వైసీపీలో ఫైటింగ్‌!

ABN , First Publish Date - 2022-06-29T07:54:15+05:30 IST

వైసీపీలో ఫైటింగ్‌!

వైసీపీలో ఫైటింగ్‌!

నేతల మధ్య కుమ్ములాటలు

ఓ అగ్ర నేతపై బాలినేని కన్నెర్ర

టీడీపీతో కలిసి కుట్రలని ఆక్రోశం

కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిదీ అదే మాట

మాజీ మంత్రులు ఆనం, అనిల్‌పై గుర్రు

సీమలోనూ పొసగని ఎమ్మెల్యేలు

ద్వితీయ శ్రేణి నేతలతోనూ సిగపట్లు

పలు జిల్లాల్లో పెరుగుతున్న దూరం


వైసీపీ నేతల మధ్య లుకలుకలు తీవ్రమవుతున్నాయి. కీలక నాయకులు సైతం బహిరంగంగానే కుమ్ములాటలకు దిగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. వరుస యాత్రలతో అటు ప్రతిపక్షం, ఇటు అధికార పక్షం జనంలోకి వెళ్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పాలక పక్ష నేతల నడుమ విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. కలిసి పనిచేయాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి, ఆ పార్టీ నాయకత్వం సూచిస్తున్నా అప్పటికి సరేనంటున్నారు. తర్వాత నియోజకవర్గాల్లో తలపడుతున్నారు. బాహాటంగానే ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. పరస్పరం దాడులు కూడా చేసుకుంటున్నారు.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీలో ముసలం మొదలైంది. ఒకరిపై మరొకరు  ఆరోపణలు గుప్పించుకోవడంతో సరిపెట్టడం లేదు. పెద్ద నేతలను కూడా వివాదాల్లోకి లాగుతున్నారు. కొన్ని చోట్ల పరిస్థితి చేయి దాటి దాడులు, ప్రతిదాడులు చేసుకునే వరకు వెళ్తోంది. ఒకప్పుడు మంత్రులుగా పనిచేసినవారు సైతం సొంత పార్టీ నేతలపై విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి మరీ ఆరోపణలు చేస్తున్నారు. మరికొందరు బహిరంగ వేదికలెక్కి విమర్శలు చేస్తున్నారు. పలు జిల్లాల్లో రోజురోజుకూ నేతల నడుమ దూరం పెరుగుతోందే తప్ప.. సఖ్యత కుదరడం లేదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు సన్నిహిత బంధువైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రెండ్రోజులుగా ప్రకాశం జిల్లాకు చెందిన ఓ అగ్ర నేతపై విమర్శలు గుప్పిస్తున్నారు. తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు ప్రతిపక్ష టీడీపీ నాయకులతో కలిసి సొంత పార్టీ నేతలే కుట్రలు పన్నుతున్నారని ఆరోపిస్తున్నారు. తనపైన, తన కుమారుడిపైనా దుష్ప్రచారం చేస్తున్నారని.. వారి సంగతి తేలుస్తానని మంగళవారం వైసీపీ ప్లీనరీలోనే హెచ్చరించారు. మద్రాసులో రూ.5 కోట్లు పట్టుబడితే.. అది తన హవాలా సొమ్మంటూ ప్రచారం చేశారని.. అదేవిధంగా అల్లూరులో కవితారెడ్డి అనే మహిళ ద్వారా గొడవ చేయిస్తున్నారని.. ఇలా డ్రామాలు చేస్తే కాళ్లు విరుగుతాయని హెచ్చరించారు. అన్ని విషయాలూ సీఎం దృష్టికెళ్తానన్నారు. ఆయనకు పొరుగు జిల్లా నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మద్దతు పలకడం గమన్హాం. తానూ సొంత పార్టీ నేతల బాధితుడినేనని వాపోయారు. తన నియోజకవర్గం వ్యవహారాల్లో ఇతర నియోజకవర్గాల వైసీపీ నేతలు జోక్యం చేసుకుంటున్నారని ఆసహనం వ్యక్తం చేశారు. పరోక్షంగా మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డిని, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే, మరో మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ ఉద్దేశించి చేసినవేనని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో అనిల్‌కుమార్‌కు సీఎం ఉద్వాసన పలికి సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దనరెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై అనిల్‌ కాకాణిపై విమర్శలు గుప్పించారు. అంతేకాదు.. మంత్రి హోదాలో కాకాణి తొలిసారి నెల్లూరులో అడుగుపెట్టిన రోజే తానూ తన నియోజకవర్గంలో సభ ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ఇద్దరినీ తాడేపల్లి పిలిపించి మందలించి పంపారు. అప్పటికి పరిస్థితి సద్దుమణిగినట్లు కనిపించినా.. అంతర్గతంగా కలహాలు అలాగే ఉన్నాయని.. ఇద్దరి మధ్య దూరం కొనసాగుతూనే ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. అటు అనిల్‌, ఆనం కూడా ఎడముఖం పెడముఖంగానే ఉంటున్నారని చెబుతున్నారు.


రాయలసీమలో.. 

కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌కూ.. మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డికి మధ్య వర్గపోరు నడుస్తోంది. అదేవిధంగా టీటీడీ బోర్డు సభ్యుడు, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డితోనూ హఫీజ్‌ఖాన్‌కు పొసగడం లేదని అంటున్నారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు వైసీపీ ఎమ్మెల్యే ఆర్థర్‌కు, శాప్‌ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ రెండు జిల్లాల్లో ఎమ్మెల్యేలకు, ద్వితీయశ్రేణి నాయకులకు కూడా పడకపోవడం గమనార్హం. ఇక శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీ నేత నవీన్‌ నిశ్చల్‌, ఎమ్మెల్సీ ఇక్బాల్‌ మధ్య వివాదం పరస్పర దాడుల దాకా వెళ్లింది. ఇక్బాల్‌కు వ్యతిరేకంగా మాట్లాడేందుకు సిద్ధమైన నవీన్‌ నిశ్చల్‌పై ఎమ్మెల్సీ వర్గీయులు దాడికి తెగబడ్డారు. ఇందులో ఎమ్మెల్సీ కూడా పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. ఈ వైరాలు, కలహాలు ఎన్నికల నాటికి ఎటు దారితీస్తాయోనన్న ఆందోళన వైసీపీ ముఖ్య నేతల్లో కనిపిస్తోంది.

Updated Date - 2022-06-29T07:54:15+05:30 IST