ఎగ్జిబిటర్లకు సినిమా

ABN , First Publish Date - 2022-06-22T07:08:44+05:30 IST

సినిమా టికెట్లను ఆనలైనలో అమ్మేలా ప్రభుత్వం జారీ చేసిన జీవో థియేటర్ల నిర్వాహకులకు సంకటంగా మారింది.

ఎగ్జిబిటర్లకు సినిమా

ఆనలైన టిక్కెట్ల అమ్మకంపై కొత్త నిబంధనలు

పాత యాప్‌లతో అగ్రిమెంట్‌ రద్దు చేయాల్సిందే

నోడల్‌ ఏజెన్సీ యాప్‌ ద్వారానే టిక్కెట్లు అమ్మాలి

టికెట్ల డబ్బు ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో తెలియదు

ఏకపక్ష ఎంఓయూపై సంతకానికి అధికారుల ఒత్తిడి

కోర్టును ఆశ్రయించాలని ఎగ్జిబిటర్ల నిర్ణయం


గుంతకల్లు, జూన 21: సినిమా టికెట్లను ఆనలైనలో అమ్మేలా ప్రభుత్వం జారీ చేసిన జీవో థియేటర్ల నిర్వాహకులకు సంకటంగా మారింది. మునుపటి సినిమా రూల్స్‌ను సవరిస్తూ వైసీపీ ప్రభుత్వం ఈ నెల 2న జీవో 69ని జారీ చేసింది. ఇందులో ఏపీ స్టేట్‌ ఫిలిం టెలివిజన అండ్‌ థియేటర్స్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన (ఏపీఎ్‌సఎ్‌ఫటీ అండ్‌ టీడీసీ) ఆధ్వర్యంలో ఇకపై ఆనలైన టిక్కెట్ల అమ్మకం చేపట్టాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయం, సవరణలపై సీడెడ్‌ ఏరియా కేంద్రమైన గుంతకల్లులోను, జిల్లా వ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్ల యజమానులు, లీజుదారులు, పంపిణీదారుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతోంది. గుంతకల్లులోని రాయలసీమ ఫిలిం డిసి్ట్రబ్యూటర్స్‌ అసోసియేషన తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తంచేసింది. 


సమస్య ఇదీ..

సవరణల వల్ల ఆనలైన టిక్కెట్ల అమ్మకానికి సంబంధించి థియేటర్లు గతం లో మధ్యవర్తిత్వ యాప్‌లతో కుదుర్చుకున్న అగ్రిమెంట్లను రద్దుచేసుకోవాల్సి ఉంటుంది. ఆనలైనలో అమ్ముడైన టిక్కెట్ల డబ్బు ప్రభుత్వ ఖాతాలో జమ అవుతుంది. దీన్నుంచి సర్వీసు చార్జి 2 శాతం వరకు, ప్రభుత్వానికి రావాల్సిన లెవీని మినహాయించుకుని మిగతా సొమ్మును థియేటర్ల యజమానులకు లేదా లీజుదారులకు చెల్లిస్తారు. ఇవన్నీ తమకు నష్టం కలిగిస్తాయని ఏపీలోని ఫిలిం చాంబర్‌లోని ప్రొడ్యూజర్స్‌ కౌన్సిల్‌, డిసి్ట్రబ్యూటర్స్‌ కౌన్సిల్‌, ఎగ్జిబిటర్స్‌ కౌన్సిల్‌, స్టూడియో సెక్టార్‌ సభ్యులు అంటున్నారు.


డబ్బు వాపసుపై సందిగ్ధత

పేటీఎం, బుక్‌ మై షో యాప్‌లు తాము అమ్మిన టిక్కెట్ల డబ్బును ఏరోజుకు ఆరోజు ఎగ్జిబిటర్లకు అందజేస్తాయి. ఆలస్యమైతే మరుసటి రోజు చెల్లిస్తున్నాయి. కానీ ప్రభుత్వం ద్వారా ఏర్పాటయ్యే నోడల్‌ ఏజెన్సీ.. ఆనలైన అమ్మకాల డబ్బును ఎప్పుడు చెల్లిస్తుందో ఎంఓయూలో పేర్కొనలేదు. దీనిపై థియేటరు ఓనర్లు, లీజుదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డబ్బు చెల్లింపు నాలుగు రోజులు ఆలస్యమైనా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని జంకుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో సినిమా డబ్బును వాడుకుంటే తమ పరిస్థితి తల్లకిందులైపోతుందని ఆందోళన చెందుతున్నారు. 


పంచ సూత్రాలతో పంచ

ఆనలైన టిక్కెట్ల అమ్మకం కొత్త నిబంధల ప్రకారం థియేటర్లపై అజమాయిషీ కోసం ఏపీఎ్‌సఎ్‌ఫటీవీ అండ్‌ టీడీసీ అనే ప్రభుత్వ కంపెనీని నోడల్‌ ఏజెన్సీగా ఏర్పాటు చేస్తారు. ఈ ఏజెన్సీ ఆనలైన టిక్కెట్ల అమ్మకానికి యాప్‌ను తయారుచేయించి, పోర్టల్‌ను నిర్వహిస్తుంది. ప్రేక్షకులు చెల్లించిన సొమ్ము నుంచి ఈ నోడల్‌ ఏజెన్సీ 2 శాతానికి మించకుండా సర్వీస్‌ చార్జీని వసూలు చేస్తుంది. సినిమా ఎగ్జిబిటర్లు (థియేటర్ల యజమానులు లేదా లీజుదారులు) ఇదివరకే బుక్‌ మై షో, పేటీఎం తదితర మీడియేట్‌ యాప్స్‌ ద్వారా ఆనలైన టిక్కెట్ల అమ్మకం చేస్తూ ఉంటే ఆ అగ్రిమెంట్లను రద్దుపరచుకుని, ప్రభు త్వం ఏర్పాటు చేసిన నోడల్‌ ఏజెన్సీ ద్వారా మాత్రమే టిక్కెట్లను అమ్మేలా ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. మొత్తం టిక్కెట్లలో ఆనలైన టిక్కెట్ల నిష్పత్తి ఎంత అనేది నోడల్‌ ఏజెన్సీ నిర్ణయిస్తుంది.


సమ్మతి కోసం ఒత్తిడి

మెమొరాండం ఆఫ్‌ అండర్‌స్టాండింగ్‌ (ఎంఓయూ) పేరిట ఎన్నో నిబంధనలున్న డాక్యుమెంటును ఎగ్జిబిటర్లకు ప్రభుత్వం పంపింది. నిబంధనలకు సమ్మతిని తెలుపుతున్నట్లు డిక్లరేషన ఇవ్వాలని ప్రభుత్వ ఉన్నతాధికారుల నుంచి ఎగ్జిబిటర్లపై వారం రోజుల నుంచి ఒత్తిళ్లు పెరిగిపోయాయి. సమ్మతించకుంటే సినిమా ఎగ్జిబిషన లైసెన్సును రద్దుచేస్తామని హెచ్చరిస్తున్నారు. ఎంఓయూలో ఉన్న నిబంధనలలో కొన్ని అర్థంకానివి, ఆమోదయో గ్యం కానివి ఉన్నాయని, నివృత్తి చేసుకోకుండా ఎలా సంతకం చేయాలని థియేటర్ల యజమానులు, లీజుదారులు ప్రశ్నిస్తున్నారు. పైగా ఇదివరకే ఆనలైన టికెట్ల అమ్మకానికి సంబంధించి మీడియేటరు కంపెనీలతో ఒప్పందాలు ఉన్నాయని, వాటిని ఉల్లంఘిస్తే న్యాయపరమైన సమస్యలు ఎదురౌతాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రెవెన్యూ అధికారుల నుంచి సినిమా థియేటర్ల నిర్వాహకులపై ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. వెంటనే ఒప్పంద పత్రాలపై సమ్మతి తెలపాలని అంటున్నారు. జిల్లాలోని ఆర్డీవోలు, తహసీల్దార్లు సినిమా థియేటర్ల యజమానులపై తీవ్రమైన ఒత్తిడి తెస్త్తున్నారు. ఫోన్లు లిఫ్టు చేయకపోతే ఇళ్ల వద్దకే వచ్చి ప్రశ్నిస్తున్నారని ఆవేదనను వ్యక్తంచేస్తున్నారు. ఎంఓయూ అగ్రిమెంట్లను తయారు చేసుకుంటూనే, సమస్యను పరిష్కరిస్తుందేమోనని తెలుగు సినిమా చాంబర్‌ ఆఫ్‌ కామర్సుపై ఎగ్జిబిటర్లు ఆశలు పెట్టుకున్నారు. 


కోర్టును ఆశ్రయిస్తున్నాం..

ప్రభ్వుత్వం తెచ్చిన విధానాన్ని సినిమా రంగంలోని నాలుగు డివిజన్ల వారూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టిక్కెట్ల డబ్బును థియేటర్ల యజమానులకు ఎప్పుడు తిరిగి ఇస్తారో చెప్పకుండా అగ్రిమెంటు కావాలని ఒత్తిడి చేయడం అన్యాయం. ఏకపక్షంగా ఉన్న ఈ నిబంధనలను థియేటర్లపై రుద్దాలని చూడరాదు. దీనిపై ఫిలించాంబర్‌ ఆధ్వర్యంలో కోర్టును ఆశ్రయిస్తున్నాం.

- ముష్టూరు తిమ్మప్ప, అధ్యక్షుడు,  రాయలసీమ ఫిలిం  డిసి్ట్రబ్యూటర్ల అసోసియేషన, గుంతకల్లు

Updated Date - 2022-06-22T07:08:44+05:30 IST