Advertisement

న్యాయంపైనే సమరం!

Oct 11 2020 @ 00:51AM

న్యాయవ్యవస్థ అన్యాయంగా వ్యవహరిస్తోందని ప్రజలను నమ్మించడానికే జగన్‌ అండ్‌ కో న్యాయవ్యవస్థపై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధపడ్డారు. ఇందులో ఇంకో మర్మం కూడా ఉంది. రేపో మాపో అవినీతి కేసులలో జగన్‌రెడ్డికి శిక్ష పడితే– ‘‘చూశారా మేం చెబుతున్నట్టుగానే మా ముఖ్యమంత్రిని అన్యాయంగా జైలుకు పంపారు’’ అని వైసీపీ నాయకులు ప్రచారం చేసుకోవచ్చు. నిజానికి ఇదే అసలు లక్ష్యం! తాను చేసిన తప్పులేమిటో మన కంటే జగన్మోహన్‌రెడ్డ్డికే ఎక్కువ తెలుసు! అందుకే సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్లలో తనకు శిక్ష పడటం ఖాయమని ఆయన భావిస్తున్నట్టు అనిపిస్తోంది. అయినా ప్రజలు, తాను అవినీతికి పాల్పడినట్టు నిర్ధారణకు రాకుండా ఉండటానికై న్యాయ వ్యవస్థతో ఘర్షణకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని టార్గెట్‌ చేసుకున్నారు. తెలుగువాడైన ఆ న్యాయమూర్తి మరో ఆరు నెలల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావలసి ఉంది. ఈ దశలో ఆయనను టార్గెట్‌గా చేసుకుంటే, ప్రధాన న్యాయమూర్తి కాకుండా అడ్డుకోవచ్చన్నది జగన్‌రెడ్డి వ్యూహంగా ఉంది.


అవినీతి కేసులలో జైలుకెళ్లి, సుప్రీంకోర్టులో లభించిన బెయిల్‌ పుణ్యమా అని ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అయిన జగన్‌రెడ్డి, న్యాయవ్యవస్థనే సవాల్‌ చేయగలగడం భారతదేశ న్యాయ వ్యవస్థ చరిత్రలో ఇదే ప్రథమం. ఈ సవాళ్లను, విషమ పరిస్థితిని తట్టుకుని న్యాయవ్యవస్థ నిలబడగలదా? లేదా? అన్నది కాలమే నిర్ణయిస్తుంది. కేంద్రంలోని పెద్దలు ఈ విషయంలో ఎటువంటి పాత్ర పోషించబోతున్నారన్నది కూడా తేలాల్సి ఉంది. పలు అవినీతి కేసులలో ప్రథమ ముద్దాయిగా ఉన్న వ్యక్తి చేతిలో న్యాయం భంగపడితే చరిత్రలోనే అదొక విషాదం అవుతుంది. అదే జరిగితే న్యాయవ్యవస్థతో నేరస్థులు ఆడుకుంటారు!


ప్రజల దృష్టిని మళ్లించడం చేతకానివాడు నిఖార్సైన రాజకీయ నాయకుడిగా రాణించలేడు. తమ మనసులో ఉన్నది బయటకు తెలియకుండా ఉండటం కోసం  అనుములు తింటూ మినుములు తింటున్నామని చెబుతుంటారు. అమాయక ప్రజలు నిజమే కాబోలు అని నమ్మేస్తారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డ్డి తాజా ఢిల్లీ పర్యటన ఈ కోవలోకే వస్తుంది. తాను ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎందుకు కలిశారో ఆయన అధికారికంగా ఏమీ చెప్పలేదు. అయితే ఎన్డీఏ ప్రభుత్వంలో చేరాల్సిందిగా ప్రధానమంత్రి నుంచి ఆహ్వానం అందినట్టుగా లీకులు మాత్రం ఇప్పించారు. వైసీపీకి రెండు మంత్రి పదవులను ప్రధాని ఆఫర్‌ చేశారనీ, అయితే రాష్ర్టానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి అంగికరిస్తేనే తాము కేంద్రప్రభుత్వంలో చేరుతామని జగన్మోహన్‌రెడ్డ్డి షరతు విధించినట్టుగా ఒకటి, రెండు ఆంగ్ల పత్రికలు, కొన్ని స్థానిక చానెళ్లలో ప్రచారం చేయించుకున్నారు. నిజానికి ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదు. ఎన్డీఏలో చేరాల్సిందిగా నరేంద్ర మోదీ కోరిందీ లేదు. ప్రత్యేక హోదాతో ఆ అంశాన్ని ముడిపెట్టిందీ లేదు. అయినా ఈ ప్రచారం ఎందుకు చేయించుకున్నారంటే, ప్రజల దృష్టిని మళ్లించడానికే! ప్రధానితో ముఖ్యమంత్రి ఒక్కరే సమావేశమయ్యారు. ప్రధానితో ఏమి చర్చించిందీ జగన్‌రెడ్డి తన వెంట ప్రధాని నివాసం వరకు వచ్చినవారికి కూడా చెప్పలేదు. అయినా ఆయన కోరుకున్నట్టుగానే కొన్ని మీడియా సంస్థలు వార్తలు వండి వార్చాయి. కేంద్రప్రభుత్వంతో జగన్మోహన్‌రెడ్డ్డికి ఎన్నికల ముందు నుంచీ అవగాహన ఉంది. ఒక ప్లాన్‌ ప్రకారం తెలుగుదేశం పార్టీకి–బీజేపీకి మధ్య సంబంధాలు చెడిపోయేలా చేశారు. ఆ తర్వాత నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వానికి తమ సంపూర్ణ సహకారం ఉంటుందని జగన్‌ హామీ ఇచ్చారు. అంతేగానీ వైసీపీ కేంద్రంలో అధికారం పంచుకునే విషయమై ఏ దశలో కూడా ప్రస్తావనకు రాలేదు.


లోక్‌సభలో బీజేపీకి కావలసినంత మెజారిటీ కూడా ఉంది. రాజ్యసభలో మాత్రం కీలకమైన బిల్లులకు ఆమోదం పొందాలంటే కేంద్రప్రభుత్వానికి ప్రస్తుతానికి జగన్‌రెడ్డి సహకారం అవసరం. ఈ మేరకు ఉభయపక్షాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకు వెళుతున్నాయి. ఇందుకు భిన్నంగా బీజేపీతో నేరుగా చేతులు కలిపితే జగన్మోహన్‌రెడ్డ్డికి రాజకీయంగా నష్టమే తప్ప లాభం ఉండదు. బీజేపీ కోణం నుంచి చూస్తే రాష్ట్రంలో చంద్రబాబు బలపడకూడదు. అదే సమయంలో ముఖ్యమంత్రి జగన్‌ తమ చెప్పుచేతల్లో ఉండాలని ఆ పార్టీ కోరుకుంటోంది. ఈ కారణంగా ఉభయపక్షాలు నేరుగా చేతులు కలిపే అవకాశమే లేదు. బీజేపీ పంచన చేరితే తమకు అండగా ఉంటున్న ముస్లింలు, క్రైస్తవులు దూరమవుతారన్న విషయం తెలియని అమాయకుడేమీ కాదు జగన్‌రెడ్డి! కేంద్రంతో సఖ్యతగా మెలగాల్సిన అవసరం జగన్‌కు ఎక్కువగా ఉంది. తనపై ఉన్న అవినీతి కేసుల నుంచి ఉపశమనం పొందడానికి కేంద్ర పెద్దలు సహకరిస్తారేమోనన్న ఆశతో వారి వద్ద విధేయుడిగా ఉంటున్నారు. గతంలో 16 నెలలపాటు జైలులో ఉన్నప్పుడు బెయిల్‌ పొందడానికై అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వ సహకారాన్ని కూడా జగన్‌ అండ్‌ కో పొందారు. జగన్‌రెడ్డి కుటుంబ సభ్యులు కాంగ్రెస్‌ నాయకుడు అహ్మద్‌ పటేల్‌ను కలిసి జగన్‌కు బెయిల్‌ ఇప్పించవలసిందిగా కోరినట్టుగా విస్తృతంగా ప్రచారం జరిగింది. ఈ సందర్భంగా ఏ హామీ లభించిందో తెలియదు గానీ, బెయిల్‌ లభించే విషయంలో ఆనాటి కేంద్ర పెద్దలు సహాయం మాత్రం చేశారు. ఇప్పుడు ఆనాటి కేసులన్నీ తుది విచారణకు వచ్చాయి. ఈ దశలో కేంద్ర సహకారం మళ్లీ జగన్మోహన్‌రెడ్డ్డికి కావలసి వచ్చింది.


కేసుల నుంచి నిర్దోషిగా బయటపడటానికి మోదీ–షా ద్వయం పూర్తిగా సహకరిస్తారన్న నమ్మకం లేకపోయినా, ఆశలు వదులుకోని జగన్‌ అండ్‌ కో కేంద్ర పెద్దలతో సన్నిహితంగా మెలిగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కారణంగానే ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా గురించి కలవరిస్తూ ప్రజలను.. ముఖ్యంగా యువతను రెచ్చగొట్టిన జగన్మోహన్‌రెడ్డ్డి ఇప్పుడు ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి హోదాలో కలుస్తున్నప్పటికీ ఆ విషయాన్ని ప్రస్తావించడం లేదు. రాష్ర్టాభివృద్ధి, నిధుల కేటాయింపు వంటి విషయాల గురించి ఆయన ప్రధానమంత్రితో చర్చించినట్టు లీకులు ఇస్తున్నారు గానీ, అందులో నిజం లేదు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని ప్రారంభంలోనే కేంద్ర పెద్దలు మన ముఖ్యమంత్రికి స్పష్టంచేశారు. అంతేకాదు తనను కలిసినప్పుడల్లా రాష్ర్టానికి అది కావాలి– ఇది కావాలి అని కోరడం, అదనపు నిధులు ఇవ్వాలని అడగడం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇష్టం ఉండదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది కావాలి– ఇది కావాలి, అదనపు నిధులు అని అడగడంపై నరేంద్ర మోదీ తెలుగుదేశం పార్టీ ముఖ్యుల వద్ద చిరాకుపడ్డారు. బహుశా ఈ విషయాలు తెలుసు కనుకే జగన్మోహన్‌రెడ్డ్డి రాష్ట్ర సమస్యలు, కోర్కెల చిట్టా గురించి ప్రధాని వద్ద పెద్దగా ప్రస్తావించరు. ప్రధానితో జరిగిన సమావేశం వివరాలను ఆయన అధికారికంగా ఎప్పుడూ విడుదల చేయరు. తన సొంత పత్రికకు మాత్రం తనకు అనుకూలంగా లీకులు ఇస్తారు. తాజా పర్యటన సందర్భంగా కూడా ప్రధానితో న్యాయపరమైన అంశాన్ని చర్చించినట్టుగా జగన్‌ పత్రికలో ప్రచురించారు. ప్రత్యేక హోదా, నిధుల ఊసు గురించి ఆ పత్రికలో ప్రచురించలేదు. అనుకూల మీడియాలో మాత్రం ఇందుకు విరుద్ధంగా.. కోరుకున్న విధంగా అనుకూల ప్రచారం చేయించుకున్నారు. దీన్నిబట్టి ప్రధానితో జరిగిన సమావేశంలో జగన్‌రెడ్డి మిషన్‌ వేరే ఉందని స్పష్టమవుతోంది కదా!


ఎన్నికలపై నాడలా.. నేడిలా!

జగన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలోని చిదంబర రహస్యం ఏమై ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ప్రధానితో సమావేశం కావడానికి ముందే కేంద్ర మంత్రి అమిత్‌ షా ఆయనను ఢిల్లీ పిలిపించుకుని న్యాయ వ్యవస్థతో చెలగాటం వద్దని హెచ్చరించినట్టు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ప్రధానితో జరిగిన సమావేశాన్ని చూడాల్సి ఉంటుంది. న్యాయ వ్యవస్థపై ఫిర్యాదు చేయడానికే జగన్‌రెడ్డి ప్రధానిని కలిసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. హైకోర్టు తనను ఇబ్బందులపాలు చేస్తున్నదని, అడుగడుగునా ప్రభుత్వానికి ఇరకాటం కలిగిస్తోందని, ఇందుకు కారణం సుప్రీంకోర్టులో ఉన్న ఒక న్యాయమూర్తి అని జగన్‌ అండ్‌ కో ఢిల్లీలో విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలోనే జగన్‌ రెడ్డి ప్రధానిని కూడా కలిసి ఫిర్యాదు చేసి ఉంటారు. రాష్ట్ర హైకోర్టు నిజంగానే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రోత్సాహంతోనే జగన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తోందా? అన్న విషయం ఇప్పుడు చూద్దాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చినవారిలో ఇద్దరు ఉత్తరాదికి చెందినవారు. ఇందులో ఒకరైన జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ బిహార్‌కు చెందినవారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు బదిలీపై రావడానికి ముందు ఆయన బిహార్‌ హైకోర్టు న్యాయమూర్తిగా పని చేశారు. అప్పుడు ఆయన ఒక కేసులో అదే హైకోర్టుకు చెందిన పది మంది న్యాయమూర్తులపై విచారణకు ఆదేశించారు. దీన్నిబట్టి ఆయన క్యారెక్టర్‌ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ ఏడాది డిసెంబరు నెలాఖరున జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ పదవీ విరమణ చేయబోతున్నారు. అయినా ఆయన తీర్పుల విషయంలో రాజీ లేకుండా ముక్కుసూటిగా వ్యవహరిస్తున్నారు. ఇక్కడ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. హైకోర్టు న్యాయమూర్తులు సుప్రీంకోర్టుకు సబార్డినేట్స్‌ కారు. వారు పూర్తి స్వతంత్రంగా వ్యవహరిస్తారు. హైకోర్టు తీర్పులపై అభ్యంతరాలు ఉంటే సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులిచ్చిన న్యాయమూర్తులను కించపరుస్తూ వైసీపీకి చెందినవారు సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టింగ్స్‌ పెట్టారు. దీంతో ప్రభుత్వానికి, హైకోర్టుకు మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. ఈ పోస్టింగ్స్‌పై రిజిస్ర్టార్‌ జనరల్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కోర్టు ధిక్కరణ కింద హైకోర్టు ప్రస్తుతం విచారణ జరుపుతోంది.


ఫలానా వారు న్యాయమూర్తులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేసినా సిఐడి అధికారులు కనీస చర్యలు తీసుకోవడం లేదు. దీనిపై ఆగ్రహం చెందిన జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లా అమలు కావడం లేదనీ, ఇంతటి అధ్వాన్న పరిస్థితులు దేశంలో మరే రాష్ట్రంలో కూడా లేవనీ వ్యాఖ్యానించారు. అంతకుముందు మరో సందర్భంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు తీవ్ర వ్యాఖలు చేసింది. దీనిపై ప్రభుత్వ సలహాదారుడైన సజ్జల రామకృష్ణారెడ్డి అభ్యంతరం చెప్పారు. హైకోర్టు ఏ వ్యాఖ్యలు చేసినా వాటిని తీర్పులో భాగంగా చేయాలని ఆయన కోరారు. కేసుల విచారణ సందర్భంగా వివిధ కోర్టులలో న్యాయమూర్తులు వ్యాఖ్యలు చేయడం సర్వసాధారణం. ఇదేదో ఇప్పుడే జరుగుతున్నది కాదు. పలు సందర్భాలలో న్యాయమూర్తులు విచారణ సందర్భంగా చేసే వ్యాఖ్యలకు, తుది తీర్పులకు పొంతన ఉండదు. సజ్జల రామకృష్ణారెడ్డి వ్యక్తంచేసిన అభ్యంతరాన్ని దృష్టిలో ఉంచుకుని కాబోలు జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ రెండు రోజుల క్రితం ‘‘వ్యాఖ్యలు చేసే అధికారం తమకు ఉంది’’ అని స్పష్టంచేశారు. ‘‘మా తీర్పులపై అభ్యంతరాలు ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్లండి’’ అని కూడా ఆయన సూచించారు. అయినా సజ్జల రామకృష్ణారెడ్డి తన ఆక్షేపణను మళ్లీ ట్విట్టర్‌ ద్వారా వ్యక్తంచేశారు. దీన్నిబట్టి న్యాయ వ్యవస్థతో ప్రత్యక్ష పోరాటానికి జగన్‌రెడ్డి ప్రభుత్వం కాలుదువ్వుతున్నట్టు స్పష్టమవుతోంది. న్యాయమూర్తులు నిజంగానే పరిధి అతిక్రమించి వ్యవహరిస్తున్నారా? లేక రాష్ట్ర ప్రభుత్వమే అహంకారపూరితంగా నిర్ణయాలు తీసుకుంటోందా? అనే విషయం ఇప్పుడు పరిశీలిద్దాం.


కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రారంభదశలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ వాయిదా వేశారు. అప్పట్లో దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. కరోనా వైరస్‌ కాదు– కమ్మ వైరస్‌ అని స్పీకర్‌ స్థానంలో ఉన్న తమ్మినేని సీతారాం సైతం వ్యాఖ్యానించారు. ఎన్నికలు వాయిదా వేయడంపై ఆగ్రహించిన జగన్‌ ప్రభుత్వం హడావుడిగా ఆర్డినెన్స్‌ జారీ చేసి మరీ రమేశ్‌ కుమార్‌ను ఆ పదవి నుంచి తొలగించి, తమిళనాడుకు చెందిన జస్టిస్‌ కనగరాజ్‌ను ఎన్నికల కమిషనర్‌గా నియమించింది. సుప్రీంకోర్టు వరకు వెళ్లిన ఈ కేసులో రమేశ్‌కుమార్‌ అంతిమ విజయం సాధించి తిరిగి తన పదవిని పొందారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపాలంటూ దాఖలైన పిటిషన్‌ శుక్రవారం హైకోర్టులో విచారణకు రాగా.. కరోనా వైరస్‌ కారణంగా ఇప్పుడు ఎన్నికలు జరపలేమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. దీనిపై ధర్మాసనం సహజంగానే అభ్యంతరం వ్యక్తంచేసింది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. పొరుగున ఉన్న తెలంగాణలో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరుగుతోంది. హైదరాబాద్‌ నగర పాలక సంస్థకు డిసెంబరు మొదటి వారంలో ఎన్నికలు జరుపుతామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి ప్రకటించారు. ఇవే అంశాలను హైకోర్టు ధర్మాసనం కూడా ప్రశ్నించింది. గతంలో వైరస్‌ లేదు.. ఏమీ లేదు.. ఎన్నికలు వాయిదా వేయడం అన్యాయం అని విమర్శించిన ప్రభుత్వం, ఇప్పుడు దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నప్పటికీ కరోనా సాకు చెప్పడం ఆక్షేపణీయం కాదా? ఇలా చెప్పుకొంటూ పోతే ఎన్నో ఉదాహరణలు. హైకోర్టు న్యాయమూర్తులు కూడా స్వతంత్రంగా వ్యవహరించకూడదు, తాము అందజేసే స్ర్కిప్టులు చదువుతున్న మంత్రులు, శాసనసభ్యుల మాదిరిగానే న్యాయమూర్తులు కూడా తాము రాసిచ్చిన తీర్పులనే చదవాలి అని సజ్జల రామకృష్ణారెడ్డి వంటి వారు కోరుకుంటున్నారేమో తెలియదు.


అందుకే ఢీ!

అయినా గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా రాష్ట్రప్రభుత్వం ఎందుకు తెచ్చుకుంటోంది? అంటే– అందులో కూడా ఒక పరమార్థం దాగి ఉంది. ప్రజలకు మేలు చేద్దామనుకుంటే న్యాయస్థానాలు అడ్డుపడుతున్నాయని చెప్పుకొంటూ బతికేయొచ్చు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇద్దామనుకుంటే అడ్డుకుంటున్నదని ఆరోపించడం ఈ కోవలోకే వస్తుంది. సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో హైకోర్టు తీర్పును తప్పుబట్టలేదు. న్యాయ వ్యవస్థ అన్యాయంగా వ్యవహరిస్తోందని ప్రజలను నమ్మించడానికే జగన్‌ అండ్‌ కో న్యాయ వ్యవస్థపై ప్రత్యక్ష పోరాటానికి సిద్ధపడ్డారు. ఇందులో ఇంకో మర్మం కూడా ఉంది. రేపో మాపో అవినీతి కేసులలో జగన్‌రెడ్డికి శిక్ష పడితే– ‘‘చూశారా మేం చెబుతున్నట్టుగానే మా ముఖ్యమంత్రిని అన్యాయంగా జైలుకు పంపారు’’ అని వైసీపీ నాయకులు ప్రచారం చేసుకోవచ్చు. నిజానికి ఇదే అసలు లక్ష్యం! తాను చేసిన తప్పులేమిటో మన కంటే జగన్మోహన్‌రెడ్డ్డికే ఎక్కువ తెలుసు! అందుకే సిబిఐ దాఖలు చేసిన చార్జిషీట్లలో తనకు శిక్ష పడటం ఖాయమని ఆయన భావిస్తున్నట్టు అనిపిస్తోంది. అయినా ప్రజలు, తాను అవినీతికి పాల్పడినట్టు నిర్ధారణకు రాకుండా ఉండటానికై న్యాయ వ్యవస్థతో ఘర్షణకు దిగుతున్నారు. ప్రజలను మభ్యపెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని టార్గెట్‌ చేసుకున్నారు. తెలుగువాడైన ఆ న్యాయమూర్తి మరో ఆరు నెలల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కావలసి ఉంది.


ఈ దశలో ఆయనను టార్గెట్‌గా చేసుకుంటే, ప్రధాన న్యాయమూర్తి కాకుండా అడ్డుకోవచ్చన్నది జగన్‌రెడ్డి వ్యూహంగా ఉంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొంతకాలం క్రితం పదవీ విరమణ చేసిన మరో తెలుగువాడు ఈ విషయంలో జగన్‌కు తన సహాయ సహకారాలు అందిస్తున్నారని అధికార పార్టీ నాయకులు బాహాటంగానే చెబుతున్నారు. సుప్రీంకోర్టులో పని చేసిన, చేస్తున్న ఇద్దరు తెలుగువాళ్ల మధ్య ఏర్పడిన వివాదాన్ని జగన్మోహన్‌రెడ్డ్డి తనకు అనుకూలంగా మలచుకుంటున్నారు. రాజకీయ నాయకులపై నమోదైన అవినీతి కేసులలో విచారణ ఏడాదిలోపు పూర్తికావాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేయడానికి ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశమున్న ప్రస్తుత న్యాయమూర్తే కారణమని జగన్‌రెడ్డి బలంగా నమ్ముతున్నారు. చంద్రబాబుకు మేలు చేయడం కోసం అవినీతి కేసులలో తనను శిక్షించబోతున్నారని ముఖ్యమంత్రి దాదాపుగా నిర్ధారణకు వచ్చారు. ఈ కారణంగానే తాను జైలుకు వెళితే తన భార్య శ్రీమతి భారతిని ముఖ్యమంత్రిని చేస్తానని ఆయన తన సన్నిహితులకు హింట్‌ ఇస్తున్నారు. అదే సమయంలో తనకు శిక్ష పడితే ప్రజల్లో మళ్లీ సానుభూతి పెల్లుబకాలని జగన్‌ కోరుకుంటున్నారు. దానివల్ల తదుపరి జరిగే ఎన్నికలలో కూడా తన పార్టీనే గెలిచి తన భార్య మళ్లీ ముఖ్యమంత్రి అవుతారన్నది జగన్‌ వ్యూహంగా చెబుతున్నారు.


దీన్నిబట్టి జగన్‌రెడ్డి ఆషామాషీగా న్యాయ వ్యవస్థతో గొడవ పడటం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ప్రధానమంత్రిని కలిసి న్యాయవ్యవస్థపై ఫిర్యాదు చేయడంతోపాటు తనకు అండగా నిలవాల్సిందిగా ప్రధానమంత్రిని కోరారని ఢిల్లీ వర్గాల భోగట్టా. రానున్న రోజులలో న్యాయవ్యవస్థతో ఘర్షణ మరింత ముదిరే అవకాశం ఉందని ఇది సూచిస్తోంది. ఈ మర్మాలన్నింటి గురించి తెలియనివారు జగన్మోహన్‌రెడ్డ్డి అనవసరంగా న్యాయవ్యవస్థతో పెట్టుకుంటున్నారని భావిస్తున్నారు. అయితే, ఈ ఆటుపోట్లు అన్నింటిని తట్టుకుని న్యాయవ్యవస్థ నిలబడుతుందా? లేదా జగన్‌రెడ్డిదే పైచేయి అవుతుందా? అనేది తేలాలంటే ఇంకొన్ని మాసాలు వేచి చూడాలి. అవినీతి కేసులలో జైలుకెళ్లి, సుప్రీంకోర్టులో లభించిన బెయిల్‌ పుణ్యమా అని ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అయిన జగన్‌రెడ్డి, న్యాయవ్యవస్థనే సవాల్‌ చేయగలగడం భారతదేశ న్యాయ వ్యవస్థ చరిత్రలో ఇదే ప్రథమం. ఈ సవాళ్లను, విషమ పరిస్థితిని తట్టుకుని న్యాయవ్యవస్థ నిలబడగలదా? లేదా? అన్నది కాలమే నిర్ణయిస్తుంది. కేంద్రంలోని పెద్దలు ఈ విషయంలో ఎటువంటి పాత్ర పోషించబోతున్నారన్నది కూడా తేలాల్సి ఉంది. పలు అవినీతి కేసులలో ప్రథమ ముద్దాయిగా ఉన్న వ్యక్తి చేతిలో న్యాయం భంగపడితే చరిత్రలోనే అదొక విషాదం అవుతుంది. అదే జరిగితే న్యాయవ్యవస్థతో నేరస్థులు ఆడుకుంటారు!

ఆర్కే


 

యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.