సినీ నిర్మాత ఎం.రామకృష్ణారెడ్డి కన్నుమూత

ABN , First Publish Date - 2022-05-27T08:56:52+05:30 IST

సినీ నిర్మాత ఎం.రామకృష్ణారెడ్డి కన్నుమూత

సినీ నిర్మాత ఎం.రామకృష్ణారెడ్డి కన్నుమూత

చెన్నై, మే 26 (ఆంధ్రజ్యోతి): సీనియర్‌ సినీ నిర్మాత మొలకల రామకృష్ణారెడ్డి (74) చెన్నైలో కన్నుమూశారు. రెండు రోజుల క్రితం హఠాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ని నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ బుధవారం రాత్రి పొద్దుపోయిన తరువాత తుదిశ్వాస విడిచారు. గురువారం మధ్యాహ్నం స్థానిక వలసరవాక్కంలోని విద్యుత్‌ దహన వాటికలో రామకృష్ణారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. కాగా.. ఆయనకు భార్య శ్యామల, కుమారులు ఎం.శశికాంత్‌ రెడ్డి, ఎం.సుమంత్‌ రెడ్డి ఉన్నారు. 1946లో నెల్లూరు జిల్లా గూడూరులో జన్మించిన రామకృష్ణారెడ్డి.. ప్రముఖ నిర్మాత, తన బంధువైన ఎం.ఎ్‌స.రెడ్డి ప్రోత్సాహంతో చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు. 1973లో శ్రీరామకృష్ణా ఫిలిమ్స్‌ అనే నిర్మాణ సంస్థను స్థాపించారు. రంగనాథ్‌, శారద జంటగా ‘అభిమానవంతులు’ అనే చిత్రాన్ని తొలిసారి తెరకెక్కించారు. ఆ తర్వాత ‘సీతాపతి సంసారం’, ‘వైకుంఠపాళి’, ‘గడుసుపిల్లోడు’, ‘మావూరి దేవత’, కృష్ణ హీరోగా ‘అగ్ని కెరటాలు’, శోభన్‌బాబు హీరోగా ‘అల్లుడుగారు జిందాబాద్‌’, చంద్రమోహన్‌తో ‘మూడిళ్ళ ముచ్చట’ మోహన్‌ బాబుతో ‘మాయగాడు’ వంటి చిత్రాలను నిర్మించారు. రామకృష్ణారెడ్డి మృతిపట్ల దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడు, సీనియర్‌ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్‌ సంతాపం ప్రకటించారు.

Updated Date - 2022-05-27T08:56:52+05:30 IST