సాగర్‌ నిండెన్‌!

ABN , First Publish Date - 2021-07-23T06:23:35+05:30 IST

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి ప్రాజెక్టుకు 3లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడంతో అధికారులు ప్రాజెక్టు 35 గేట్లు ఎత్తి 6 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు.

సాగర్‌ నిండెన్‌!
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు 35 గేట్ల నుంచి దిగువకు ఉరకలేస్తున్న గోదారమ్మ

నిండిన శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు
ఎగువ నుంచి వస్తున్న భారీ వరద
ప్రాజెక్టులోకి 3లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
35 గేట్లు ఎత్తి అంతే మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్న ప్రాజెక్టు అధికారులు
ప్రాజెక్టు.. జూలైలో నిండడం మూడో సారి
సీఎం ఆదేశాలతో పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి, కలెక్టర్‌ నారాయణరెడ్డి

నిజామాబాద్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/మెండోరా/రెంజల్‌: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి ప్రాజెక్టుకు 3లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడంతో అధికారులు ప్రాజెక్టు 35 గేట్లు ఎత్తి 6 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. అలాగే, విద్యుత్‌ ఉత్పత్తి కోసం ఎస్కేప్‌ గేట్ల ద్వారా కాకతీయ కాలువ నుంచి 8వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. ఎగువ ప్రాంతం నుంచి వరద పెద్దఎత్తున వస్తుండడంతో మరిన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు.
భారీగా పెరుగుతున్న వరద
గత రెండు రోజులుగా జిల్లాతో పాటు ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండడంతో గోదావరి నదికి వరద భారీగా పెరిగింది. గోదావరి, మంజీరా, హరిద్ర నదులకు వరద పోటెత్తుతోంది. దీంతో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు గురువారం ఉదయం లక్షా 33 వేల క్యూసెక్కుల వరద వచ్చింది. వర్షాలు పెరగడంతో 9గంటలకు 3 లక్షల 33 వేలకు పెరిగింది. మధ్యాహ్నం 12 గంటల వరకు 4 లక్షల 33 వేలకు చేరింది. దీంతో ప్రాజెక్టు నీటిమట్టం 1,091 అడుగుల(90 టీఎంసీలు)కు గాను 1,089.90అడుగుల(84 టీఎంసీలు)కు చేరింది. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రాజెక్టు అధికారులు మొదట 8 గేట్లు ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. అయితే, వరద అంతకంతకూ పెరుగుతుండడంతో నీటి విడుదలను 50 వేల క్యూసెక్కులకు పెంచారు. అనంతరం ప్రాజెక్టుకు వరద భారీగా కొనసాగుతుండడం, నీటి మట్టం 1090.30 అడుగుల(86.30 టీఎంసీలు)కు చేరడంతో ప్రాజెక్టు మరో 8 గేట్లను ఎత్తి.. మొత్తం 16గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ఇంకా వరద తగ్గక పోవడంతో మధ్యాహ్నం 3గంటలకు మరో 19 గేట్లను ఎత్తి మొత్తం 35గేట్ల ద్వారా 2 లక్షల యాభై వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. సాయంత్రం 7గంటలకు కూడా వరద తగ్గకపోవడంతో నీటి విడుదలను 6 లక్షల క్యూసెక్కులకు పెంచారు. అలాగే, విద్యుత్‌ ఉత్పత్తి కోసం ఎస్కేప్‌ గేట్ల ద్వారా కాకతీయ కాలువ నుంచి 8వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అధికారులు ప్రాజెక్టుపైనే ఉంటూ వరదను ఎప్పటికప్పుడూ అంచనా వేస్తున్నారు. వరద ఇలాగే కొనసాగుతే మరిన్ని గేట్లు ఎత్తనున్నారు.
త్రివేణి సంగమం వద్ద పెరిగిన ఉధృతి
రెంజల్‌ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమం వద్ద వరద ఉధృతి పెరిగింది. మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండడంతో అక్కడి వరద గోదావరి ద్వారా భారీగా వస్తోంది. నాందేడ్‌ పరిధిలోని బాలేగాం, విష్ణుపురి ప్రాజెక్టుల గేట్లను ఎత్తడంతో వరద భారీగా పెరిగింది. గోదావరికి మంజీరా, హరిద్ర నదుల వరద కలవడంతో ఉధృతి భారీగా పెరిగింది. బోధన్‌ మండలం హంగర్గా వరకు వరద వెనకకు తట్టింది. మంజీరాకు కూడా భారీ వరద రావడంతో కందకుర్తి వద్ద భారీగా వరద పెరిగిది. పాత శివాలయం వరద నీటిలో మునిగిపోయింది.
జూలైలో నిండడం మూడోసారి
శ్రీరాంసాగర్‌ నిర్మాణం పూర్తైనప్పటి నుంచి జూలై నెలలో ప్రాజెక్టు నిండడం ఇది మూడో సారి. 1983లో ప్రాజెక్టు రైతు లకు అందుబాటులోకి రాగా.. 2005, 2016లో మాత్రమే జూలై నెలలో ప్రాజెక్టు నిండింది. ఆ తర్వాత మళ్లీ ఈ సంవత్సరమే జూలై నెలలో ప్రాజెక్టు నిండింది. ప్రాజెక్టు నిర్మాణం పూర్తైనప్పటి నుంచి ఈ మూడేళ్లు మినహా మిగతా అన్ని సార్లు ఆగస్టు లేదా సెప్టెంబరు నెలల్లోనే ప్రాజెక్టు నిండింది. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు ప్రతీ సంవత్సరం జూన్‌, జూలై నెలల కన్నా ఆగస్టు నెలలోనే ఎక్కువగా వరద వస్తోంది. మహారాష్ట్రలో అన్ని ప్రాజెక్టులు నిండిన తర్వాతనే ప్రాజెక్టుకు వరద వచ్చింది. ఈ సంవత్సరం జూన్‌ నెలలోనే మహారాష్ట్రలోని నాందేడ్‌ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో అక్కడి ప్రాజెక్టులు నిండాయి. శ్రీరాంసాగర్‌కు జూన్‌ మొదటి వారం నుంచే వరద వస్తుండడంతో ప్రాజెక్టు తొందరగా నిండింది. ప్రతీ సంవత్సరం బాబ్లీ గేట్లు మూసే అక్టోబరు 28 వరకు ప్రతీరోజు వరద ప్రాజెక్టు లోకి వస్తోంది. ఈ సంవత్సరం ముందే ప్రాజెక్టు నిండడం వల్ల మరో మూడు నెలల పాటు ఎగువ ప్రాంతం నుంచి వరద రానుంది.
పరీవాహక ప్రాంత ప్రజల అప్రమత్తం
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో గోదావరి పరీవాహక ప్రాంత గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రాజెక్టుకు వరద భారీగా వస్తుండడంతో గురువారం ఉదయమే జిల్లాతో పాటు నిర్మల్‌, జగిత్యాల, మంచిర్యాల జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు. గోదావరి వద్దకు ప్రజలు వెళ్లకుండా చూడాలని, ఆయా మండలాల అధికారులు స్థానికంగా ఉండాలని ఆదేశించారు. కలెక్టరేట్‌లలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసి వరద పరిస్థితిని అంచనా వేస్తున్నారు.
మొదలైన విద్యుత్‌ ఉత్పత్తి
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు భారీ వరద రావడంతో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో అధికారులు విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభి ంచారు. ఎస్కేప్‌ గేట్ల ద్వారా 8 వేల క్యూసెక్కుల నీటిని కాకతీయ కాలువకు విడుదల చేస్తూ విద్యుత్‌ ఉత్పత్తిని కొనసా గిస్తున్నారు. మొత్తం నాలుగు టర్బైన్‌ల ద్వారా 36 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. కాకతీయ కాలువ ద్వారా ఆయకట్టుకు నీటి విడుదల చేసినన్ని రోజులు ఈ విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగించనున్నారు.
సీఎం కేసీఆర్‌ సమీక్ష
శ్రీరాంసాగర్‌కు వరద పోటెత్తడంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను అప్రమత్తం చేశారు. వెంటనే క్షేత్రస్థాయిలో ముందస్తు జాగ్రత్తలు చర్యలు చేపట్టాలని జిల్లా మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి సూచించారు. అలాగే, గోదావరి పరీవాహక ప్రాంతాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, అర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భారీ వర్షాల వల్ల సంభవించే నష్టాన్ని అంచనా వేస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ను ఆదేశించారు. అత్యవసరమైన చోట ఎన్‌డీఅర్‌ఎఫ్‌ బృందాల సేవలను వినియోగించుకోవాలన్నారు. సీఎం ఆదేశాలతో అధికారులు అప్రమత్తమై వరదను అంచనా వేస్తూ చర్యలు తీసుకుంటున్నారు.
సమీక్షించిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి
మెండోర, జూలై 22 : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు జిల్లాలో కురుస్తున్న వర్షాలు, వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నట్టు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. కలెక్టర్‌తో పాటు స్థానిక ప్రజాప్రతనిధుల ద్వారా ఆరా తీ స్తున్నట్టు తెలిపారు. ఎస్సారెస్పీ ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లోను ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నట్టు తెలిపారు. అయితే, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని మంత్రి తెలిపారు. ఎస్సారెస్పీ, గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసినట్టు మంత్రి తెలిపారు. లో తట్టు, వరద ప్రభావం ఉండే ప్రాంతాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వర్షాలు మరో రెండు మూడు రోజులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధి కారులు చెబుతున్న నేపథ్యంలో ప్రజలు సహకరించాలని మంత్రి కోరారు. నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్‌లు, ఆర్డీవోలు, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌, పంచాయతీ రాజ్‌ శాఖ అధికారు లు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారని మంత్రి తెలిపారు.

హలో నేను మంత్రి ప్రశాంత్‌రెడ్డిని.. ఎలా ఉన్నారు?
వరదలో చిక్కుకున్న వారితో ఫోన్‌లో పలకరింపు

శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి వరదగేట్ల ద్వారా నీటిని విడుదల చేయ డంతో సావెల్‌లో సమీపంలో గోదావరి నది తీరంలో ఉన్న ఆశ్ర మం చుట్టు పక్కలకు  వరద నీరు చేరింది. దీంతో ఆశ్రమంలో ఉన్న ఏడుగురు భయాందోళనకు గురికావడంతో విషయాన్ని స్థానికులు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి దృష్టి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన మంత్రి వారితో ఫోన్‌లో మాట్లాడి  ధైర్యం చెప్పారు. వెంటనే ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను, గజ ఈతగాళ్లు పంపించి ఆశ్రమంలో ఉన్న ఏడుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ నారాయణరెడ్డి ఆదేశించారు.


అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు
ప్రజలకు ఎంపీ అర్వింద్‌ విజ్ఞప్తి

నిజామాబాద్‌, జూలైౖ 22 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వర్షాలు విస్తారంగా కురుస్తున్నందున నిజామాబాద్‌ పార్లమెం ట్‌ నియోజకవర్గం పరిధిలోని ప్రజలు అప్రమత్తంగా ఉం డాలని, అత్యసరమైతే తప్ప బయటకు రావొద్దని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ సూచించారు. గురువారం ఆయన జిల్లాలో పరిస్థితులను అధికారులను, స్థానిక నా యకులను అడిగి తెలుసుకున్నారు. శ్రీరాంసాగ ర్‌ గేట్ల ద్వారా నీటిని విడుదల చేసినందుకు పరీవాహక ప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంత ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని, మత్య్సకారులు, జాలర్లు చేపల వేట కు వెళ్లవద్దని సూచించారు. పురాతన ఇళ్లలో ఎవరైనా నివాసం ఉంటే వారిని అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. రెవెన్యూ, పోలీసు, పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, విద్యుత్‌ శాఖల అధికారులు 24గంటలు అందుబాటులో ఉండి తక్షణ రక్షణ చర్యలు తీసుకోవాలని, అత్యవసరమైతే ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని సిద్ధంగా ఉంచా లని ఆయన  కలెక్టర్‌ నారాయణరెడ్డిని కోరారు.

Updated Date - 2021-07-23T06:23:35+05:30 IST