ఫైనాన్స్‌ నిధులు పక్కదారి

ABN , First Publish Date - 2021-07-24T06:04:13+05:30 IST

బనగానపల్లె మండలంలో 14, 15వ ఫైనాన్స్‌ నిధులు గోల్‌మాల్‌ అయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2018 ఆగస్టు 2 నుంచి గత సర్పంచ్‌ల పదవీకాలం ముగిసింది.

ఫైనాన్స్‌ నిధులు పక్కదారి

  1. నందవరంలో రూ.29 లక్షల గోల్‌మాల్‌ 
  2. నిగ్గు తేల్చిన అధికారులు 


బనగానపల్లె, జూలై 23: బనగానపల్లె మండలంలో 14, 15వ ఫైనాన్స్‌ నిధులు గోల్‌మాల్‌ అయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2018 ఆగస్టు 2 నుంచి గత సర్పంచ్‌ల పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి గ్రామ పంచాయతీలను స్పెషల్‌ అధికారులు పర్యవేక్షించేవారు. ఈ నేపథ్యంలో కొందరు స్పెషల్‌ అధికారులు తమ ఇష్టం వచ్చినట్లు నిధులను పక్కదారి మళ్లించారనే విమర్శలు ఉన్నాయి. నందవరం గ్రామ పంచాయతీలోనే రూ.29లక్షల మేర పక్కదారి పట్టినట్లు జిల్లా అధికారులు గుర్తించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పంచాయతీ నిధులు, 14, 15 ఫైనాన్స్‌ నిధులను తన భార్య బ్యాంకు ఖాతాలో జమచేసి అవినీతికి పాల్పడినట్లు గ్రామానికే చెందిన ఓ నాయకుడు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో డీఎల్‌పీవోతో పాటు, జిల్లా పరిషత్‌ సీఈవో నిధుల దుర్వినియోగంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. రూ.29 లక్షల అవినీతి జరిగినట్లు అధికారులు కలెక్టర్‌కు, డీపీవోకు నివేదిక ఇచ్చారు. 


ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాం


నందవరం గ్రామ పంచాయతీ నిధుల గోల్‌మాల్‌ విషయంపై ఉన్నతాధికారులు విచారించారు. మాకు ఇంకా పూర్తి సమాచారం అందలేదు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వస్తే సెక్రటరీపై చర్యలు తీసుకుంటాం. 


- ఎంపీడీవో నాగప్రసాద్‌

Updated Date - 2021-07-24T06:04:13+05:30 IST