ఫైనల్‌ బీకాం ప్రశ్నపత్రం లీక్‌

ABN , First Publish Date - 2021-09-30T06:16:23+05:30 IST

బీకాం డిగ్రీ ఫైనలియర్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటింగ్‌ పరీక్ష ప్రశ్నపత్రం లీకైంది.

ఫైనల్‌ బీకాం ప్రశ్నపత్రం లీక్‌
విద్యార్థుల మొబైల్స్‌లో మేనేజ్‌మెంట్‌ అకౌంటింగ్‌ ప్రశ్నపత్రం

మదనపల్లె టౌన్‌, సెప్టెంబరు 29: బీకాం డిగ్రీ ఫైనలియర్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటింగ్‌ పరీక్ష ప్రశ్నపత్రం లీకైంది. బుధవారం మధ్యాహ్నం 2గంటలకు పరీక్ష ప్రారంభం కావాల్సి ఉండగా, ఉదయం 11.40గంటలకే చాలామంది విద్యార్థుల మొబైల్స్‌లో ఈ ప్రశ్నపత్రం ప్రత్యక్షమైంది.మదనపల్లె ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల కేంద్రంగా 14 పరీక్ష కేంద్రాలకు రోజూ డిగ్రీ సెకండ్‌, ఫైనలియర్‌ ప్రశ్నపత్రాలను పంపిణీ చేస్తున్నారు. ఇందులో పట్టణంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, బీటీ కళాశాల, జ్ఞానాంబిక, శ్రీనివాస, విశ్వహిత, సాయినాథ, వివేకానంద, సిద్ధార్థ కళాశాలలతో పాటు, బి.కొత్తకోటలో రెండు సెంటర్లు, ములకలచెరువు, తంబళ్లపల్లె, అంగళ్లు విశ్వం కళాశాలకు ఇక్కడి నుంచే ప్రశ్నపత్రాలు పంపుతున్నారు.పట్టణంలోని పరీక్ష కేంద్రాలకు ఉదయం 8.30గంటలకు సెకండ్‌ ఇయర్‌, మధ్యాహ్నం 1.30 గంటలకు ఫైనలియర్‌ ప్రశ్నపత్రాలు పంపుతున్నారు.కానీ బి.కొత్తకోట,అంగళ్లు, ములకలచెరువు, తంబళ్లపల్లె కేంద్రాలకు ఉదయం 7.30 గంటలకే సెకండ్‌, ఫైనలియర్‌ ప్రశ్నపత్రాలను ఒకేసారి అబ్జర్వర్ల ఆధ్వర్యంలో పంపుతున్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం 11.40 గంటలకు మేనేజ్‌మెంట్‌ అకౌంటింగ్‌ ప్రశ్నపత్రం లీకైంది. దీన్ని బట్టి చూస్తే బి.కొత్తకోట, ములకలచెరువు, అంగళ్లు, తంబళ్లపల్లె కేంద్రాల నుంచి ప్రశ్నపత్రం లీక్‌ అయినట్లు సమాచారం. సాయంత్రం 4.30 గంటలకు పరీక్షల అనంతరం పట్టణంలోని పలు సెంటర్ల వద్ద విద్యార్థులతో మాట్లాడగా లీకేజి విషయం తమకు తెలియలేదన్నారు. ఈ విషయమై ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ రాజు వివరణ ఇస్తూ.. మదనపల్లె పట్టణంలో మధ్యాహ్నం 1.30గంటలకు మేనేజ్‌మెంట్‌ అకౌంటింగ్‌ ప్రశ్నపత్రం పంపిణీ చేశామన్నారు. మదనపల్లె పట్టణంలో ఈ ప్రశ్నపత్రం లీకయ్యే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఎస్వీయూ అధికారులు విచారణ చేస్తే అసలు దోషులు ఎవరనేది బయటపడుతుంది. కాగా ప్రశ్నపత్రం లీకైనట్లు తెలిసిన విద్యార్థులు, ఈ పరీక్షను ఎక్కడ రద్దు చేసి తిరిగి నిర్వహిస్తారో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-09-30T06:16:23+05:30 IST