ప్రత్యేక హోదా కోసం పోరాడండి

ABN , First Publish Date - 2022-07-21T10:30:03+05:30 IST

ప్రత్యేక హోదా కోసం పోరాడాలని, లేనిపక్షంలో కేంద్రం ఏంచేస్తుందో దాన్ని సాధించాలని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సూచించారు.

ప్రత్యేక హోదా కోసం పోరాడండి

లేదా కేంద్రం ఇచ్చేది సాధించండి

విపక్ష నేతగా నాటి ఆవేశం ఏది?

హామీఇచ్చి జనాన్ని ముంచేశారు

ఆనాడు బాబు భయపడ్డారన్నారు

32 కేసులున్న జగన్‌ గురించి ఏమనాలి?

175కాదు..13 సీట్లే ఈసారి వస్తాయేమో..

ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు


న్యూఢిల్లీ జూలై 20 (ఆంధ్రజ్యోతి) : ప్రత్యేక హోదా కోసం పోరాడాలని, లేనిపక్షంలో కేంద్రం ఏంచేస్తుందో దాన్ని సాధించాలని నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సూచించారు. ప్రత్యేక హోదా సాధనపై ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఉన్న ఆవేశం ఇప్పుడు ఏమైందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను ఆయన ప్రశ్నించారు. బుధవారం ఢిల్లీలో విలేకరులతో ఆయన మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికల ముందు, హోదా గురించి చేతులు కట్టుకోనైన అడగవచ్చు కదా అని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు కేసులకు భయపడి చేతులు కట్టుకొని, నాడు హోదాను తాకట్టు పెట్టారని చెప్పిన జగన్మోహన్‌రెడ్డి, ఇప్పుడు ఎందుకు నోరు విప్పడం లేదని నిలదీశారు. అసలు కేసులే లేని చంద్రబాబు వాటికి భయపడి హోదాను  తాకట్టు పెడితే, 32 ఆర్థిక నేరాల కేసుల అభియోగాలను ఎదుర్కొంటున్న జగన్మోహన్‌ రెడ్డి వాటికి భయపడి నోరు విప్పడం లేదని ప్రజలు అనుకునే అవకాశం లేదా? అని ప్రశ్నించారు. ‘‘హోదా తీసుకువస్తాడని నమ్మి ఓట్లు వేసిన ప్రజలను జగన్‌ నడి సముద్రంలో ముంచారు. పార్లమెంట్లో గాంధీ బొమ్మ వద్ద అందరూ తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు చేస్తుంటారు. కానీ, మా పార్టీ వారు ఎప్పుడూ ఆందోళనలు చేసిన దాఖలాలు లేవు. కేవలం ఒకే ఒక్కసారి నాపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఆందోళన చేశారు’’ అని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా గురించి తమ పార్టీ నాయకత్వం పోరాడకపోయినా, యుద్థం చేసినట్లు అభినయించడం కూడా లేదని అపహాస్యం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొందన్నారు. గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి... 2021 డిసెంబరు నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన వీడియోను ఈ సందర్భంగా ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వం 2024 జూలై నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందని పేర్కొంటే, రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు మాత్రం ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పోలవరం ఇప్పట్లో పూర్తి కాదని గతంలోనే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ పేర్కొన్నారని గుర్తు చేశారు. ‘‘కాంట్రాక్టర్లకు, పోలవరం ప్రాజెక్టు అథారిటీకి (పీపీఏ) మధ్య అసలు సమన్వయమే కనిపించడం లేదు. పోలవరం ప్రాజెక్టు పనులకు సంబంధించి రూ. 20,080 కోట్ల బిల్లులు పెండింగ్‌ ఉన్నాయని, రూ.6వేల కోట్లు అడ్వాన్స్‌ గా ఇవ్వాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహార శైలి తెలిసిన కేంద్రం.. ఆ నిధుల మంజూరుకు సుముఖంగా లేదు. ఆదాయాన్ని సమకూర్చుకోకుండా, అప్పులు చేేస్త శ్రీలంక దారిలో పయనించక తప్పదని జయశంకర్‌ ఏర్పాటుచేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో హెచ్చరించింది. అప్పులు చేసి బటన్‌ నొక్కుతూ, జగన్‌ పత్రికకు వాణిజ్య ప్రకటనలు ఇవ్వడం విడ్డూరంగా ఉంది. 


పార్టీ వీడలేదు.. చక్కదిద్దుతున్నా..

ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలను ఎత్తిచూపారని సభ్యుడిపై అనర్హతవేటు వేేస అవకాశాలు లేవని, అదే పార్టీకి రాజీనామా చేసి ప్రశ్నిేస్త అనర్హత కిందకు వస్తుందని ప్రముఖ న్యాయవాది హరీశ్‌ సాల్వే చేసిన వాదనల ప్రతిని ప్రభుత్వ పెద్దలు తెప్పించుకోని చదవాలని రఘురామ సూచించారు. తాను పార్టీ వీడలేదని, బలహీన పడుతున్న తన పార్టీని చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నానన్నారు. ముఖ్యమంత్రి పాల్గొన్న ఒంగోలు సభ ను చూసి పార్టీ శ్రేణులు నిరాశ చెందాల్సిన పనిలేదని, భవిష్యత్తులో ఇటువంటి సభలను మరిన్ని చూడాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ‘‘తన గ్రాఫ్‌ మాత్రమే బాగుందని, ఎమ్మెల్యేల గ్రాఫ్‌ బాగాలేదన్న ముఖ్యమంత్రి ముందుగా ఆత్మ విమర్శ చేసుకోవాలి. రానున్న ఎన్నికల్లో 175 స్థానాలు గెలుస్తాం అంటున్నారు.. అయితే మొత్తం 13 స్థానాలకు పరిమితం అవుతామేమోనని అనుమానంగా ఉంది. టీడీపీ నేత పట్టాభికి 41ఏ కింద నోటీసులు జారీ చేయడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. వరద బాధితులకు నాలుగంటే నాలుగు బంగాళాదుంపలు, టమాటాలు, వంకాయలను ఇచ్చి చేతులు దులుపుకున్నారని రఘురామ ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-07-21T10:30:03+05:30 IST