పోడు రైతులకు పట్టాలు ఇచ్చేంత వరకు పోరాటం

ABN , First Publish Date - 2021-07-30T04:17:40+05:30 IST

పోడు వ్యవసా యం చేసుకుంటున్న గిరిజనులకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేణ శంకర్‌, పట్టణ కార్యదర్శి ఖలిందర్‌ఖాన్‌, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసులు పేర్కొన్నారు. గురువారం సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గిరిజనులపై దాడులు పెరిగాయన్నారు.

పోడు రైతులకు పట్టాలు ఇచ్చేంత వరకు పోరాటం
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేణ శంకర్‌

పోడు యాత్రతో ప్రభుత్వంపై తిరుగుబాటు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు శంకర్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, జూలై 29: పోడు వ్యవసా యం చేసుకుంటున్న గిరిజనులకు ప్రభుత్వం పట్టాలు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేణ శంకర్‌, పట్టణ కార్యదర్శి ఖలిందర్‌ఖాన్‌, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేకల దాసులు పేర్కొన్నారు. గురువారం సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతు  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గిరిజనులపై దాడులు పెరిగాయన్నారు. హరితహారం, ప్రభుత్వ పఽథకాల పేరిట పోడు భూములను హరిస్తూ  పంటలను నాశనం చేస్తున్నారని విమర్శించారు. అడ్డుకున్న గిరిజనులపై పీడీయాక్ట్‌, అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపడం దుర్మార్గమన్నారు.  పోడు రైతులకు పట్టాలు ఇవ్వాలని  ఆగస్టు 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా జోడెఘాట్‌ నుంచి మంచిర్యాల మీదుగా భద్రాచలం వరకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, బాల మల్లేశ్‌, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాంతయ్య, గిరిజన రాష్ట్ర సమాఖ్య రామవత్‌ అంజయ్యనాయక్‌, నరసింహ, శ్రీనివాస్‌, ఉప్పలయ్య, లక్ష్మినారాయణ నేతృత్వంలో పోడుయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. పోడు భూ ముల వద్ద కుర్చీ వేసుకుని కూర్చొని సమస్యలు పరిష్కరిస్తానని కేసీఆర్‌ హామీ ఇచ్చి అనంతరం  రైతులపై కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేస్తున్నాడని విమర్శించారు. ఫారెస్ట్‌, రెవెన్యూ అధికారులు హద్దుల పేరుతో కందకాలు తవ్వించి పంటలను ధ్వంసం చేస్తున్నారని, ఈ విధానాలను మానుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. ఆదివాసీ గిరిజన బిడ్డలకు పోడు యాత్ర ద్వారా మనోధైర్యాన్ని కల్పించడమే లక్ష్యంగా సాగుతుందన్నారు. రామడుగు లక్ష్మణ్‌,  మల్లయ్య, చంద్రశేఖర్‌, కిషన్‌రావు, మిట్టపల్లి పౌలు, శ్రీనివాస్‌, దేవి పోచన్న, శంకరయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-30T04:17:40+05:30 IST