టీకా పోరు!

ABN , First Publish Date - 2021-04-08T05:55:29+05:30 IST

ఈ నెల 11నుంచి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పనిప్రదేశాలకూ విస్తరించాలన్న నిర్ణయం మంచిదే. కరోనా మలిదశ వేగంగా కమ్ముకుంటున్న స్థితిలో...

టీకా పోరు!

ఈ నెల 11నుంచి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని పనిప్రదేశాలకూ విస్తరించాలన్న నిర్ణయం మంచిదే. కరోనా మలిదశ వేగంగా కమ్ముకుంటున్న స్థితిలో, దానిని ఎదుర్కొనేందుకు వీలైనంత ఎక్కువమందికి వ్యాక్సిన్‌ అందజేయాలన్నది కేంద్రం ఆలోచన కావచ్చు. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ అందుతోంది. నలభైఐదేళ్ళు దాటినవారికి కూడా అప్పటివరకూ ఉన్న పరిమితులను ఎత్తివేసి వ్యాక్సిన్‌ లభించేట్టు చేశారు. మరో నాలుగురోజుల్లో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనూ వ్యాక్సినేషన్‌ చేపట్టడం ద్వారా మరింతమందికి టీకా రక్షణ లభించేట్టు చేయడం ప్రభుత్వ ఉద్దేశం. కనీసం వందమందిని ఇందుకు ముందుగా సిద్ధంగా ఉంచాలన్న నియమాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మేరకు, ఎంత జాగ్రత్తగా అమలుచేయగలుతాయో చూడాలి.


వ్యాక్సిన్‌ కొరత ఉన్నదన్న రాష్ట్రాల విమర్శను దీటుగా ఎదుర్కోవాలన్న ఉద్దేశం కూడా ఈ నిర్ణయం వెనుక ఉండివుండవచ్చు. వ్యాక్సిన్‌ కొరత లేదని కేంద్రం వాదిస్తున్నది కానీ, తెలుగు రాష్ట్రాలు సహా కనీసం అరడజను రాష్ట్రాలు వ్యాక్సిన్‌ కొరత ఎదుర్కొంటున్నమాట వాస్తవం. పదిహేను లక్షల వ్యాక్సిన్‌ డోసులు కావాలని ఒడిశా అడిగితే, ఉన్న కొరతకు తోడు కేంద్రం కొత్తగా మూడులక్షలడోసులు మాత్రమే పంపడంతో ఒడిశా ప్రభుత్వం 600 కేంద్రాలను మూసివేయాల్సి వచ్చింది. మహారాష్ట్ర కూడా తనదగ్గర ఉన్న డోసులు మూడురోజులు దాటి రావని హెచ్చరిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సిన్‌ మాటున రాజకీయ యుద్ధాలు చేసుకుంటున్నాయి. కరోనా మహమ్మారిని నియంత్రించడంలో విఫలమై, కేసుల్లోనూ, చావుల్లోనూ అగ్రస్థానంలో మహారాష్ట్ర వ్యాక్సిన్‌ కొరత పేరుతో తమపై ఎదురుదాడి చేస్తున్నదని కేంద్ర ఆరోగ్యమంత్రి మండిపడుతున్నారు. పద్దెనిమిదేళ్ళు పైబడినవారందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వాలన్న డిమాండ్‌తో మహారాష్ట్ర, ఢిల్లీ ప్రభుత్వాలు కేంద్రాన్ని ఇరుకునబెట్టే ప్రయత్నంచేస్తుంటే, ఇప్పటివరకూ ఈ రెండు రాష్ట్రాలూ దాదాపు 80శాతంమంది ఆరోగ్యకార్యకర్తలకు అందునా మొదటిడోసు మాత్రమే ఇవ్వగలిగిన విషయాన్ని కేంద్రమంత్రి గుర్తుచేస్తున్నారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ కూడా ఈ ప్రతిపాదనే చేసినప్పటికీ, ప్రస్తుతానికి దుర్బలులను రక్షించాలన్నదే తమ లక్ష్యమంటూ అన్ని వయస్సులవారికీ వ్యాక్సిన్‌ అన్న డిమాండ్లను కేంద్రం తిరస్కరిస్తున్నది. తమ ప్లాంటులో ఉత్పత్తి ఇప్పటికే గరిష్ఠస్థాయికి చేరిందనీ, ఓ మూడువేలకోట్లు పెట్టుబడి పెడితేనే జూన్‌ నాటికి ఉత్పత్తి సామ ర్థ్యాన్ని పెంచగలమని సీరమ్‌ సంస్థ అధినేత అదర్‌ పూనావాలా అంటున్నారు. 


వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఆరంభమైన గత మూడునెలల్లో దాని వేగం దశలవారీగా హెచ్చినప్పటికీ, లక్ష్యాలు చేరుకోలేనిమాట వాస్తవం. కానీ, కరోనా మలిదశ విజృంభణ ఈ స్థాయిలో ఉండవచ్చునని నిపుణులు ఎప్పుడో హెచ్చరించారు. కొత్త వేరియంట్లు, డబుల్‌ మ్యుటేషన్లు వ్యాధిని ప్రమాదకరంగా మార్చివేయవచ్చునన్న భయాలు గతంలోనే వ్యక్తమైనాయి. బుధవారం ఒక్కరోజే లక్షాపదిహేనువేల కొత్తకేసులతో భారత్ ప్రపంచ రికార్డు నమోదు చేసింది. ఒక్కరోజులో ఇంత గరిష్ఠంగా కేసులు నమోదు కావడం ఇదే మొదలు. రాబోయే రోజులు మరింత గడ్డుగా ఉండబోతున్నాయని కేంద్రం హెచ్చరిస్తున్నది. ఐదారువారాల్లో వైరస్‌ వ్యాప్తి ఉచ్ఛస్థితికి చేరబోతున్నదన్న హెచ్చరికల నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేవీ ఆ ఉధృతిని ఆపేట్టుగా కనిపించడం లేదు. ఎట్టిపరిస్థితుల్లో లాక్‌డౌన్‌ అమలుచేయబోమన్న మొండి వాదన తప్ప, మాస్కులు, భౌతికదూరాల అమలు విషయంలో పట్టింపు కనిపించడం లేదు. గత ఏడాది పెత్తనం తన చేతుల్లో పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం ఈమారు రాష్ట్రాలను వదిలివేసి, తప్పులు ఎత్తిచూపడానికే పరిమితమైనట్టు కనిపిస్తున్నది. ముంచుకొస్తున్న ముప్పు గురించి ముందే తెలిసినా, ప్రభుత్వాలు ఇంతకాలం ప్రదర్శించిన నిర్లక్ష్యం ఇప్పుడు ప్రజలకు ప్రాణం మీదకు తెస్తున్నది. తప్పుని పూర్తిగా ప్రజలమీదకు నెట్టివేసి, కేంద్ర రాష్ట్రాలు వ్యాక్సిన్‌ వార్‌లో మునిగితేలుతున్నాయి.

Updated Date - 2021-04-08T05:55:29+05:30 IST