బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి శివైక్యం

May 9 2021 @ 00:07AM
శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి (ఫైల్‌ఫొటో)

అనారోగ్యంతో ఆస్పత్రిలో తుది శ్వాస వదిలారు

బ్రహ్మంగారిమఠం, మే 8: శ్రీమద్విరాట్‌ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం 11వ పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి (75) శనివారం మధ్యాహ్నం 1.20 గంటలకు అనారోగ్యంతో కడపలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శివైక్యం పొందారు. 7వ తరానికి చెందిన ఈయన బ్రహ్మంగారిమఠం 11వ పీఠాధిపతిగా 52 సంవత్సరాలు ఉన్నారు. ఉభయ తెలుగు రాష్ర్టాలతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, రాష్ట్రంలో స్వామివారి భూత, భవిష్యత్తు కాలజ్ఞానం గురించి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అలాగే వీరబ్రహ్మేంద్రస్వామి మఠానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించారు. 52 సంవత్సరాలపాటు వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానాన్ని పుస్తకాలు, సీడీల రూపాల్లో వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి ప్రజలకు అందించారు. వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి పార్థివదేహానికి శనివారం రాత్రి మఠం ప్రాంగణంలో అంతిమ సంస్కారాలు నిర్వహించామని మఠం మేనేజర్‌ ఎన.ఈశ్వరయ్య ఆచారి తెలిపారు.


విద్యాభ్యాసం

వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి 21 జూన 1946 తేదీన భాగీరథమ్మ, శ్రీనివాస స్వాముల వారికి జన్మించారు. వీరు బాల్యంలో తండ్రి వద్ద కొంత విద్య నేర్చుకున్నారు. ఓబయ్య అనే పంతులు వద్ద ప్రాథమిక విద్యను అభ్యసించారు. అప్పటి మఠం మేనేజర్‌ బండికట్ల వెంకటేశ్వరశాసి్త్ర వద్ద వేదం నేర్చుకున్నారు. శతావధాని బోతూరు కాశీపత్య అవధాని ఆస్థాన పండితులుగా ఉన్న కాలంలో వారి నుంచి సాహిత్యాఽధ్యయనం చేశారు.  తెలుగు, సంస్కృతం, ఇంగ్లీషు భాషల్లో మంచి పాండిత్యం కనపరిచారు. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రం అధ్యయనం చేశారు. పతంజలి మహాభాష్యం పఠించారు.


పీఠాఽధిపతిగా..

వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి 1969 ఆగస్టు 10వ తేదీన 11వ పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరు జిల్లాలోని వారి మేనత్త కుమార్తె చంద్రావతమ్మను వెంకటేశ్వరస్వామి వివాహం చేసుకున్నారు. వారికి నలుగురు కుమార్తెలు, నలుగురు కుమారులు. చంద్రావతమ్మ 2005 డిసెంబరు 13న మరణించగా తర్వాత స్వామివారు మారుతీ మహాలక్షుమ్మను 2006 ఫిబ్రవరి 19న వివాహం చేసుకున్నారు. వారికి ఇద్దరు కొడుకులు. స్వామివారికి ముగ్గురు అన్నదమ్ములు, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు.


ఎన్టీఆర్‌తో పరిచయం

దివంగత నేత ఎన్టీరామారావుతో మఠాధిపతికి ఎంతో పరిచయం ఉంది. 1981లో ఎన్టీరామారావు శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి చలన చిత్రాన్ని రూపొందించడానికి వచ్చినప్పుడు మఠంలో 10-12 రోజులు గడిపారు. వీరికి వసతి ఏర్పాటు చేయడంతో పాటు సినిమాకు కావాల్సిన సమాచారాన్ని మఠాధిపతి వెంకటేశ్వరస్వామి అందజేశారు. 


స్వామి ఆధ్వర్యంలో..

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సాహిత్యాన్ని పుస్తకాలుగా తేవడంలో వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి విశేష కృషి చేశారు. చరిత్ర, సాంఘిక, చారిత్రక, ఆధ్యాత్మిక విషయాలతో వీరబ్రహ్మేంద్రస్వామి రాసిన సుప్రభాతాన్ని 1983లో ముద్రించారు. గోవింద వాక్యాలు 1984లో, సిద్దగురుకోన 1986లో, 1988లో, 701 పద్యాలతో కాళికాంబ సప్తతి, 1989లో కాలజ్ఞానతత్వాలు, 80 తత్వాలతో, పాటలతో మంగళహారతి గ్రంథం 2004లో పుస్తకాలుగా తెచ్చారు. అలాగే వీరు 1974లో కాలజ్ఞాన ముద్ర చేయించారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.