ్యక్తంచేస్తుంటే మిగిలిన సామాజిక వర్గాలు వ్యతిరేకిస్తూ మంగళ వారం చేపట్టిన ఆందోళన అమలాపురంలో తీవ్ర విధ్వంసానికి దారితీసింది. గతంలో జిల్లాల పునర్విభజన చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సమయంలోనే దళితులు అంబేడ్కర్ పేరు పెట్టాలంటూ పెద్ద పెట్టున ఉద్యమం అప్పట్లో చేపట్టారు. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం చేయాలనే ఏకైక డిమాండుతో విజ్ఞాపన దీక్షలు, లాంగ్‌మార్చ్ పేరిట ఆందోళనలు నిర్వహించారు. మంత్రులు విశ్వరూప్, చెల్లుబోయిన వేణు ఆధ్వర్యంలో ఎమ్మె ల్యేలు ముఖ్యమంత్రిని కలిసి అంబేడ్కర్ పేరు పెట్టాలని వినతిపత్రం ఇచ్చినప్పటికీ సీఎం స్పందించలేదు. దాంతో ఫైనల్ గెజిట్‌లో కోనసీమలో జిల్లాగా పేర్కొంటూ ఉత్తర్వులిచ్చారు. అయితే ముఖ్యమంత్రి ఈనెల 13వ తేదీన ఐ.పోలవరం మండలం మురమళ్లలో జరిగిన మత్స్యకార భరోసా కార్యక్రమానికి హాజరైన సందర్భంలో జిల్లా సాధనసమితి నాయకులు జంగా బాబూరావు, డీబీ లోక్, ఇసుకపట్ల రఘుబాబుతో సహా పలువురు సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి మంత్రి విశ్వరూప్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. దానిపై ఐదు రోజుల వ్యవధిలోనే ముఖ్యమంత్రి జగన్ స్పందించి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. 30 రోజులు గడువు ఇచ్చి అభ్యంతరాలు తెలపాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఆ రోజు నుంచి ఏ పేరు వద్దు.. కోనసీమ జిల్లా ముద్దంటూ వివిధ సామాజికవర్గాలవారు పేరు మార్పును వ్యతిరేకిస్తూ తొలుత సోషల్ మీడియా ద్వారా తీవ్ర స్థాయిలో ప్రచారోద్యమం చేశారు. ఆ తర్వాత గ్రామస్థాయిలో ఉద్యమాలు మొదలయ్యాయి. స్టేటస్లు పెట్టినవారిపైనా, పేరును వ్యతిరేకించే వారిపైనా కోనసీమ వ్యాప్తంగా పలుచోట్ల దాడులు కూడా జరిగాయి. ఈ నేపథ్యంలో పేరు మార్పును వ్యతిరేకిస్తూ కోనసీమ జేఏసీ పేరిట మరో ఉద్యమం మొదలైంది. అదే పేరును ఉంచాలని కోరుతూ వ్యక్తిగతంగా వినతిప త్రాలు ఇచ్చేందుకు గ్రామాల వారీగా ఆందోళనలు ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా మంగళవారం భారీ ప్రదర్శనగా వెళ్లి కలెక్టర్‌కు వినతిపత్రం అందించేందుకు పిలుపునిచ్చా రు. పోలీసులు ఈ ర్యాలీకి అనుమతి ఇవ్వకుండా భారీ భద్రత ఏర్పాటుచేసి అడుగడుగునా అడ్డగించడంతో ఉద్యమం అదుపు తప్పి విధ్వంసానికి కారణమైంది. ప్రశాంతంగా ఉండే కోనసీమ భగ్నమైంది. సామాజికవర్గాల వార్ ప్రారంభానికి జిల్లా పేరు మార్పే వేదికైంది.
ఎస్పీ సహా పలువురికి తీవ్రగాయాలు
అమలాపురం టౌన్, మే 24: ఏ పేరువద్దు.. కోనసీమ ముద్దు.. అంటూ చేపట్టిన ఆందోళన అదుపుతప్పి ఆందోళనకారులను అదుపుచేసిన పోలీసులపై రాళ్లవర్షం కురిపించారు. అమలాపురం కలెక్టరేట్ సమీపంలో ఆందోళనకారులు ఒక్కసారిగా రాళ్లవర్షం కురిపించడంతో ఎస్పీ కేఎస్ఎస్వీ సుబ్బారెడ్డి సహా పలువురు పోలీసులు గాయపడ్డారు. పోలీసు వాహనాలపై కూడా రాళ్లవర్షం కురిపించారు. ఈ ఘటనలో ఆరుగురు కానిస్టేబుళ్లు గాయపడ్డారు. వీరిని అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలించగా సూపరింటెండెంట్ డాక్టర్ కె.శంకరరావు ఆధ్వర్యంలో వైద్యసేవలందించారు. రాళ్లదాడిలో గాయపడ్డ ఎస్పీ సుబ్బారెడ్డి స్థానిక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. తలపై బలమైన గాయమవడంతో ఆసుపత్రి వైద్యులు వైద్యసేవలందించారు. ఆయా ఘటనల్లో ఒక బస్సు డ్రైవర్ సహా రవాణాశాఖమంత్రి పినిపే విశ్వరూప్ క్యాంపు కార్యాలయంలోని వంట మనిషికి గాయాలవడంతో వీరిని కూడా చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి అదుపులోనే ఉంది : డీఐజీ
అమలాపురం, మే 24 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో మంగళవారం జరిగిన విధ్వంసకర సంఘటనల అనంతర పరిస్థితులను ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రస్తుతం అమలాపురంలో పరిస్థితులన్నీ అదుపులోకి వచ్చినట్టు ప్రకటించారు. ముందుగా ఆందోళన కారుల దాడిలో గాయపడ్డ జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డితోపాటు గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులను పరామర్శించారు. బ్యాంకు కాలనీలోని మంత్రి విశ్వరూప్ నివాస గృహం, కిమ్స్ వద్ద ఇల్లు, హౌసింగ్ బోర్డుకాలనీ లోని ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ ఇళ్లకు నిప్పు పెట్టిన పరిస్థితులను పరిశీలించారు. కోనసీమలో పరిస్థితులు అదుపు తప్పకుండా భద్రతను కట్టుదిట్టం చేసేందుకు ఐదు జిల్లాలకు చెందిన అదనపు బలగాలను భారీగా అమలాపురం తరలిస్తున్నారు. విధ్వంసం సృష్టించిన ఆందోళనకారులను గుర్తించి వారందరిపై కేసులు నమోదు చేస్తామని పాలరాజు ప్రకటించారు.
ఎందుకిలా అయింది..?
జిల్లాల విభజనలో భాగంగా తూర్పుగోదావరి నుంచి కోనసీమ జిల్లాను ప్రభుత్వం ఏర్పా టుచేసింది. కానీ కోనసీమకు అంబేడ్కర్ జిల్లాగా నామకరణం చేయాలని మార్చి, ఏప్రిల్‌లో తీవ్రస్థాయిలో ఉద్యమాలు జరిగాయి. కానీ విభజన తర్వాత ప్రభుత్వం అంబేడ్కర్ జిల్లా పేరును పక్కనపెట్టి కేవలం కోనసీమ జిల్లాగానే అధికారికంగా కొనసాగించింది. దీనికి నిరస నగా కోనసీమ జిల్లావ్యాప్తంగా పలు దళిత సంఘాలు ఆందోళనలు చేపట్టాయి. మంత్రులు, ఎమ్మెల్యేల ముట్టడికి దిగాయి. దీంతో ఆందోళనలు, నిరసనలకు తలొగ్గిన ప్రభుత్వం కోన సీమ జిల్లాను బీఆర్ అంబేడ్కర్ జిల్లాగా పేరు మార్చుతూ ఈనెల 18న ప్రాథమిక నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో ఒక వర్గం సంబరాలు చేసుకోగా, మరో సామాజికవర్గం ఆందోళన లకు దిగింది. కోనసీమ జిల్లాగా మాత్రమే పేరు కొనసాగించాలంటూ ఉద్యమానికి సిద్ధమైం ది. అదే సమయంలో ఈనెల 19న తెల్లవారుజామున అయినవిల్లి మండలం శానపల్లి లంక గ్రామంలో స్థానిక ప్రజలు, కొందరు వైసీపీ నేతలు సీఎం జగన్‌కు వ్యతిరేకంగా ఆందోళన లకు దిగారు. జగన్ దిష్టిబొమ్మను దహనం చేసి శవయాత్ర నిర్వహించడం కలకలం రేపిం ది. తిరిగి ఈనెల 20న కోనసీమ జిల్లా పేరును కొనసాగించాలంటూ జేఏసీ నేతలు అమలా పురం కలెక్టరేట్ ముట్టడికి అయిదు వేల మంది వరకు తరలివచ్చారు. అదే సమయంలో పోలీసులు వీరిని నియంత్రించారు. అయినా పోలీసులను కాదని కలెక్టరేట్‌ను ముట్టడించా రు. దీంతో అప్పటి నుంచి కోన సీమ జిల్లా పేరు కొనసాగించా లంటూ ఆందోళనలు చేసేవారిని పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ లు చేయడం మొదలుపెట్టారు. జిల్లా పేరు కొనసాగించాలని కోరుతూ జేఏసీ మంగళవారం కలెక్టరేట్‌కు ర్యాలీ చేపట్టగా, అది ఇలా అదుపు తప్పింది.
అంచనా లేకపోవడం వల్లే..
జనసమీకరణపై స్పష్టత లేకపోవడం...
జిల్లాకు కొత్త అధికారులు కావడంతో అయోమయం
అమలాపురం, మే 24(ఆంధ్రజ్యోతి): పోలీసులకు సరైన అంచనా లేకపోవడం వల్లే పరిస్థితి తప్పినట్టుగా కనిపిస్తోంది. పోలీసు ఉన్నతాధికా రులకు కోనసీమ పరిస్థితుల పట్ల అవగాహన లేకపోవడం, స్థానిక అధి కారులకు ప్రజలతో సంబంధాలు కొరవడడంతోపాటు నిఘా వర్గాలు నిద్రావస్థలో ఉండడం వెరసి అమలాపురంలో మంగళవారం జరిగిన అల్లర్లకు పరోక్షంగా కారణమయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్తగా అమలాపురం కేంద్రంగా జిల్లా ఆవిర్భవించడంతో పోలీసు అధికా రులు వివిధ ప్రాంతాలకు చెందిన వారిని ఇక్కడ నియమించారు. గతంలో కోనసీమ ఉద్యమాలు, వాటి విధ్వంసకర చరిత్రను అవగాహన చేసుకోలేకపోయారు. చాలామంది పోలీసు అధికారులకు కోనసీమ పూ ర్వపు పరిస్థితులపై అవగాహన లేదు. దీనికితోడు గ్రామీణ ప్రాంతాల్లో ఏం జరుగుతుందనే నిఘా సమాచారం కొంతమంది ఐడీ పార్టీ సిబ్బంది కి అవగాహన ఉన్నప్పటికీ వారి నుంచి ఫీడ్‌బ్యాక్ రాబట్టుకోవడంలో పోలీసులు పెద్దగా దృష్టి సారించలేదు. వీటన్నింటి పర్యవసానమే అమ లాపురంలో ఆందోళనల తీవ్రతకు పరోక్షంగా కారణమయ్యారు. ఉద్యమ కారులు మధ్యాహ్నం 3 గంటలకు గడియార స్తంభం సెంటర్ నుంచి ర్యాలీ ప్రారంభించి కలెక్టరేట్‌కు శాంతియుతంగా వెళతామని ప్రకటిం చారు. అయితే ఎట్టిపరిస్థితుల్లోను ర్యాలీ జరగకూడదనే ఉద్దేశంతో పోలీసులు 500 మందితో భారీ భద్రత ఏర్పాటుచేసి పట్టణాన్ని జల్లెడ పట్టారు. అయితే పోలీసులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంలో వైఫల్యం చెందారు. అమలాపురం పట్టణ పరిసరాల్లో ఉన్న మూడు ఇంజనీరింగ్ కళాశాలలకు ముందస్తు సెలవు ప్రకటింప చేయాలి. కానీ కళాశాలలు యథావిధిగా పనిచేశాయి. ఎక్కడెక్కడ ఆందోళనకారులు సంఘటితమ వుతున్నారనే సమాచారంపై పోలీసులకు స్పష్టత లేదు. కొద్దిమందిని అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించడంపైనే దృష్టి పెట్టారు తప్ప భారీ మొబలైజేషన్ అవుతున్న ప్రాంతాలపై వారికి అవగాహన లేకపో వడంతో పట్టించుకోలేదు. సరిగ్గా ప్రకటించిన సమయానికే ఆందోళన కారులు వివిధ మార్గాల గుండా రోడ్డెక్కి సినిమా ఫక్కీలో వేలాదిగా ర్యాలీ చేశారు. జనసమీకరణ ప్రాంతాలను విస్మరించడం వల్లే నిరసన ర్యాలీకి భారీగా ప్రజలు సమీకృతలయ్యారు. నిఘా వైఫల్యం అడుగడు గునా కనిపించింది. ముందుగా వ్యాపార సంస్థలను మూయించి వేసిన ప్పటికీ సమీప ప్రాంతాల పరిస్థితులను అంచనా వేయడంతో వైఫల్యం చెందారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసుల మధ్య సమన్వయ లోపం కొంత తలెత్తింది. దీనికితోడు ఉద్యమకారులతో ఉన్నతాధికారులు ముందస్తు సమావేశం నిర్వహించి వారికి తగు సూచనలుగాని, హెచ్చరికలుగాని చేస్తే పరిస్థితి కొంత అదుపులో ఉండేదని భావిస్తున్నారు.
ఇంటిలిజెన్స్ వర్గాల వైఫల్యంపై జేఏసీ ఆగ్రహం
- మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే సతీష్ ఇళ్లపై దాడులకు ఖండన
అమలాపురం టౌన్, మే 24: దళితమంత్రి పినిపే విశ్వరూప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌కుమార్ ఇళ్లపై దాడిచేసి ఆస్తులను తగలపెట్టడం అత్యంత హేయమైన చర్య అని అంబేడ్కర్ జిల్లా సాధన సమితి అత్యవసర సమావేశం పేర్కొంది. మంగళవారం ఈదరపల్లి అంబేడ్కర్ కమ్యూనిటీ హాలులో సమితి చైర్మన్ డీబీ లోక్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. అన్ని రాజకీయ పార్టీలు, అన్నివర్గాల ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చిందని, ఎవరికైనా అభ్యంతరాలుంటే శాంతియుతంగా తెలపాలన్నారు. ప్రశాంతమైన అమలాపురంలో వర్గాల మధ్య చిచ్చుపెట్టేందుకు కొంతమంది సంఘవిద్రోహశక్తులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అల్లర్లను ప్రోత్సహించేవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. మంగళవారం జరిగిన దాడులు ఇంటిలిజెన్స్వర్గాల వైఫల్యమని జేఏసీ ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు.