అధికార పార్టీలో ఆధిపత్య పోరు!

ABN , First Publish Date - 2022-02-07T06:08:57+05:30 IST

జిల్లాలోని అధికార పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు చాప కింద నీరులా విస్తరిస్తోంది. స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య విభేదాలతో బోథ్‌ నియోజకవర్గం వివాదాలకు అడ్డాగా మా రింది. ‘వాట్సాప్‌ గ్రూపుల్లో వాయిస్‌ మెసేజ్‌లు పెట్టి డిలేట్‌ చేయడం నీ తెలివి తక్కువ తనానికి నిదర్శనం.

అధికార పార్టీలో ఆధిపత్య పోరు!

జిల్లాలో కంట్రోల్‌ తప్పుతున్న కారు

బోథ్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ నేతల మధ్య కోల్డ్‌ వార్‌

స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఒక్కటవుతున్న నేతలు

ఇటీవల వివాదాస్పదంగా మారిన అంగన్‌వాడీ చీరల పంపిణీ కార్యక్రమం

అధికార పార్టీ శ్రేణుల్లో అయోమయం

ఫిర్యాదు చేసేందుకు అధిష్ఠానం వద్దకు ఉరుకులు, పరుగులు


ఆదిలాబాద్‌: జిల్లాలోని అధికార పార్టీ నాయకుల మధ్య ఆధిపత్య పోరు చాప కింద నీరులా విస్తరిస్తోంది. స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య విభేదాలతో బోథ్‌ నియోజకవర్గం వివాదాలకు అడ్డాగా మా రింది. ‘వాట్సాప్‌ గ్రూపుల్లో వాయిస్‌ మెసేజ్‌లు పెట్టి డిలేట్‌ చేయడం నీ తెలివి తక్కువ తనానికి నిదర్శనం. మండలంలోని 33 గ్రామ సర్పంచ్‌ల పేర్లు నీకు తెలుసా? నీ దగ్గర కనీసం పార్టీ సర్పంచ్‌లు, ఎంపీటీసీల ఫోన్‌ నెంబర్లయినా ఉన్నాయా? మండల కన్వీనర్‌ అంటే అర్థం తెలుసా? పార్టీ పదవి అంటే నీకు కిరాణా షాపులో చక్కెర, చాయ్‌పత్తి కొన్నుకున్నట్లు అనుకుంటున్నావా? ప్రజల ఓట్లతో గెలిస్తే తెలుస్తుంది పదవి విలువ ఏంటో, అసలు బోథ్‌ మండల టీఆర్‌ఎస్‌ పార్టీ కన్వీనర్‌గా నిన్ను పార్టీ అధిష్ఠానం నియమించడం మా దురదృష్టకరం’ అంటూ కొందరు మండల సర్పంచ్‌, ఎంపీటీసీలు ఇటీవల సోషల్‌ మీడియాలో పోస్టు చేయడం వైరల్‌గా మారింది. దీన్నిబట్టి చూస్తుంటే టీఆర్‌ఎస్‌ పార్టీలో ఏస్థాయిలో విభేదాలు ఉన్నాయో ఇట్టే తెలుస్తుంది.  


వివాదాలకు అడ్డాగా బోథ్‌ సెగ్మెంట్‌

జిల్లాలో రాజకీయ వివాదాలకు అడ్డాగా మారిన బోథ్‌ నియోజకవర్గంలో కారు పార్టీ కంట్రోల్‌ తప్పుతోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే టార్గెట్‌గా కొంత మంది నేతలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తుంది. జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేనంతగా బోథ్‌ నియోజకవర్గంలోనే అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు కనిపిస్తోంది. ఇప్పటికే మూడు, నాలుగు గ్రూపులుగా విడిపోయి పని చేస్తున్న నేతలంతా ఎవరికి వారే యమునా తీరేనంటూ పార్టీలో పని చేస్తున్నారు. బోథ్‌ నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఉన్నా..  ఎమ్మెల్యే మాత్రం ఆదిలాబాద్‌ పట్టణంలోనే నివాసం ఉంటూ నియోజకవర్గంలో జరిగే పలు కార్యక్రమాలకు హాజరవుతున్నట్లు ఆ పార్టీ నేతలే బహిరంగంగా చర్చించుకుంటున్నారు.


అడపాదడపా క్యాంపు కార్యాలయానికి వచ్చిపోతున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. దీంతో నియోజకవర్గం పై పట్టుకోల్పోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. తరుచూ వివాదాల కారణంగా ఒకరిపై ఒకరు అధిష్ఠానం పెద్దలకు ఫిర్యాదులు చేసుకోవడం పరిపాటిగా మారింది. తాజాగా బోథ్‌ మండలకేంద్రంలో అంగన్‌వాడీ టీచర్లకు ప్రభుత్వం అందించిన చీరల పంపిణీ వివాదాస్పదంగా మారింది. బోథ్‌ ఎంపీపీ తుల శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వర్గం నేతలు బహిరంగంగానే డిమాండ్‌ చేయడం ఆ పార్టీలో మరోసారి విభేదాలు బయట పడ్డాయి. అయితే అవకాశం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు అధికార పార్టీలో కుమ్ములాట లు కలిసి వచ్చే అవకాశంగా మారిందనే చెప్పొచ్చు. 


స్పీడు పెంచిన సీనియర్‌ నేతలు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బోథ్‌ నియోజకవర్గం నుంచి అధికార పార్టీ టికెట్‌ ను ఆశిస్తున్న సీనియర్‌ నేతలంతా మరింత స్పీడును పెంచడంతో అధికార పార్టీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎస్టీ రిజర్వ్‌డు స్థానమైన బోథ్‌ నియోజకవర్గంపై ఇద్దరు, ముగ్గురు నేతలు కన్నేసినట్లు ఆ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. గత కొంత కాలంగా ఎమ్మెల్యేకు దూరంగా ఉంటూ వస్తున్న నేతలంతా ఒక్కటవుతున్నారు. శత్రువుకు శత్రువు మనకు మిత్రుడే అన్నట్లుగా కొందరు నేతల తీరు కనిపిస్తోంది. ఎవరికి టికెట్‌ వచ్చినా ఫర్వాలేదు కాని సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు మాత్రం మరోసారి అవకాశం రాకూడదంటూ ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం వ్యూహరచన చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా మాజీ ఎంపీ గేడం నగేష్‌, నేరడిగొండ జడ్పీటీసీ సభ్యుడు అనిల్‌జాదవ్‌లు సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే నియోజక వర్గంలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ కార్యకర్తలకు దగ్గరయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టారు. తాంసి మండలం మినహా బోథ్‌ నియోజకవర్గంలోని మిగితా ఎనిమిది మండలాల్లో ఎమ్మెల్యేకు వ్యతిరేకవర్గం కనిపిస్తోంది. బజార్‌హత్నూర్‌, ఇచ్చోడ, బోథ్‌, నేరడిగొండ మండలాల్లో టీఆర్‌ఎస్‌ నేతల మధ్య పోటాపోటీ కనిపిస్తుంది. ఎమ్మెల్యే పర్యటనలకు స్థానిక నేతలంతా దూరంగానే ఉంటున్నారు. గేడం నగేష్‌, అనిల్‌జాదవ్‌లు ఈసారి టికెట్‌ తమకే వస్తుందన్న ధీమాతో నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మొత్తానికి ముందస్తు రాజకీయాలలో బోథ్‌ నియోజకవర్గం ముందునదనే చెప్పొచ్చు.


సై అంటే సై అంటున్న నేతలు

బోథ్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్గం, ఇతర నేతల మధ్య సై అంటే సై అనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత కొంత కాలం క్రితం తలమడుగు మండలంలో అంబేద్కర్‌ భవన వివాదం ఆ మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుఛిు కేదరేశ్వర్‌రెడ్డిని తప్పించి ఆయన వ్యతిరేక వర్గం నేత దగ్గరి బంధువుకు అవకాశం కల్పించడం వెనుక అసలు మతలాబు ఏమిటనే చర్చ జరుగు తోంది. బోథ్‌, ఇచ్చోడ మండలాల్లో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లలో అవినీతికి పాల్పడిన ఒకరిద్దరు నేతలకు కూడా మద్దతు ఇవ్వడంపై ఆయన వ్యతిరేక వర్గం మం డిపడుతోంది. అలగే ఇటీవల బోథ్‌ మండల కేంద్రంలో అంగన్‌వాడీ చీరల పంపిణీ వ్యవహారం కూడా వివాదానికి దారి తీసింది. ఎమ్మెల్యే లేకుండానే బోథ్‌ ఎంపీపీ తుల శ్రీనివాస్‌ చీరల పంపిణీ చేయడంపై ఎమ్మెల్యే వర్గం మండిపడు తోంది. ఎమ్మెల్యేను కాదని అవమాన పరిచే విధంగా వ్యవహరించిన ఎం పీపీపై పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా పార్టీ అధ్యక్షుడు జోగు రామన్నకు ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే వర్గీయులు హెచ్చరిస్తున్నారు. దీనికి కౌంటర్‌గా ఎంపీపీ వర్గం ఘాటైన సమాధానం ఇవ్వడం నియోజక వర్గంలో రాకీయ దుమారం రేపుతోంది.

Updated Date - 2022-02-07T06:08:57+05:30 IST